– అధికార పార్టీ అడ్డగోలు దోపిడీకి సహకరించినందుకా?
– స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలకు చేయించినందుకా?
– రేయింబవళ్లు శ్రమిస్తున్న ఉద్యోగులకు ఎందుకు చేయరు?
– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ధ్వజం
రాష్ట్రంలో 2,33,333 మంది వాలంటీర్లకు సేవాసత్కారాల కింద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం రూ. 239.22 కోట్లు పందేరం చేస్తున్నట్లు గురువారం నాడు ప్రముఖ దినపత్రికల్లో నిస్సిగ్గు ఫుల్ పేజి ప్రకటనలు ఇచ్చింది. సమాజానికి వారు ఎనలేని సేవలు చేశారని, అందుకే వారిని సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులతో సత్కరిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. సేవచేసిన వారిని సత్కరించాలని భావిస్తే రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయిలో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న రెవిన్యూ యంత్రాంగాన్ని సన్మానించాలి.
సెలవులు కూడా లేకుండా నిరంతరం ప్రజల మాన,ప్రాణాలను రక్షిస్తున్న పోలీసు యంత్రాంగాన్ని సత్కరించాలి. ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోయినా మారుమూల పల్లెల్లో సైతం సేవలందిస్తున్న వైద్యాధికారులు, వైద్యసిబ్బందిని సన్మానించాలి. రాష్ట్రంలో ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా సేవలందిస్తున్న 7లక్షలమంది ఉద్యోగ సోదరులను సత్కరించాలి. అంతేతప్ప స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను బెదిరించి ఏకగ్రీవాలు చేసుకోవడానికి సహకరించిన సొంతపార్టీ కార్యకర్తలైన వాలంటీర్లకు వందలకోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి సన్మానాలు చేయడం సిగ్గుచేటు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన గ్యాంగ్ అడ్డగోలు దోపిడీకి సహకరిస్తున్నందుకు సత్కరిస్తున్నారా? ప్రజలపై మోపిన అడ్డగోలు భారాలను ముక్కుపిండి వసూలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి వారిని సన్మానిస్తున్నారా? అక్రమ మద్యాన్ని రాష్ట్రంలో ఏరులై పారిస్తూ తాడేపల్లి ప్యాలెస్ టార్గెట్ ను అధిగమిస్తున్నందుకు సత్కరిస్తున్నారా? ఏం ఘనకార్యాలు చేశారని వాలంటీర్లను సత్కరిస్తున్నారో రాష్ట్రప్రజలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.
వాలంటీర్లంతా వైసిపి కార్యకర్తలేనని గతంలో వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి ప్రకటించారు. మీకు, మీ పార్టీకి సేవలందించారని భావిస్తే తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న ఖజానా సొమ్ముతో వారికి సత్కారాలు చేయండి. స్వార్థ ప్రయోజనాలకోసం ప్రజల సొమ్మును ఎరగా వేయడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.