– జగనన్నను కలవాలంటే గగనమే
– తాజాగా విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రాజీనామా
– మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎంఓ అధికారులే దిక్కా?
– పండుగ నిధులకూ సీఎంఓను దేబిరించాల్సిందేనా?
– మంత్రులు, ఎంపీలకే అపాయింట్లు ఇవ్వని దుస్థితి
– సమన్వయకర్తలను కలిస్తే సరిపోతుందా?
– ప్రజాప్రతినిధులకంటే సమన్వయకర్తలే ఎక్కువా?
– ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులకే సమయం ఇవ్వకపోతే ఎలా?
– విలువ లేని చోట ఉండేదెలా?
– వైఎస్ తరహా గౌరవం వైసీపీలో ఏదీ?
– ప్రజాప్రతినిధులు, నేతలను గౌరవించిన వైఎస్
– కెవిపి చక్రం తిప్పినా వైఎస్ నేతలను కలిసేవారు కదా?
– మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో వైఎస్ చాంబర్ కళకళ
– అందరి అభిప్రాయాలతోనే వైఎస్ నిర్ణయాలు
– ఎమ్మెల్సీ, జడ్పీ, మున్సిపల్, రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికల్లోనూ అదే పాటించిన వైఎస్
– వైసీపీలో నేతల అభిప్రాయాలకు విలువేదీ?
– ఏ ఎంపికల్లోనూ స్థానం లేని సీనియర్లు
– ఆత్మాభిమానం ఎంతకాలం చంపుకోవాలి?
– కేసీఆర్ తరహా వ్యవస్థను అనుసరిస్తే ఎలా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
రాజకీయాల్లో చాలామంది గౌరవం కోసమే కొనసాగుతారు. మరికొందరు డబ్బు, పదవుల కోసమూ ఉంటారు. నాయకత్వం ఎంత అవమానించినా పట్టించుకోరు. వారిది అదో తరహా. వారిని పక్కనపెడితే.. ఆరుపదుల వయసు దాటిన వారిలో మెజారిటీ శాతం.. గౌరవం- విలువ కోసమే పాకులాడుతారు. రాజకీయ కుటుంబాలయితే, పదవుల కంటే కేవలం వాటినే కోరుకుంటారు. వెళ్లగానే పిలిచే నాయకత్వాలను ఆరాధిస్తారు. భుజం మీద చేయి వేసి.. కప్పు కాఫీ ఇచ్చి, కులాసా కబుర్లు చెబితే.. తాము చెప్పిన పనులు కాకపోయినా పొంగిపోతారు. అసలు వచ్చిన పనులు కూడా మర్చిపోయిన సందర్భాలు వైఎస్ జమానాలో అంతా చూసిందే.
తమకిచ్చిన గౌరవాన్ని, వందలమందికి గొప్పగా చెప్పుకుని మురిసిపోతారు. నాయకుడంటే అలా ఉండాలని సంబరపడిపోయి చెబుతారు. ఈ లక్షణాలన్నీ పాత, ప్రస్తుత తరాలు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, టీడీపీ అధినేత- మాజీ సీఎం చంద్రబాబునాయుడులో ప్రత్యక్షంగా చూసి దర్శించినవారే.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడయితే, సీనియర్లకు బోలెడంత గౌరవం దక్కేది. సీఎంల వద్ద వాదించే సీనియర్ల సంఖ్యకు లెక్కలేదు. మంత్రులు-ఎమ్మెల్యేలు-పార్టీ జిల్లా అధ్యక్షులకు అపాయింట్‌మెంట్ సమస్యలు ఎదురయ్యేవి కాదు.
కానీ ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరి అందుకు పూర్తి భిన్నం. వారు అనుకుంటేనే ఎవరినయినా కలుస్తారు. లేకపోతే ఎంతపెద్ద నేతలకయినా అపాయింట్‌మెంట్లు దక్కవు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలయినా సరే.. ఎవరికీ వారి దర్శన భాగ్యం దక్కదు. గతంలో మీడియా ప్రతినిధులు సీఎంలను తరచూ కలిసేవారు. ఇప్పుడు జగన్‌ను కలిసే మీడియా ప్రతినిధుల సంఖ్యను వేళ్లపైనే లెక్కబెట్టవచ్చు.
అలాంటి ప్రముఖులందరికీ సీఎంఓనే దిక్కు. సీఎంఓ అధికారుల దయ, వారి ప్రాప్తం. సీఎంకు ఇష్టుడైన అధికారిని కలిస్తే, సీఎంను కలసినంత పుణ్యం. అంతే! ఈ ప్రజాస్వామ్య యుగంలోనూ.. తాము దైవాంశసంభూతులమని, తమది రాజుల అంశ అన్నది వారి ప్రగాఢ నమ్మకం.
లక్షలమంది ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు అలాంటి రాజులు, జమిందారుల మనస్తత్వం ఉన్న వారే అధినేతలు కావడం ఆశ్చర్యం. మళ్లీ వీరే ప్రధాని, హోంమంత్రి అపాయింట్‌మెంట్ల కోసం తపిస్తుంటారు. విధేయత ప్రదర్శిస్తారు. అడక్కుండానే పార్లమెంటులో బిల్లులకు మద్దతునిస్తుంటారు. కానీ వీరు మాత్రం తమ స్థాయిలో, ఎవరికీ అపాయింట్‌మెంట్లు ఇవ్వరు. సొంత పార్టీ ప్రముఖులకు అపాయింట్‌మెంట్లు ఇవ్వని వీరు.. సినిమా హీరోలు, బడా కాంట్రాక్టర్లు, పక్కరాష్ట్రాల పారిశ్రామివేత్తలకు మాత్రం, అడిగిన వెంటనే దర్శనమిచ్చేస్తుంటారు. అదీ.. వీరు తమ సొంత పార్టీ నేతలకు ఇచ్చే విలువ. అది వేరే ముచ్చట.
ఇక విశాఖ జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ తన పదవికి, పార్టీ పదవికి రాజీనామా చేశారు. తనకిచ్చిన పదవికి న్యాయం చేయనప్పుడు, కార్యకర్తల సమస్యలు అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్లి , వారికి న్యాయం చేయలేనప్పుడు.. ఆ పదవి వృధా అని ఆవేదన వ్యక్తం చేశారు.
వీటిని చర్చించేందుకు, సీఎం జగనన్న అపాయింట్‌మెంట్ కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా సాధ్యం లేదన్నది, ఆయన తన రాజీనామాకు చెప్పిన కారణం. అయితే పెందుర్తి సీటు ఆశించిన పంచకర్లకు కాకుండా.. సిట్టింగ్ ఎమ్మెల్యేకే సీటు ఇస్తామని, వైవి సుబ్బారెడ్డి చెప్పడమే రమేష్ రాజీనామాకు మరో కారణమంటున్నారు. అది వేరే కథ. ఇక ఎమ్మెల్యేలుగా ఉంటూ, జిల్లా అధ్యక్ష పదవులుగా పనిచేస్తున్న మరికొందరు కూడా తమ అధ్యక్ష పదవులకు రాజీనామా చేశారు.
అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ, తిరుపతి జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, గుంటూరు జిల్లా అధ్యక్షురాలు సుచరిత, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బుర్ర మధుసూదన్ యాదవ్ తమ అధ్యక్ష పదవులకు రాజీనామా చేశారు. సొంత నియోజకవర్గాల్లో పనిభారం ఉన్నందున, అధ్యక్ష పదవుల నుంచి తప్పుకుంటున్నామన్నది వారు చెప్పిన కారణం. నిజానికి తమకు పార్టీ అధినేత సమయం ఇవ్వడం లేదన్నది వారి అసలు సమస్య.
అయితే పంచకర్ల రమేష్ సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే. తాను సీఎంకు వాటిని వివరించేవాడినని, ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త, వైవి సుబ్బారెడ్డి మీడియాకు చెప్పిన వివరణ. సుబ్బారెడ్డి ఇచ్చిన వివరణ పరిశీలిస్తే..పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులకు.. జగనన్న దర్శనభాగ్యం దొరికే అవకాశం లేదని స్పష్టమవుతుంది. వారంతా సమన్వయకర్తలతో మాత్రమే మాట్లాడాలని.. ప్రజాప్రతినిధులు-జిల్లా అధ్యక్షులది, జగనన్నతో మాట్లాడే స్థాయి కాదన్నది పార్టీ సిద్ధాంతంగా అర్ధమవుతూనే ఉంది.
