– ప్రకృతి ప్రసాదించిన జాతి సంపదను కాపాడాల్సిన భాధ్యత లేదా?
– కోర్టులు చెప్పినా ఖాతరు చేయని వైసీపీ నేతలు
– పక్కరాష్ట్రాలకు తరలిపోతున్న ఏపీ ఇసుక
– బినామీలతో కోట్లకు పడగలెత్తుతున్న పెద్దలు
– ఇంతకూ జెపి కంపెనీ గడువు ఉన్నట్లా? లేనట్లా?
– గడువు ముగిసినా తవ్వకాలకు అనుమతి ఎవరిచ్చారు?
– ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయి?
– నిఘా నిద్రపోతోందా?
ఇసుక నుండి కాసులు పిండుకొనే విద్యలో మహా ప్రావీణ్యులు వైసిపి నాయకులు. రాష్ట్రాన్ని తవ్వి పారెయ్యడంలో వాళ్ళు ఉద్దండ పిండాలు. ఇసుక ర్యాoపుల్లో వేలాది లారీలు,వందలాది మంది కార్మికులు,పదుల సంఖ్యలో ప్రొక్లైయినర్ల ఇసుక తవ్వకాలు రాత్రింబవళ్ళు కొనసాగుతున్నాయి. లారీలు వెళ్ళేందుకు నదుల్లో ఏకంగా రోడ్లు నిర్మించారంటే, అధికార పార్టీ వైసిపి నాయకుల ఆగడాలు ఎంత తెగించాయో ప్రజలు అర్ధం చేసుకోవాలి.
నదీ ప్రవాహానికి అడ్డంగా రోడ్డు వేయకూడదన్న నిబంధన ఉంది. ఆ నిబంధన తుంగలో తొక్కి సహజ సంపదను ఎధేచ్చగా దోపిడీ చేస్తున్నారు. బకాసురుడి ఆకలి అయినా తీరు తుందేమో కానీ అధికార పార్టీ వైసిపి నాయకుల ధన దాహం తీరేటట్లు లేదు. ధన దాహంతో భవిష్యత్ ను తవ్వేస్తున్నారు అధికార పార్టీ నాయకులు. విచ్చలవిడి ఇసుక తవ్వకాలు భావితరాల అవసరాలకు,జల సంక్షోభానికి, పర్యావరణ విఘాతానికి ప్రధాన కారణం కాబోతున్నాయి.
ప్రకృతి ప్రసాదించిన జాతి సంపదను కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలు తవ్వుకు పోతున్న వైకాపా ఇసుక మాఫియాకు అండగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి, పెన్నానదులలో కాక .. చిన్న,చిన్న ఉపనదుల్లో ఏళ్ల తరబడి కొండలు వలే గుట్టలు పడివున్న ఇసుకను వేలాది లారీలతో కొల్ల గొట్టేస్తున్నారు వైసిపి నాయకులు. జలవనరుల పరిరక్షణ చట్టాలు,నిబంధనలు ఎన్ని వున్నా ఆ నిబంధనలు ఉల్లంఘించి తవ్వేస్తున్నారు.
1-2 మీటర్లు లోతు కన్నా ఎక్కువ తీయకూడదు. కానీ ఇసుక ఎంత లోతు ఉంటే అంత లోతు తవ్వేస్తున్నారు. కృష్ణా,గోదావరి పరివాహక ప్రాంతాల గ్రామాలలో వున్న ఇసుక ర్యాoపులు అధికార పార్టీ నాయకులకు కాసుల వర్షం కురికిస్తున్నాయి. ఇసుక మాఫియా బరితెగించి ఇసుకను తరలిస్తున్న పద్దతిని చూస్తే కళ్ళు భైర్లు కమ్ముతున్నాయి.
కృష్ణా నదికి అడ్డంగా పెద్ద,పెద్ద తూములు వేసి కృష్ణా నదిలో రోడ్డు నిర్మించారు. దీనిని బట్టి ఇసుక మాఫియా ఎంత యథేచ్ఛగా సహజ వనరులను దోపిడీ చేస్తున్నదో అర్ధం అవుతుంది. గత తెలుగుదేశం ప్రభుత్వం ఇసుకను ప్రజలకు ఉచితంగా అందించింది.వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుకను వ్యాపార వస్తువుగా మార్చడంతో ఇసుక మాఫీయా భవిష్యత్ తవ్వి పారేస్తుంది.
