Suryaa.co.in

National

వనవాసి అయినా నగరవాసి అయినా మొదట మనం భారత వాసులం

– లోక్ మంథన్ లో రాష్ట్రపతి ముర్ము

వనవాసి అయినా, గ్రామ వాసి అయినా, నగర వాసి అయినా.. మనమందరమూ భారతవాసులమని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ ఏకతా సూత్రమే అందర్నీ కలిపి వుంచుతోందని పేర్కొన్నారు. శిల్పకళా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మకమైన లోకమంథన్ భాగ్యనగర్ 2024’’ కార్యక్రమాన్ని జ్యోతిప్రజ్వలన చేసి రాష్ట్రపతి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ… భారత సమాజాన్ని చీల్చడానికి అన్ని మూలలా కుట్రలు జరుగుతున్నాయని, భారతీయ సమాజంలోనే అత్యంత సహజంగా వున్న ఏకత్వ లక్షణాన్ని విచ్ఛిన్నం చేయడానికి, మరి కొందరు భారతీయుల్లో కృత్రిమ భేద భావాలను సృష్టిస్తున్నారన్నారు. అయినా సరే.. భారతీయత అన్న ధర్మం ఆధారంగా ప్రజలందరూ కలిసికట్టుగానే వున్నారన్నారు.

చాలా కాలం పాటు భారత దేశాన్ని విదేశీయులు పాలించారని, ఈ సమయంలో ఆ సామ్రాజ్యవాద శక్తులు భారత ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టడంతో పాటు ఇక్కడి సామాజిక స్థితిగతులను కూడా ఛిన్నాభిన్నం చేశారన్నారు. మన సంస్కృతిని ఆంగ్లేయులు ఏహ్యభావంతో చూసేవారని, అలాగే మనలో కూడా మన సంస్కృతిపై ఏహ్య భావం వచ్చేలా కుట్రలు చేశారన్నారు. విదేశీయులు చాలా సంవత్సరాలు పరిపాలించడంతో మెదళ్లలో వలసవాద బుద్ధే ఆక్రమించిందన్నారు.

భారత్ ని శ్రేష్ఠమైన దేశంగా నిర్మాణం చేయడానికి, భారతీయుల మానసిక ప్రవర్తనను మార్చి, వారిని ఏకత్వం, శ్రేష్ఠత్వం వైపు తీసుకెళ్లాల్సిన కర్తవ్యం అందరిపై వుందని సూచించారు.

కొన్ని సంవత్సరాలుగా వలసవాద, బానిసత్వ మనస్తత్వం నుంచి బయటపడడానికి భారత్ లో కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. ఇందులో భాగంగా భారతీయ న్యాయసంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ చట్టాలను తీసుకొచ్చారన్నారు.

అలాగే ఢిల్లీలో రాజ్ పథ్ పేరును తొలగించి, కర్తవ్య పథ్ గా నామకరణం చేశారని గుర్తు చేశారు. ఈ అంశాలతో పాటు రాష్ట్రపతి భవన్ లో వుండే దర్బార్ హాలు పేరును కూడా గణతంత్ర మండపంగా మార్చుకున్నామన్నారు. మరోవైపు న్యాయ వ్యవస్థలో న్యాయదేవత విగ్రహానికి సంబంధించి, న్యాయదేవత కళ్లకు వుండే వస్త్రాన్ని తొలగించి, మార్పులు చేశారన్నారు. ఈ మార్పులన్నీ భారతీయ ప్రాచీన పరంపర మాధ్యమంగా వచ్చినవేనని, ఈ మార్పులన్నీ వలసవాద, బానిసత్వ మనస్తత్వం నుంచి బయటపడ్డామని కనిపించే ఉదాహరణలేనని రాష్ట్రపతి వివరించారు.

భారతీయ ఆధ్యాత్మికత, పరంపర, కళలు, సాహిత్యం, సంగీతం, చికిత్సా పద్ధతి, భాష ప్రపంచమంతా విస్తరించాయని, ప్రజలు ఆదర్శవంతంగా జీవించడానికి ఇవి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ పరంపరను మరింత పరిపుష్టం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రాచీన కాలం నుంచే భారతీయ ఆలోచాన పరంపర విదేశాలను బాగా ప్రభావితం చేసిందని, ఇప్పుడు మరింత విస్తరించిందన్నారు. ఈ ప్రభావాలు వారి ఆధ్యాత్మికతలో, సంస్కృతిలో ప్రస్ఫుటంగా ద్యోతకమవుతూనే వున్నాయని తెలిపారు.

భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతి అని, అయితే అందులో ఏకత్వం ముఖ్యమైన సారమని రాష్ట్రపతి పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అన్న సారాంశంలో ఏకత్వమే మూలాధారమని, ఇది ఇంద్రధనస్సు లాంటిదని, అదే సుందరత్వాన్ని చేకూరుస్తుందని అభివర్ణించారు.

ఈ లోక్ మంథన్ ను ప్రారంభించడం చాలా ఆనందంగా వుందని రాష్ట్రపతి ప్రకటించారు. 2018 లో రాంచీ వేదికగా జరిగిన లోక్ మంథన్ లో కూడా తాను పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. భారత సంస్కృతిలోని ఏకత్వాన్ని మరింత సుదృఢం చేయడానికి ఈ మంథన్ ఉపయోగపడుతుందన్నారు. ఈ ప్రయత్నం అద్భుతమని కొనియాడారు.

ఇలాంటి కార్యక్రమాల ద్వారా దేశ ప్రజల్లోని స్వాభిమానం, సాంస్కృతిక భావనలకు మరింత పుష్టి చేకూరుతుందన్నారు. భారత సంస్కృతి, సంప్రదాయాలను అర్థం చేసుకోవడంలో, మన పరంపరను ఎప్పటికప్పుడు మరింత పరిపుష్టం చేయడంలో అందరూ తమ వంతు పాత్రను పోషించాలని పిలుపునిచ్చారు.

ఈ లోక్ మంథన్ లో అహల్యాబాయి హోల్కర్, రుద్రమ దేవి లాంటి వీరనారీమణుల జీవిత గాథలను ఆధారంగా చేసుకొని నాటకాలు కూడా వున్నాయని తెలిసి చాలా ఆనందం వేసిందని, వీటి ద్వారా శౌర్య పరంపర, నారీశక్తిని బయటికి తీసినట్లవుతుందని తెలిపారు. ఈ ప్రయత్నం ముఖ్యంగా యువతకు ఎంతో ప్రేరణనిస్తుందని తెలిపారు. భారతీయ కళలు, కళాకారులు జాతిని ఐక్యంగా వుంచడంలో ఉపయోగపడతాయని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు.

LEAVE A RESPONSE