-వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకి మద్దతు ఇచ్చి ముస్లింల గొంతు కోశారు
-అల్లాహ్ ఆస్తులు దోచుకోవడానికి బీజేపీ పన్నిన పన్నాగంలో చంద్రబాబు భాగస్వామ్య మయ్యారు
-వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకి వ్యతిరేకమని అసెంబ్లీ సమావేశాలలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి
– ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా డిమాండ్
తాడేపల్లి: ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన హామీలను ఎప్పటి నుంచి అమలు చేస్తారో మైనార్టీ సంక్షేమ దినోత్సవం రోజున ముస్లిం మైనార్టీలకు స్పష్టత ఇవ్వాలని ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా డిమాండ్ చేశారు.
ఎన్నికల వేళ ముస్లింలకు అండగా ఉంటామని హామీ ఇచ్చి వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకి మద్దతు ఇచ్చి ముస్లింల గొంతు కోశారని, అల్లాహ్ ఆస్తులు దోచుకోవడానికి బీజేపీ పన్నిన పన్నాగంలో చంద్రబాబు భాగస్వామ్యమయ్యారని నాగుల్ మీరా దుయ్యబట్టారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో, చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో వక్ఫ్ ఆస్తులు కాపాడతామని, 2019-24 మధ్యన ముస్లిం మైనార్టీలపై జరిగిన అఘాయిత్యాలపై మూడు నెలలలో బాధితులకు న్యాయం చేస్తానని, ఉర్దూ స్పెషల్ డీఎస్సీ, దుల్హన్ పథకం, దుకాన్-మకాన్ పథకం, MFC ద్వారా సబ్సిడీ రుణాలు, ఇస్లామిక్ బ్యాంక్ విధానం, విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణం ఇలా ఎన్నో హామీలు ముస్లిం మైనార్టీలకు ఇచ్చి అధికారం వచ్చి 6 నెలలు అవుతున్నా ఇప్పటికీ ఏ ఒక్క హామీని అమలు చేయని ఈ ప్రభుత్వానికి మైనార్టీ సంక్షేమ దినోత్సవం నిర్వహించే నైతిక హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారం వచ్చి 6 నెలలు అవుతున్నా మౌజన్, ఇమామ్ గౌరవ వేతనం ఇవ్వలేదని.. అదే దేవాలయాల అర్చకులకు, దేవాలయాలకు ఇచ్చిన హామీని నెరవేర్చి అమలు చేస్తున్నారని, బీజేపీ పెద్దలకు భయపడి ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడమే కాకుండా, వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకి కూడా మద్దతు ఇచ్చారని అన్నారు.
ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఇంటికి వచ్చి ఓటు అడిగిన ప్రతి నాయకుడి చొక్కా పట్టుకొని, మాకు ఇచ్చిన హామీలను ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనే రోజు తెచ్చుకోవద్దని, ఎన్డీఏ కూటమి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని లేకుంటే రానున్న రోజుల్లో తీవ్రపరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఎన్డీఏ ప్రభుత్వాన్ని నాగుల్ మీరా హెచ్చరించారు.
ఎన్నికల వేళ ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటామని, మీ మనోభావాలు దెబ్బతినేలా ఏది చేసినా నేను ముందుండి పోరాడతానని చెప్పిన చంద్రబాబు నాయుడు, నేడు ఇచ్చిన మాటపై చిత్తశుద్ధి ఉంటే వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకి వ్యతిరేకమని రానున్న అసెంబ్లీ సమావేశాలలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు.