Suryaa.co.in

Editorial

కోడెలపై వేటుకు.. వేళెప్పుడు?

– కోడెల శివరాం అనుచరులపై వేటు వేయరా?
– షోకాజులకే పరిమితమా?
– సస్పెన్షన్లలో పక్షపాతమెందుకు?
– ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో సస్పెన్షన్లు
– కోడెల వర్గానికి జీవీ ఆంజనేయులు కొమ్ము కాస్తున్నారా?
– అచ్చెన్న ఆదేశాలు జీవీకి లెక్కలేదా?
– కోడె ల శివరాం వర్గాన్ని జీవీ ప్రోత్సహిస్తున్నారా?
– 16 మంది జిల్లా నేతలను ఇప్పటికీ సస్పెండ్ చేయని జీవీ
– కోడెలపై అభిమానమే ఆంజనేయులు మోహమాటానికి కారణమా?
– సత్తెనపల్లిలో పార్టీ వెంటే తమ్ముళ్లు
– శివరామ్‌ను లేపుతున్న టీడీపీ వ్యతిరేక మీడియా
– వారికే ఇంటర్వ్యూలిస్తున్న శివరాం వైఖరిపై తమ్ముళ్ల ఆగ్రహం
– పార్టీ జెండాతో గ్రామాల్లో పర్యటిస్తున్న శివరాం తీరుతో జనం అయోమయం
– శివరామ్ వెనుక ఎవరున్నారన్న దానిపై తమ్ముళ్ల చర్చ
– శివరామ్‌ను సస్పెండ్ చేయడానికి పార్టీ భయపడుతోందా?
– లోకేష్ పర్యటనలోపు శివరామ్‌ను సస్పెండ్ చేస్తారా?
– గుంటూరు జిల్లా టీడీపీలో హాట్‌టాపిక్
( మార్తి సుబ్రహ్మణ్యం)

వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అనేక సమావేశాల్లో స్పష్టం చేస్తుంటారు. నేతలు వస్తుంటారు. పోతుంటారు. కానీ పార్టీ ముఖ్యం అది యువనేత లోకేష్ స్పష్టం చేస్తుంటారు. సొంత అజెండాలున్న ఎవరినీ సహించేది లేదని చంద్రబాబు హెచ్చరిస్తుంటారు. కానీ సత్తెనపల్లిలో మాత్రం అధినేత హెచ్చరికలు పనిచేస్తున్న సూచనలేమీ కనిపించడం లేదు. కోడెల శివరాం పార్టీ ఆదేశాలు ఖాతరు చేయడం లేదు.

పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా.. సత్తెనపల్లి ఇన్చార్జిగా నియమించిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా, తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అంటే అది ఒకరకంగా నేరుగా చంద్రబాబుపై తిరుగుబాటు చేసినట్లే లెక్క.

కానీ దానిని జిల్లా అధ్యక్షుడు జీవీ సీరియస్‌గా తీసుకోరు. అధ్యక్షుడి ఆదేశాలు ధిక్కరించిన నేతలకు.. షోకాజు ఇచ్చి చేతులు దులిపేసుకుంటారే తప్ప, పార్టీని ఇబ్బంది పడుతున్న వారిపై వేటు వేయరు. పార్టీకి సమస్యలు సృష్టిస్తున్న శివరాంపై వేటు వేయకుండా, త మాషా చూస్తుంటారు. పార్టీ అధ్యక్షుడు అచ్చెన్న చెప్పినా లెక్క చేయరు.

కారణం కోడెల శివప్రసాద్‌పై ఉన్న ఆయనకున్న అభిమానం. అది కులాభిమానమా? లేక వ్యక్తిగత ఆరాధనా? ఇతర పార్టీల నుంచి వచ్చే అగ్ర నేతలకు, టీడీపీ జిల్లా స్థాయి నేతలిచ్చే విలువ ఇదేనా? ఇదీ ఇప్పుడు సత్తెనపల్లి టీడీపీ పంచాయితీ. లోకేష్ పాదయాత్ర నేపధ్యంలో.. శివరాంపై వేటు వేస్తారా? ఇంకా లేటు చేస్తారా? అన్న చర్చకు పార్టీ వర్గాల్లో తెరలేచింది.

మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాదరావు తనయుడు శివరాం.. పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆయన ఇంటర్వ్యూలన్నీ టీడీపీని వ్యతిరేకించే ఎలక్ట్రానిక్- సోషల్ మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి. ఆయన ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అంటే తెరవెనుక ఏం జరుగుతోందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఒక టీడీపీ నేతకు.. ఆ పార్టీని వ్యతిరేకించే మీడియా, ప్రత్యేకించి ఎందుకు హైలెట్ చేస్తుంది? దాని వెనుక ఏం జరుగుతుందో మెడపై తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది.