అనుమతి 2 కోట్ల టన్నులు ఉంటే,6 కోట్ల టన్నులు తవ్వుతున్నారు. కృష్ణా, గోదావరి, పెన్నా నదుల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు అధికార పార్టీ పెద్దల నేతృత్వంలో, ఏడాదికి రూ 10 వేల కోట్ల దోపిడీ జరిగి నట్లు సమాచారం. జగన్ నాలుగేళ్లలో 3 సార్లు ఇసుక పాలసీలు మార్చారు. తెలుగుదేశం హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ 1500 ఉండగా జగన్ హయాంలో ట్రాక్టర్ రూ 5000 వేలకు చేరింది.
రాష్ట్రంలో జయప్రకాష్ పవర్ వెంచర్స్ పేరుతో అధికారపార్టీ పెద్దలు యథేచ్చగా సాగిస్తున్న ఇసుక దోపిడి జేపీ వెంచర్స్ కాదని, ఆ సంస్థే అధికారికంగా స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపినట్లు సమాచారం. ఇసుక తవ్వేది తాను కాదని, విక్రయించేదీ కూడా తాను కాదని ఆ సంస్థ చెబుతోంది. ఇసుక రేవుల్లో బిల్లులు మాత్రం జేపీ సంస్థ పేరుతో జారీ అవుతున్నాయి. ఈ పని వేరే వాళ్లు సబ్ కంట్రాక్ట్ తీసుకొన్నారని జేపీ సంస్థ చెపుతోంది. అధికారికంగా సబ్ కంట్రాక్ట్ వేరే వాళ్లకు ఇచ్చినప్పుడు, బిల్లులు మాత్రం జేపీ పేరుతో ఇవ్వడం ఏమిటి ?
జేపీ సంస్థ ముసుగులో అధికార పార్టీ నాయకులు ఇసుక బొక్కుతున్నట్లు బట్టబయలైంది. రాష్ట్రంలో ఇసుక పేరుతో జరుగుతున్నదోపిడి భాగోతాన్ని జెపి సంస్థ నివేదిక బట్టబయలు చేసింది. రాష్ట్రంలో ఏడాదికి రూ 10 వేల కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.40 వేల కోట్ల మేర ఇసుకను, రేవుల్లో తవ్వి విక్రయించినట్లు సమాచారం. ప్రభుత్వానికి మాత్రం చిల్లర చెల్లించి ఇసుకాసురులు కనక రాసులు పోగేసుకొంటున్నారు.
రాష్ట్రంలో రూ.40 వేల కోట్ల మేర జరిగిన ఇసుక దోపిడీ పై.. ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు డిమాండ్ చేసినా, ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం లేదు. నోరు తెరిస్తే తమ బాగోతం బయట పడుతుందన్న భయంతోనే , నోరు తెరవడం లేదు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ రెడ్డి పెద్ద ఎత్తున ఇసుక దోపిడి జరుగుతుంది అంటూ ఆరోపణలు చేసి ప్రజలను నమ్మించి , అధికారం లోకి వచ్చిన జగన్.. ఇసుక దోపిడీకి లాకులెత్తారు.ఇసుక దొరకకుండా చేసి, 40 లక్షల మంది భవన నిర్మాణరంగ కార్మికుల పొట్టగొట్టారు.
ఇసుక అక్రమ తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ స్పందించింది.రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై నిగ్గుతేల్చేందుకు ఎన్ జిటి అటవీ,పర్యావరణ మంత్రిత్వ శాఖ, గనులశాఖ, కాలుష్య నియంత్రణమండలి ఉన్నతాధికారులతో సంయుక్త కమిటీని ఏర్పాటుచేసింది. ఇసుక తవ్వకాల్లో హెవీ మిషనరీ ఉపయోగించరాదన్న ఎన్ జిటి ఉత్తర్వులను పక్కనపెట్టి.. గోదావరి, కృష్ణా నదుల్లో డ్రెడ్జర్లు ఉపయోగించి తవ్వకాలు సాగించారు.
జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జీటీ ఉత్తర్వుల ప్రకారం .. రాష్ట్రంలో 110 ఇసుక రీచ్ లలో సెమీ మెకనైజ్డ్ ఇసుక తవ్వకాలు నిలిపివేయాలి. కానీ రాజ్యాoబద్ద సంస్థ ఎన్జీటీ ఆదేశాలు, కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ప్రభుత్వ పెద్దల అండతో ఇసుక మాఫియా చెలరేగిపోతున్న తీరు చూస్తే.. చట్టాలు,నిబంధనలు వైసిపి నాయకులకు వర్తించవా అన్న రీతిగా వుంది.
