– నాడు గల్లా ఎగరేసిన రైతు-నేడు నేలచూపులు చూస్తున్నాడు
– భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: యాసంగి పోయి -వానాకాలం వచ్చింది. వానాకాలం పోయి-మళ్లీ యాసంగి వచ్చింది. నాడు గల్లా ఎగరేసిన రైతు-నేడు నేలచూపులు చూస్తున్నాడు. నాడు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసిన రైతన్న నేడు ఆత్మన్యూనతతో తండ్లాడుతున్నడు. రుణం తీరక,కొత్త రుణం లేక, అప్పు పుట్టక రైతన్న ఆగమైతుండు.
రైతు భరోసా మీద వేసిన మంత్రివర్గ ఉపసంఘంలో మాత్రం చలనం లేదు. రెండు విడతలుగా రూ.20 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టి రూ.31 వేల కోట్ల రుణమాఫీ అని ప్రకటించి .. రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేసి తాంబూలాలు ఇచ్చాం తన్నుక చావండి అంటున్నారు. రూ.15 వేల రైతుభరోసా కోసం రైతులు, కౌలురైతులు ఎదురుచూస్తున్నారు. రూ.12 వేల రైతుభరోసా కోసం రైతు కూలీలు ఎదురుచూస్తున్నారు.
రెండు పంటలకేనా రైతుబంధు ? మూడో పంటకు ఇవ్వరా అని అధికారం కోసం బీరాలు పలికిండ్రు. మొదటిపంటకే పెట్టుబడి సాయం దక్కక రైతులు ఎప్పుడిస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్ని ఎకరాలకు ఇస్తారో, ఎప్పటినుండి ఇస్తారో, అసలు ఇస్తారో, ఇవ్వరో, ఇప్పటి వరకు స్పష్టత లేదు. రైతు భరోసా సాయం సున్నా. రుణమాఫీ అరసున్నా. రైతు బీమా గుండుసున్నా. కాంగ్రెస్ కరకుగుండెలు కరిగేది ఎన్నడు ? రాష్ట్రంలో రైతన్నల కష్టాలు తీరేది ఎన్నడు ?