మాజీ మంత్రి, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణను, పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు సత్తెనపల్లి ఇన్చార్జిగా నియమించారు. దీనిని కోడెల శివరాం జీర్ణించుకోలేకపోతున్నారు. కోడెల శివప్రసాద్ వారసుడిని తానే కాబట్టి, ఇన్చార్జి పదవికూడా తనకే ఇవ్వాలన్నది ఆయన డిమాండ్.

పార్టీ కోసం తన తండ్రి అనేక త్యాగాలు చేశారు కాబట్టి, ఇన్చార్జి పదవి కూడా తనకే ఇవ్వాలన్నది ఆయన భావన. నిజానికి సాధారణ డాక్టర్‌గా ఉన్న కోడెలను, ఆ స్థాయికి తీసుకువచ్చింది టీడీపీ మాత్రమేనని పార్టీవాదులు గుర్తు చేస్తున్నారు.

కానీ సత్తెనపల్లిలో కోడెల శివరామ్‌ను సమర్ధించే టీడీపీ నేతలెవరూ లేరు. అధికారంలో ఉండగా వచ్చిన అనేక ఆరోపణలు, పదుల సంఖ్యలో నమోదైన కేసులు, కోడెల కుటుంబం బతికుండగానే, ఆయన ప్రతిష్ఠను మంటగలిపారన్న ఆగ్రహం.. సంప్రదాయ టీడీపీ శ్రేణుల్లో బలంగా నాటుకుంది. అందుకే సత్తెనపల్లిలో ఆ కుటుంబాన్ని ఒంటరిని చేసిందన్నది పార్టీ శ్రేణుల స్థిరమైన అభిప్రాయం. నిజానికి కోడెల ఓటమికి ఆయన కుటుంబసభ్యుల చర్యలే కారణమన్నది, పార్టీ అభిమానుల నిశ్చితాభిప్రాయం.

సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్న కోడెలకు.. నర్సరావుపేట ఎమ్మెల్యేగా పనిచేసిన కోడెలకు అసలు పొంతన-పొలికే లేదన్నది పార్టీ శ్రేణుల భావన. కుటుంబ చట్రంలో చిక్కుకున్న తర్వాతనే, డాక్టర్ కోడెల ఇమేజీ.. దారుణంగా డ్యామేజీ అయిందన్నది కోడెల అభిమానుల అభిప్రాయం.

ఈ క్రమంలో సత్తెనపల్లి ఇన్చార్జిగా వచ్చిన కన్నా, నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఆయన రాకతో నిస్తేజంగా ఉన్న పార్టీ కార్యకర్తలంతా, మళ్లీ పార్టీ జెండాలు పట్టుకుని తిరుగుతున్న పరిస్థితి.

అధికారంలో ఉన్నప్పుడు.. కోడెల కుటుంబచర్యలతో నగుబాటు పాలై, పార్టీకి దూరంగా ఉంటున్న వారంతా, మళ్లీ తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఇటీవలి కాలం వరకూ పార్టీకి దూరంగా ఉన్న కమ్మ సామాజికవర్గమంతా, తిరిగి పార్టీతో మమేకమవుతున్న పరిస్థితి.

నియోజకవర్గ పార్టీ నేతలంతా.. తాము చంద్రబాబు నిర్ణయానికే కట్టుబడి ఉంటామని బహిరంగంగానే చెప్పడంతో, పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తున్న కోడెల శివరాం ఒంటరి అయిన విషాదం. నిజానికి నియోజకవర్గంలోని కమ్మ సామాజికవర్గమంతా శివరామ్‌కు దూరంగా ఉంటున్నారు.

దానితో 16 మంది జిల్లా కమిటీ సభ్యులతో శివరాం.. పార్టీ జెండాలతో గ్రామాల్లో పర్యటిస్తున్న వైనం, అభ్యంతరాలకు దారితీసింది. పార్టీని ధిక్కరించిన ఆ 16 మందిపై చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ నేతలంతా కలసి, నర్సరావుపేట టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులును కోరింది. అయినా ఆయన పట్టించుకోని నిర్లక్ష్య వైఖరి. చివరకు పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదేశాలు కూడా బేఖాతరు చేసిన జీవీ ఆంజనేయులు తీరుపై, సత్తెనపల్లి తమ్ముళ్లు మండిపడుతున్నారు. జీవీ ప్రోత్సాహంతోనే శివరాం రెచ్చిపోయి, పార్టీ అధినేతను ముద్దాయిగా నిలబెడుతున్నారని ఆరోపిస్తున్నారు.

తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన కోడెల శివప్రసాద్ రుణం తీర్చుకునేందుకే, జీవీ ఆంజనేయులు సత్తెనపల్లిలో శివరాంను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని, తమ్ముళ్లు విరుచుకుపడుతున్నారు. వారిద్దరి మధ్య ఉన్న మ్యాచ్‌పిక్సింగ్ వల్లే, శివరాం అనుచరులపై ఇప్పటిదాకా వేటు వేయలేదని సత్తెనపల్లి టీడీపీ సీనియర్లు ఆరోపిస్తున్నారు. అటు శివరాం కూడా.. అప్పట్లో హత్య కేసులో ఉన్న జీవీని కోడెల కాపాడారని చెప్పడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.

నర్సరావుపేట జిల్లాలో.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వివిధ నియోజకవర్గ నేతలను సస్పెండ్ చేసిన జీవీ.. స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు నియమించిన కన్నాను వ్యతిరేకిస్తున్న శివరాంను, ఎందుకు సస్పెండ్ చేయటం లేదు? కులాభిమానమా? తనకు రాజకీయ జన్మనిచ్చిన కోడెల శివప్రసాద్ కుమారుడిని, కాపాడాలన్న వ్యక్తిగత అభిమానమా? అని సత్తెనపల్లి తమ్ముళ్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

నిజానికి సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ శ్రేణులంతా కన్నాతోనే ఉన్నారు. ఆయనతో కలసి పని చేస్తున్నారు. కానీ.. పార్టీ జెండా, కోడెల శివప్రసాదరావు ఫొటో పెట్టుకుని గ్రామాల్లో తిరుగుతున్న శివరాం కార్యక్రమాలతో..గ్రామ ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. శివరాం టీడీపీ కోసమే పనిచేస్తున్నారన్న భ్రమల్లో ఉన్నారు. ఇది కొనసాగితే పార్టీకి నష్టమన్న టీడీపీ నేతల ఆందోళనను జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పట్టించుకోకపోవడమే, ఆయనపై అనుమానాలకు కారణమవుతోంది.

కానీ శివరాం మాత్రం.. తనకు పార్టీ చేసిన అన్యాయం గురించి, గ్రామాల్లో గళం విప్పుతున్నారు. తండ్రి లేని తనను ఒంటరివాడిని చేశారంటూ, సానుభూతి సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తన కుటుంబానికి చంద్రబాబు సమయం ఇవ్వడం లేదంటూ.. చంద్రబాబును దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

చంద్రబాబు నియమించిన కన్నాను విమర్శిస్తున్నారు. తండ్రి చనిపోయిన తర్వాత, చంద్రబాబు తన కుటుంబాన్ని పిలిచి మాట్లాడలేదంటూ.. తెలివిగా చంద్రబాబును, దోషిగా నిలబట్టే రాజకీయాలకు తెరలేపి, సానుభూతి సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

పార్టీలు మారిన వారంటూ కన్నాను పరోక్షంగా విమర్శిస్తున్నారు. తాను మాత్రం పార్టీ మారేది లేదని, తాను అవకాశవాదిని కాదంటూ చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. పరోక్షంగా చంద్రబాబును ప్రజల్లో ముద్దాయిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తుండటాన్ని, టీడీపీ శ్రేణులు సహించలేకపోతున్నారు.

శివరాం పార్టీకి వ్యతిరేకంగా ఇన్ని వ్యూహాలు రచిస్తున్నా, జిల్లా అధ్యక్షుడు జీవి మాత్రం.. ఆయన, ఆయన అనుచరులైన జిల్లా కమిటీ నేతలను మాత్రం సస్పెండ్ చేయకపోవడం వివాదానికి దారితీస్తోంది.

వారిని సస్పెండ్ చేయాలంటూ..సత్తెనపల్లి టీడీపీ సీనియర్లు, జిల్లా అధ్యక్షుడు జీవిని కలసి డిమాండ్ చేశారు. అయితే జీవి మాత్రం.. ‘‘నాకు ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తు చేయండి’’ అని వెటకారంగా మాట్లాడి, సీనియర్లను అవమానించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లోకేష్ పాదయాత్ర, త్వరలో సత్తెనపల్లిలో ప్రవేశిస్తున్న నేపథ్యంలో… కోడెల శివరాం అసమ్మతి కథకు, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు తెరదించుతారా? లేక కులాభిమానంతో కాపాడతారా? అన్న చర్చకు తెరలేచింది.

LEAVE A RESPONSE