రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్
తాడేపల్లి: సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కి ఎప్పుడు స్వాతంత్య్రం వస్తుందో చెప్పాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే స్వాతంత్రం నీకు ఉందా…? అని ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లో 175 ఎమ్మెల్యే స్థానాలలో, 25 ఎంపీ స్థానాలలో నీ పార్టీ పోటీ చేస్తుందా.. లేదా.. దీనికి ముందుగా పవన్ సమాధానం చెప్పాలన్నారు. దేశమంతా స్వాతంత్య్రం వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో పవన్ కళ్యాణ్ రాజకీయ కామెంట్లు చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఒంటరిగా పోటీ చేసే స్వాతంత్రం లేని నువ్వు స్వాతంత్య్రం గురించి మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. అసలు తెలుగుదేశం పార్టీ నుండి జనసేన పార్టీకి స్వతంత్రం వచ్చిందా.. అని పవన్ కళ్యాణ్ ని సూటిగా ప్రశ్నిస్తున్నా అన్నారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో.. తెలుగుదేశం పార్టీ నుండి స్వతంత్రం కోసం జనసైనికులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్… చంద్రబాబు నాయుడుకి మేలు చేయడానికే ప్రయత్నిస్తున్నాడు తప్ప, అతని వల్ల, ఆ పార్టీ వల్ల రాష్ట్రానికి ఎటువంటి మేలు లేదని చెప్పారు.