వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమవుతున్నా సహాయక చర్యలేవి?

– కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోని పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది
– రాజకీయాలను పక్కనపెట్టి సీఎం ఇకనైనా సహాయక చర్యలు చేపట్టాలి
– ముంపు బాధిత ప్రాంతాల్లో యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి
– మరో రెండ్రోజులు భారీ వర్షాలున్న నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో అనేక ప్రాంతాలు జలమయ్యాయి. పెద్ద ఎత్తున పంట, ఆస్తి నష్టం వాటిల్లింది. కొన్ని చోట్ల ప్రాణనష్టం జరిగినట్లు వార్తలొస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్దత కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వరద ఉధ్రుతితో కడెం ప్రాజెక్టు వద్ద పరిస్థితి భయానకంగా ఉన్నా ప్రభుత్వం అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైంది.

ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకనైనా కేసీఆర్ రాజకీయాలను పక్కనపెట్టి వరద సహాయ చర్యలపై దృష్టి సారించాలి. తక్షణమే కడెం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరదను అంచనా వేస్తూ అధికారులు అప్రమత్తంగా ఉండటంతోపాటు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ప్రాణ, పంట, ఆస్తి నష్టం వాటిల్లికుండా చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు జగిత్యాల, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇళ్ల నుండి బయటకు వచ్చే పరిస్థితి లేనందున ఆహారం, తాగునీరు, ఇతర నిత్యావసరాలు అందించేలా చర్యలు తీసుకోవాలి.

వర్షాల కారణంగా శిథిలావస్థలోనున్న అనేక భవనాలు నాని కూలిపోయే ప్రమాదం ఏర్పడినందున వెంటనే వాటిని గుర్తించి అందులో నివాసముంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించే అవకాశాలున్నాయి. వరద అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను తరలించాలి.

రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిపై ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సహాయ చర్యల్లో నిమగ్నమయ్యేలా కృషి చేయాలి.
వెంటనే అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కంట్రోల్ రూంలు, హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసి సహాయ చర్యలను పర్యవేక్షించాలి. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా.

Leave a Reply