Suryaa.co.in

Telangana

సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి

-ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంవల్లే ఈ పరిస్థితి దాపురించింది
-40 వేల ఎకరాలపైగా పంట నష్టం
-పెద్ద ఎత్తున కూలిన ఇండ్లు, చనిపోయిన మూగజీవాలు
-తిండి లేక అల్లాడుతున్న ప్రజలను కనీసం ఆదుకోవాలనే సోయి లేదా?
-తక్షణమే ప్రభుత్వం స్పందించి యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి
-పంట నష్టం అంచనా వేసి రైతులకు పరిహారం అందించాలి
-బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలి
-ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు

ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో భారీ వర్షాలతో జన జీవనం స్తంభించిపోయింది. 40 వేలకుపైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వందలాది ఇండ్లు కూలిపోయాయి. పెద్ద ఎత్తున మూగజీవాలు చనిపోయాయి. పెద్ద ఎత్తున ఇండ్లు మునిగిపోవడంతో సరుకులన్నీ తడిసిపోయాయి.

నిన్నటి నుండి ప్రజలు తిండి లేక అల్లాడుతున్నారు. కడెం ప్రాజెక్టుకు సంబంధించి 18 గేట్లు ఉన్నప్పటికీ… ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంవల్ల అవి సకాలంలో ఓపెన్ కాలేదు. ఇప్పటి వరకు 17 గేట్లు మాత్రమే తెరుచుకున్నాయి. దీంతో వరద తాకిడికి చుట్టు పక్కల గ్రామాలన్నీ ముంపుకు గురయ్యాయి. రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. చాలా చోట్ల కల్వర్టులు తెగిపోయాయి. ప్రజలను పరామర్శించడానికి కూడా వెళ్లలేని దౌర్భాగ్య స్థితి నెలకొంది.

ఈ దుస్థితికి ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణం. ప్రభుత్వం ముందే అప్రమత్తమై యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుని ఉంటే ఇంతటి నష్టం వాటిల్లేది కాదు. నిన్నటి నుండి ప్రజలు తిండి లేక అల్లాడుతుంటే కనీసం భోజన సదుపాయాలు కూడా కల్పించకపోవడం దారుణం.

గుడి హత్నూర్ మండలంలో స్థానిక జడ్పీటీసీ, బీజేపీ కార్యకర్తలతో కలిసి బాధితులకు భోజన సదుపాయం కల్పిస్తున్నాం. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం మొద్దు నిద్ర వీడాలి. యుద్ద ప్రాతిపదికన బాధితులకు భోజన సదుపాయాలు కల్పించేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలి.

అట్లాగే తక్షణమే పంట నష్టం అంచనా వేయాలి. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20 వేల ఆర్దిక సాయం అందించాలి. దెబ్బతిన్న ఇండ్లకు, చనిపోయిన మూగ జీవాలను అంచనా వేసి బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. ముఖ్యంగా ధ్వంసమైన రోడ్లను, తెగిపోయిన కల్వర్టలను వెంటనే మరమ్మతు చేసి పునరుద్దరించి జన జీవనానికి ఇబ్బంది లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE