Suryaa.co.in

Political News

వేల ఎకరాల భూములు సమీకరించిన ‘నారాయణ’ ఎక్కడ ?

– నీ వల్ల రోడ్డున పడిన అమరావతి రైతులకు సంఘీభావం కూడా తెలపవా?
– జగన్ చేస్తున్న ప్రతి పాపానికి మాజీ మంత్రి నారాయణ బాధ్యత వహించాల్సిందే
అమరావతి భూములు సేకరించిన మాజీమంత్రి నారాయణ నీవు ఎక్కడ? 2014 నుంచి 2019 వరకు తెల్లారేసరికి రాజధాని ప్రాంతాల్లో ఇల్లు, ఇల్లు తిరిగి భూములు తీసుకొన్నావే. ఇప్పుడు నీవు భూములు సేకరించిన రైతులు రోడ్ల పాలైతే నీవు మాత్రం నెల్లూరు లో కూర్చుని సేద తీరుతున్నావా?.నీకు అక్క,చెల్లెలు వేదన వినపడటం లేదా,ఆ కన్నీటి చుక్కల శబ్ధం నీ చెవికి చేరలేదా చెప్పు నారాయణ? నెల్లూరు నీ ఇంటికి అమరావతి రైతులు పాదయాత్రగా నిలదీశే రోజు వస్తుంది.
మంత్రిగా ఎన్నిసార్లు అమరావతిలో పర్యటించావు.నీవు చంద్రబాబు కలసి చెప్పిన విషయాలు నమ్మి 33 వేల ఎకరాల డాక్యుమెంట్ లు మీకు ఇచ్చారు.పోనీ కట్టిన భవనాలను శాశ్వత భవనాలు అని చెప్పారా?లేదు.పోనీ పోలవరం కొద్దిరోజులు పక్కన బెట్టి రాజధాని శాశ్వత నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేశారా అదీ లేదు.అవన్నీ పూర్తి చేసి రైతుల ప్లాట్ లు వాళ్లకు ఇచ్చిఉంటే ఇప్పుడు రైతులు రోడ్డున పడాల్సి వచ్చేదా చెప్పు నారాయణ. పోనీ ఇదే శాశ్వత రాజధాని అనే శాసనం చేసి కేంద్రంతో రాష్ట్రపతితో ఆమోద ముద్రకూడా వేయించలేదు.సగం బిల్డింగ్లు కట్టి వదిలితే అవి పూర్తి కావాలంటే చంద్రబాబు కు ప్రజలు తిరిగి ఓటు వేస్తారని నీవు,చంద్రబాబు ఆలోచించారు.
ఒక్కనాడైనా టీడీపీ తిరిగి రాకపోతే మనల్ని మాత్రమే నమ్మి ల్యాండ్ పూలింగ్ లో వేల ఎకరాల డాక్యుమెంట్ లు మనకు(సీఆర్డీఏ)కు తీసుకొని ఇచ్చిన రైతులు ఏమై పోతారు అని ఆలోచించి ఉంటే మీరు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పరిపాలించేవారు.నిజంగా చంద్రబాబు, నారాయణ చెప్పండి ఈ ఉసురు ఎవరిది?.ఈ పాపం ఎవరిది?జగన్ లాంటి వాడు సీఎం అయితే అమరావతి,పోలవరం,పట్టిసీమ,మీరు ప్రారంభించిన ప్రతిఒక్కటి సర్వనాశనం చేస్తాడని మీకు తెలియదా? తెలుసు అయినా మీకు బాధ్యత లేదు.
అధికారం ఇస్తే రోజుకు 23 గంటలు సమీక్షలు జరిపిన కాలాన్ని ప్రజలకు వెచ్చించి ఉంటే టీడీపీ కు ఈ గతి పట్టేది కాదు.అమరావతి రాజధాని శరవేగంగా పూర్తి అయ్యేది.డిజైన్లు కోసం మీరు ఎన్ని నెలలు వేస్ట్ చేశారు చెప్పండి.ఒక మంచి డిజైన్ ను ఎంచుకొని అమరావతి నిర్మాణం ప్రారంభించి ఉంటే ఇప్పుడు రైతులు ఇలా రోడ్ల వెంట కాళ్ళు పుళ్లు పడుతూ నడిచే వారా చెప్పండి? జగన్ పోలీసు బలంతో తన్నులు తినాల్సి వచ్చేదా ఆలోచించండి?ఈ రోజు అమరావతి రాజధాని విషయంలో జగన్ చేస్తున్న ప్రతి పాపానికి మాజీ టీడీపీ మంత్రి నారాయణ బాధ్యత వహించాల్సిందే!
నీవు కాలేజీల మీద కోట్లు వెనుకేసుకున్నావు.నీ ఇద్దరి భార్యలకు ,పిల్లలకు ఏ కష్టం లేదు,రాదు.ఒక్కసారి నీకుటుంబతో నీవు మహిళలు చేస్తున్న పాదయాత్రకు వచ్చి వాళ్ళ కాళ్ళు కడిగినా రాజధాని నిర్మాణానికి నీవు,బాబు చేసిన పాపం ప్రక్షాళన కాదు.నిజంగా మాజీమంత్రి నారాయణ నీవు చదువుకున్న వాడివే అయితే, రైతులు చేస్తున్న పాదయాత్రలో పాల్గొని వారి సంఘీభావం తెలుపు.లేదా రైతులు నిన్ను వదిలేసినా, దేముడు అప్ డేట్ అయ్యాడు.ఇప్పటి పాపం ఇప్పుడే చెల్లించుకోవాల్సి వస్తుంది నారాయణ!
సి.హెచ్ దామోదర్
జర్నలిస్ట్,విజయవాడ

LEAVE A RESPONSE