– 8 శాఖల అవినీతిపై శ్వేతపత్రాలు విడుదల
– విడుదల తేదీలు ఖరారు చేసిన చంద్రబాబునాయుడు
– ఆయా శాఖల అధికారులతో మంత్రుల భేటీలు
– అవినీతి అంశాల గుర్తింపుపై మంత్రుల కమిటీల కసరత్తు
– గత సర్కారు అవినీతిని జనంలోకి తీసుకువెళ్లనున్న బాబు సర్కారు
విజయవాడ: జగన్‌రెడ్డి ప్రభుత్వంలోని 8 కీలక శాఖలలలో జరిగిన అవినీతి అక్రమాలపై శ్వేతపత్రం తయారుచేసి, వాటిని ప్రజల్లో చర్చకు పెట్టేందుకు చంద్రబాబునాయుడు సర్కారు సిద్ధమవుతోంది. ఆమేరకు తాజాగా జరిగిన మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆయా శాఖల అధికారులతో చర్చించేందుకు మంత్రుల కమిటీని ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆ మేరకు శ్వేతపత్రం విడుదల చేసేందుకు తేదీలు కూడా నిర్దేశించింది.
ఆ ప్రకారంగా..ఈ నెల 25న పోలవరం…28న రాజధాని అమరావతి..జులై 1న విద్యుత్, జులై 4న సహజ వనరుల దోపిడీ, ఇసుక, భూములు, మైనింగ్, జులై 8న మద్యం మాఫియా, 10న శాంతి భద్రతలపై.. జులై 12న ఆర్థిక శాఖపై శ్వేతపత్రాలు విడుదల విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఆ మేరకు ఆయా శాఖలు శ్వేతపత్రాలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఆ ప్రకారంగా.. జగన్‌రెడ్డి ఐదేళ్ల సర్కారులో తీవ్రస్థాయిలో జరిగిన అవినీతిని వెలికితీసి, వాటిని ప్రజల్లో చర్చకు పెట్టాలన్నది బాబు సర్కారు ఆలోచనగా స్పష్టమవుతోంది. ఈ శ్వేతపత్రాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు విస్తృతంగా ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వహించడం ద్వారా.. రాజకీయంగా జగన్‌పై మరింత వ్యతిరేకత పెంచడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.