* మంత్రి ఎస్.సవిత హర్షం
* ఎన్నికల హామీలను నెవర్చేలా బడ్జెట్ రూపకల్పన
* బీసీల చరిత్రలో ఎరుగని కేటాయింపులు
* రూ.47,456 కోట్లు కేటాయింపు
* 5 ఏళ్లలో బీసీలకు జగన్ వెచ్చించింది రూ.1,36,379 కోట్లే
* 2 ఏళ్లలో రూ. 86,464.17 కోట్లు కేటాయించిన సీఎం చంద్రబాబు
* వెయ్యి కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరణ
* కాపులకు రూ.4,890 కోట్లు…ఈడబ్ల్యూఎస్ కు రూ.10,619 కోట్లు
* నేతన్నలకు, నాయీబ్రాహ్మణులకు ఉచిత విద్యుత్
* సీఎం చంద్రబాబుకు, మంత్రి పయ్యావులకు ధన్యవాదాలు
– మంత్రి సవిత
అమరావతి : సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ బీసీలకు వెన్నుదన్నుగా నిలిచే బడ్జెట్ అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తంచేశారు. రూ.వెయ్యి కోట్లతో ఆదరణ పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే బీసీలకు అత్యధిక కేటాయింపులు చేసిన బడ్జెట్ ఇదేనంటూ సీఎం చంద్రబాబుకు, మంత్రి పయ్యావుల కేశవ్ కు మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రూ. 3,22,359 కోట్లు భారీ బడ్జెట్ ను మంత్రి పయ్యావుల ప్రవేశపెట్టారన్నారు. అభివృద్ధికి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ పథకాల కోసం భారీ ఎత్తున నిధులు కేటాయించారన్నారు. పాఠశాల విద్యకు రూ.31,805 కోట్లు, తల్లికి వందనం పథకం అమలుకు 9,407 కోట్లు కేటాయించారన్నారు.
వ్యవసాయానికి 48,340 కోట్లు కేటాయిస్తూ, రైతులతో పాటు బీసీలకూ బడ్జెట్ లో పెద్దపీట వేశారు. ముఖ్యంగా బీసీలకు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కేటాయింపులు చేశారన్నారు. ఉమ్మడి ఏపీలోనూ ఇంత పెద్ద మొత్తంలో బీసీలకు బడ్జెట్ కేటాయింపులు చేయలేదన్నారు. గతేడాది రూ.39,007 కోట్లు కేటాయిస్తే, ఈ ఏడాది రూ.47,456 కోట్లు కేటాయించారని, గతేడాది కంటే 8,450 కోట్లు అదనమని తెలిపారు.
రెండేళ్లలో రూ.86,464 కోట్లు
ప్రస్తుత బడ్జెట్ లో రూ.47,456 కోట్లు, గతేడాది రూ.39,007 కోట్లు…ఇలా రెండేళ్లలో రూ. 86,464.17 కోట్లు కేటాయించారని మంత్రి సవిత తెలిపారు. జగన్ 5 ఏళ్లలో బీసీలకు రూ.1,36,379 కోట్లు కేటాయిస్తే, తమ ప్రభుత్వం రెండేళ్లలోనే 86,464.17 కోట్లు బీసీల అభ్యున్నతికి వెచ్చిస్తోందన్నారు. బీసీల పట్ల సీఎం చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి తెలిపారు. బీసీలకు కేటాయించిన నిధులను ఇతర అవసరాలకు దారిమళ్లించిన ఘనుడు జగన్ అని మంత్రి సవిత విమర్శించారు.
వెయ్యి కోట్లతో ఆదరణ పునరుద్ధరణ
కనుమరుగవుతున్న కులవృత్తులకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి సవిత వెల్లడించారు. దీనిలో భాగంగా రూ.1000 కోట్లతో ఆదరణ పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. 2019 తరవాత అధికారంలోకి వచ్చిన జగన్ ఆదరణ పథకాన్ని నిలిపేసి బీసీల కడుకొట్టారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు రాకతో మరోసారి ఆదరణ పథకం పునరుద్ధరిస్తున్నామని, కుల వృత్తులకు మంచి రోజులు వచ్చాయని మంత్రి సవిత హర్షం వ్యక్తంచేశారు.
రూ.4,890 కోట్లతో కాపులకు అందలం
బీసీలతో పాటు ఆర్థికంగా ఉన్న వెనుకబడిన కులాలకు కూడా సీఎం చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి సవిత కొనియాడారు. దీనిలో భాగంగా ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రూ.10,619 కోట్లను బడ్జెట్ లో కేటాయించారన్నారు. ఇందులో కాపులకు రూ.4.890 కోట్లు కేటాయించి, ఆ సామాజిక వర్గం అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు సీఎం చంద్రబాబునాయుడు మరోసారి రుజువు చేసుకున్నారన్నారు. ఈబీసీ కార్పొరేషన్ కు రూ.916.77 కోట్లు, బ్రాహ్మణ కార్పొరేషన్ కు రూ.345.45 కోట్లు, ఆర్యవైశ్య కార్పొరేషన్ కు రూ.545.05 కోట్లు, క్షత్రియ కార్పొరేషన్ కు రూ.260.18కోట్లు, కమ్మ కార్పొరేషన్ కు రూ.1,711.42 కోట్లు, రెడ్డి కార్పొరేషన్ కు రూ.1,946.56 కోట్లు కేటాయించినట్లు మంత్రి సవిత వెల్లడించారు.
నేతన్నకు, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్
ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చే కార్యక్రమంలో భాగంగా చేనేత కార్మికులకు, నాయీ బ్రాహ్మణులకు, మత్స్యకారులకు ఉచిత విద్యుత్ అందివ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇవ్వనున్నామన్నారు. సెలూన్ షాపులు నిర్వహించే నాయీబ్రాహ్మణులకు కూడా 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వనున్నామన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.450 కోట్లు వెచ్చిస్తోందని మంత్రి తెలిపారు.
చేనేతకు రూ.138.08 కోట్లు
రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. నేతన్నలకు ఉచిత విద్యుత్ అందిస్తూనే, ప్రస్తుత బడ్జెట్ లో చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం రూ.138.08 కోట్లు కేటాయించామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్కాలర్ షిప్పుల కింద 3,377 కోట్లు కేటాయించినట్లు ఆ ప్రకటనలో మంత్రి సవిత వెల్లడించారు.