నిజానికి ఇలాంటి అవమానకర పరిస్థితులు, వైసీపీ ప్రజాప్రతినిధులకు గత నాలుగున్నరేళ్ల నుంచి అలవాటయిపోయాయి. వారు కూడా వాటిని అలవాటుచేసుకున్నారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ ఒక్కరికే ఆవేశం కట్టలుతెగి.. ఆత్మాభిమానం చంపుకోలేక, పార్టీ నుంచి బయటపడ్డారు. ఇలాంటి పంచకర్లలు ఇంకెంతమందో ఉన్నారన్నది బహిరంగ రహస్యం.
ఎమ్మెల్యేల పరిస్థితి మరీ దారుణమన్నది, పార్టీలో తరచూ వినిపించే చర్చ. గుంటూరు జిల్లాలోని ఒక వైసీపీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో, పల్నాటి ఉత్సవాలు జరుగుతుంటాయి. దానికి నిధుల కోసం కలెక్టర్‌ను అడిగితే, ఆయన నిధులు లేవన్నారు. దానితో ఎమ్మెల్యే సీఎంఓ కీలక అధికారిని వేడుకున్నారు. ఆ ఉత్సవాలు తమకు ప్రతిష్ఠాత్మకమని గోడు చెప్పుకున్నారు. దానితో సీఎంఓ అధికారి కలెక్టర్‌కు ఫోన్ చేసి, నిధులివ్వమని ఆదేశించారు. ఇలాంటి అవ మానాలు అడుగడుగునా ఎదురువుతున్నప్పటికీ, ఎమ్మెల్యేలు వాటిని నోట్లో గుడ్డలు కుక్కుకుని, గరళకంఠునిలా దిగమింగుతున్నారు.
ఇక తమ గెలుపు కోసం పనిచేసిన కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లుల కోసం.. చకోరపక్షుల్లా కలెక్టర్, సీఎంఓ చుట్టూ తిరుగుతున్నా ఫలించని వైనం. సొంత పార్టీ నేతలు- సర్పంచులు, గ్రామాల్లో చేసిన పనులకూ బిల్లులు ఇప్పించలేని దయనీయం. దానితో ఎమ్మెల్యేలకు కింది స్థాయి నేతల్లో విలువ లేకుండా పోయింది.
తమ ఈతిబాధలు జిల్లా ఇన్చార్జి మంత్రులకు చెబితే.. ‘‘మాదీ అదే పరిస్థితి. మీరు చెబుతున్నారు. మేం చెప్పుకోవడం లేదు. అంతే తేడా. సీఎం గారికి ఇవన్నీ చెబుదామంటే ఆయన టైం ఇవ్వరు. సీఎంఓలో చెబితే.. డబ్బుల్లేవు. కొద్ది రోజులు ఆగండి. మీరే వాళ్లను మేనేజ్ చేయండి’’ అని సీఎంఓ అధికారులు సలహా ఇస్తున్న పరిస్థితి. నియోజకవర్గస్థాయి అధికారుల బదిలీలు మాత్రమే, ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారికి ఇస్తున్నారు. అదొక్కటే ఎమ్మెల్యేలకు మిగిలిన ఓదార్పు.
ప్రజల ఓట్లతో గెలిచిన తాము, సమన్వయకర్తలను అడుక్కోవడం.. వారికోసం గంటలపాటు వెయిట్ చేయడం దారుణమని, ప్రజాప్రతినిధులు అవమానంతో రగిలిపోతున్నారు. చివరకు సమన్వయకర్తలు కూడా అందుబాటులో ఉండని సందర్భాలున్నాయని రగిలిపోతున్నారు.
ఇక సీనియర్ల పరిస్థితి మరీ దారుణం. మంత్రులు-ఎంపీలు-ఎమ్మెల్యేలుగా అనేకసార్లు గెలిచిన మాజీలు, వైసీపీలో నెలకొన్న అవమానకర పరిస్థితులను సహించలేకపోతున్నారు. కేవలం గౌరవం-విలువ కోసమే రాజకీయాల్లో కొనసాగుతున్న తమకు, జగనన్న పద్ధతి నచ్చడం లేదన్నది వారి ఆవేదన. దివంగత సీఎం వైఎస్‌ను చూసిన కళ్లతో, ఆయన కొడుకు జగన్‌ను చూడలేకపోతున్నామని, సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్‌తో కలసి పనిచేసినప్పుడు, ఆయన దగ్గర ఎంతో గౌరవం పొందామని గుర్తు చేస్తున్నారు.
వైఎస్ సీఎం చాంబరు నిత్యం.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నేతలతో కళకళలాడేదని గుర్తు చేసుకుంటున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలకు సులువుగా అపాయింట్‌మెంట్ దొరికేది. కీలక సమస్య వచ్చినప్పుడు, అప్పటికప్పుడే పరిష్కరించిన సందర్భాలున్నాయని చెబుతున్నారు. చాలాసందర్భాల్లో సామాన్య కార్యకర్తలు కూడా, నేరుగా వైఎస్‌ను కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయంటున్నారు.
ఎన్నికల సమయంలో అయితే మంత్రులు-ఎమ్మెల్యేలు-జిల్లా పార్టీ అధ్యక్షుల అభిప్రాయాలు అడిగిన తర్వాతనే, వైఎస్ తుది నిర్ణయం తీసుకునేవారని సీనియర్లు చెబుతున్నారు. కెవివి రామచంద్రరావును అంతా కలసినప్పటికీ, వైఎస్‌ను కూడా కలిసేవారు. కీలకమైన సమస్య ఉంటే, కెవిపినే వైఎస్‌ను కలవమని సలహా ఇచ్చేవారని చెబుతున్నారు.
ఇప్పుడు జగన్‌ను కలవాలంటే గగనమవుతోందని, సలహాదారులను కలిస్తే సీఎంను కలిసినంత పుణ్యం అన్నట్లు పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఎలాంటి ఎన్నికయినా, జగనన్న ఎవరితో సంప్రదించకుండా తుది నిర్ణయం తీసుకుంటున్నారని గుర్తు చేస్తున్నారు. మంత్రులకే అపాయింట్‌మెంట్లు లేవంటే.. పార్టీలో ఎంత అవమానకర పరిస్థితి ఉందో అర్ధం చేసుకోవచ్చని, సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాము టీడీపీలో కూడా ఎమ్మెల్యే, మంత్రులు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులుగా పనిచేశామని.. అక్కడ కూడా ఇంత అవమానకర పరిస్థితులు, ఎప్పుడూ చూడలేదంటున్నారు. కాకపోతే అప్పుడు సీఎంఓ అధికారులు సతీష్‌చంద్ర, సాయిప్రసాద్, జిల్లాల్లో కలెక్టర్ల పెత్తనం ఎక్కువగా ఉండేదంటున్నారు. దానితో బాబు చెప్పిన పనులు కూడా చాలా జరిగేవి కావు.
సీఎంఓలో వారిద్దరూ మంత్రులను కూడా లెక్కచేసేవారు కాదని, మంత్రులను నిలబెట్టే మాట్లాడేవాళ్లని తమ అనుభావాలు చెబుతున్నారు. అయినప్పటికీ చంద్రబాబు సీఎంగా ఉంటే సెక్రటేరియేట్.. విపక్షనేతగా ఉంటే ఇల్లు లేదా పార్టీ ఆఫీసులో, ఆయనను సులభంగా కలిసేవారమని గుర్తు చేసుకుంటున్నారు.
తమ ప్రాధాన్యం గుర్తించిన చంద్రబాబు ఏపీ, పీఎస్‌లు వెంటనే స్పందించి, చంద్రబాబు దగ్గరకు పంపించేవారు. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఆయన వెళ్లే సమయంలోనో.. వచ్చే సమయంలోనే ఆయనతో మాట్లాడేవాళ్లమని చెబుతున్నారు. ఇప్పుడు జగనన్న పీఏ, పీఎస్‌లకు తమ ప్రాధాన్యం తెలియదని, వారికి కూడా జగన్‌తో అపాయింట్‌మెంట్ ఇప్పించేంత చనువు-ధైర్యం లేదంటున్నారు.
ఒకప్పుడు ఇంత గౌరవం పొందిన తాము.. ఇప్పుడు సీఎం-పార్టీ అధ్యక్షుడు కూడా అయిన జగనన్న, తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం అవమానంగా భావిస్తున్నామని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.