-మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం గొడుగు కింద కొనసాగే జర్నలిస్టుల ఆరోగ్య, ఇళ్ల స్థలాల, మహిళా సంక్షేమ, దాడుల వ్యతిరేక, సోషల్ అండ్ డిజిటల్ మీడియా, గ్రామీణ విలేకరుల సంక్షేమ, భావ స్వేచ్ఛ మేగజైన్ సబ్ కమిటీలు అంకితభావంతో చురుకుగా పనిచేయాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ , ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయు) జాతీయ అధ్యక్షులు, టీయూడబ్ల్యూజే సలహాదారు కె.శ్రీనివాస్ రెడ్డి సూచించారు.
శుక్రవారం నాడు బషీర్ బాగ్ లోని టీయూడబ్ల్యూజే కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ అధ్యక్షతన జరిగిన సబ్ కమిటీ బాధ్యుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆయా కమిటీలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ, యూనియన్ పట్ల జర్నలిస్టుల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని శ్రీనివాస్ రెడ్డి సూచించారు. గత ఐదేళ్లుగా ఆరోగ్య కమిటీ సంతృప్తికరమైన సేవలందిస్తుందని ఆయన కితాబు ఇచ్చారు.
జర్నలిస్టులకు ఆరోగ్య పథకం రూపకల్పనకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, ఆ పథకం ప్రవేశపెట్టేంత వరకు నిమ్స్ ఆసుపత్రిలో జర్నలిస్టులు ఆరోగ్య సేవలు పొందాలని ఆయన తెలిపారు. అలాగే ఏ సొసైటీల్లో లేకుండా, ఇళ్ల స్థలాలకు నోచుకోని జర్నలిస్టుల సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు హౌసింగ్ కమిటీ కృషి చేయాలన్నారు. మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు జర్నలిస్టులకు ఇంటి స్థలాలను అందించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు దాడుల వ్యతిక కమిటీ అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. వృత్తిలో మహిళలు అనుభవిస్తున్న ప్రత్యేక సమస్యలను వెలికి తీసేందుకు మహిళా కమిటీ కృషి చేయాలన్నారు.
ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రాంనారాయణ, ఐజేయు కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, ఆరోగ్య కమిటీ సలహాదారు డాక్టర్ ధనుంజేయ, కన్వీనర్ ఏ.రాజేష్, హౌసింగ్ కమిటీ కన్వీనర్ వి.వి.రమణ, మహిళా కమిటీ కన్వీనర్ పి.స్వరూప, గ్రామీణ విలేకరుల కమిటీ కన్వీనర్ గుడిపల్లి శ్రీనివాస్ లతో పాటు ఆయా కమిటీల సభ్యులు పాల్గొన్నారు.