Suryaa.co.in

Andhra Pradesh

ఈ వంచనపై పవన్‌కళ్యాణ్‌ ఏ గుడి మెట్లు కడుగుతారు?

– తల్లికి వందనం పథకాన్ని తల్లికి తద్దినంగా మార్చారు
– సూపర్‌ సిక్స్‌పై ఏడు నెలలకే చేతులెత్తేశారు
– ప్యాంటు టీ షర్టు ధరించి వచ్చిన మహిళను దర్శనానికి ఎలా పంపారు?
– వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి.

తిరుపతి: ఏడు నెలలుగా మోసం, అవినీతి, వంచన, దోపిడీ, దౌర్జన్యాలతో పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడే రోజులు త్వరలోనే రాబోతున్నాయని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు.

తిరుపతిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తప్పుడు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడు నెలల్లోనే సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిందని ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వరుసగా జరుగుతున్న అపచారాలు తిరుమల పవిత్రతను కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సనాతన ధర్మ పరిరక్షకునిగా చెప్పుకునే పవన్‌కళ్యాణ్‌ సమాధానం చెప్పాలని భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపించి సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేయబోవడం లేదని ప్రకటించి ప్రజలను తీవ్రంగా వంచించడమే కాకుండా, వృద్ధి రేటు 15 శాతానికి పెరిగితే సంక్షేమ పథకాలు అమలు చేస్తానని మరో దిక్కుమాలిన అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారు.

ఇదే కూటమి నాయకులు గత జగన్‌ ప్రభుత్వంలో అప్పులపై తమకు నచ్చిన విధంగా తప్పుడు లెక్కలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. పురందేశ్వరి రూ.10 లక్షల కోట్లు అప్పులంటే, పవన్‌కళ్యాణ్‌ రూ.12 లక్షల కోట్లని, చంద్రబాబు రూ.14 లక్షల కోట్లంటూ ఆధారాల్లేని లెక్కలతో గోబెల్స్‌ ప్రచారం చేశారు. నిజానికి 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.4.12 లక్షల కోట్లు అప్పులు చేస్తే, వైఎస్‌ జగన్‌ తన ఐదేళ్ల పాలనలో చేసిన అప్పులు కేవలం రూ.2.30 లక్షల కోట్లు మాత్రమే.

అదే ఆయన ప్రభుత్వం దిగిపోయే 2024 నాటికి రాష్ట్ర అప్పులు రూ.6.42 లక్షల కోట్లు. కానీ కూటమి నేతలు ఇష్టానుసారం అంకెలు చెబుతూ, గత ప్రభుత్వంపై విపరీతంగా దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబు, నీతి అయోగ్‌ రిపోర్టుపై మాట్లాడుతూ, రాష్ట్ర అప్పులు రూ.9.70 లక్షలు అని చెప్పారు.

మరి ఎన్నికల్లో ఇష్టానుసారం హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చంద్రబాబుకి తెలియదా? జగన్‌ కన్నా మిన్నగా రూ.2.5 లక్షల కోట్ల విలువైన సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబుతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రజలకు హామీలు గుప్పించారు.

. తాను సంపద సృష్టిస్తానని ఎన్నికల్లో చంద్రబాబు చెబితే, అది లోకేష్‌ కోసమని జనం గుర్తించలేకపోయారు. బాబు మాటలను గుడ్డిగా నమ్మి మోసపోయారు. అందుకే ఇప్పుడు ప్రజల్లో చంద్రబాబు మీద తీవ్రమైన ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు చెప్పిన తల్లికి వందనం పథకాన్ని తల్లికి తద్దినంగా మార్చేశారు. .

అన్నదాత సుఖీభవను అన్నదాత అప్పోభవగా మార్చారు. ఆడబిడ్డకు నిధి పథకాన్ని ఆడబిడ్డకు ఏడుపు విధిగా మార్చారు. . ఆఖరుకి అధికారంలోకి వచ్చాక 5 లక్షల మందికి పింఛన్లు కట్‌ చేశారు. కూటమి ప్రభుత్వం చేసిన మోసాలకు పవనానంద స్వామి ఏ గుడి మెట్లు కడుగుతాడో చెప్పాలి.

చంద్రబాబు పాలన మొదలైన నాటి నుంచి తిరుమల కొండ మీద అపచారాలు జరగని రోజంటూ లేదు. చంద్రబాబు అనుచరుడు వెంకన్న చౌదరి తిరుమల సంప్రదాయాలకు తిలోదకాలిచ్చేశారు. భక్తులు సాంప్రదాయ వస్త్రాల్లో శ్రీవారిని దర్శించుకోవాలని నిబంధనలున్నా.. ప్యాంటు టీ షర్టు ధరించి వచ్చిన మహిళను దర్శనానికి ఎలా పంపారో తెలియడం లేదు.

(అంటూ ఆ ఫోటో చూపిన టీటీడీ మాజీ ఛైర్మన్‌.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ నుంచి శ్రీవారి సన్నిధి వరకు నడుచుకుంటూ వెళ్తుంటే అడ్డుకోకుండా విజిలెన్స్‌ నిద్రపోతుందా? అధికారులు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు). కొండ మీద రాంభగీచ గెస్ట్‌హౌజ్‌లో చికెన్, మటన్‌ బిర్యానీ తింటున్నారు. మందు తాగుతూ మందు బాబులు కనిపిస్తున్నారు. ఎర్ర చందనం దొంగలు ఇప్పటికే నాలుగు సార్లు పట్టుబడ్డారు. దీనికి సనాతన ధర్మ పరిరక్షణ ఉద్యమ నిర్మాత పవన్‌ కళ్యాణ్‌ సమాధానం చెప్పాలి.

LEAVE A RESPONSE