జెపి పవర్ వెంచర్స్ సంస్థను గుత్తె దారుగా చూపించి, ఇసుక దందా పెద్దఎత్తున సాగుతుంది.3-4 మీటర్ల లోతువరకు ఇసుక తవ్వుతున్నారు. ఒక్కొక్క లారీలో 35 నుండి 40 టన్నుల వరకు ఇసుక లోడు చేస్తున్నారు. సెమీ ఉత్తర్వులు ప్రకారం.. రాష్ట్రంలో ఎక్కడా భారీ యంత్రాలతో ఇసుక తవ్వడానికి వీల్లేదు.
ఇసుకాసురులు నదీ గర్భాల్లోకి జొరబడి భారీ యంత్రాలతో రోజు కొన్ని లక్షల టన్నుల ఇసుకను వేల లారీలు,ట్రాక్టర్లతో దోచుకొంటున్నారు. వర్షాకాలం కావడంతో అవసరాల కోసం వివిధ జిల్లాలలో లక్షల టన్నుల్లో ఇసుకను స్టాక్ పాయింట్లలో నిల్వ చేశారు. కొండల్ని తలపించేలా కుప్పలు పోసి, సొమ్ము చేసుకొంటున్నారు. ఈ విషయంలో గనులు శాఖ అధికారులు వైసిపి నేతలకు అండగా నిలిచారు
కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి పొరుగు రాష్ట్రాలకు ప్రతిరోజూ వేల లారీల ఇసుకను తెలంగాణా, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలించి లారీ లక్ష వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఇసుక దందాకు సాక్షాత్తు రాష్ట్ర మంత్రులే నేతృత్వం వహిస్తున్నారు.
రాష్ట్రంలో ఇసుక మాఫియా ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడుతున్నా ఎన్ పోర్స్ మెంట్ బ్యూరో [సెబ్] అటు వైపు కన్నెత్తి చూడదు.ఇసుక ర్యాంపులలో వే బ్రిడ్జి లు లేవు.కేవలం అంచనాల మేరకు లోడ్ చేస్తున్నారు.ఇసుక తవ్వకాలు, విక్రయాలు, రవాణా పై గనుల శాఖ ఎస్ ఈ బీ అధికారులు తనిఖీలకు వెళ్లరు.
ఎంత లోతు ఇసుక తవ్వుతున్నా అడిగే నాధుడే లేదు.ఇసుక రేవులు,నిల్వ కేంద్రాల్లో డిజిటల్ చెల్లింపులు అంగీకరించడం లేదు.నగదు చెల్లిస్తే నే ఇసుక లోడ్ చేస్తున్నారు.చిన్న కిరాణా షాపుల్లో కూడా ఆన్ లైన్ చెల్లింపులు జరుగుంటే రోజు కోట్లలో వ్యాపారం జరిగే ఇసుకకు ఆన్ లైన్ చెల్లింపులకు అనుమతి లేకపోవడం అంటే, డైరెక్టు నగదు చెల్లింపులు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయి?
ప్రభుత్వ అండతో ఇసుక నుండి కనక రాసులు పోగేసుకొంటున్నారు అధికారపార్టీ నాయకులు ఇసుకను కొల్ల గొడుతున్నా,ప్రభుత్వానికి ఆదాయ రాకపోయినా పట్టించుకోవడం లేదు. దీని మూలంగా నదులు భౌగోళిక స్వరూపాలు మారి ఫలితంగా వరదలు,కరువులు సంభవించే ప్రమాదం వుంది. ఆనకట్టల పునాదుల స్థిరత్వం దెబ్బతిని వాటి ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది.
ప్రభుత్వ ప్రోద్భలంతోనే ఇసుకాసురులు నదీగర్భాల్లో జొరబడి ఇష్టారాజ్యంగా తవ్వుతున్నారు.ఇసుక మాఫియా ఆగడాలు తెలిసినా పట్టించుకొని అధికారులు.భూగర్భజలాలు బయట పడేలా లోతుగా తవ్వకాలు జరుపుతున్నారు.వాల్టా చట్టాన్ని ప్రభుత్వం తూట్లు పొడవడంతో భూగర్భజలాలకు పెనుప్రమాదం ఏర్పడింది.
ప్రైవేటు సంస్థకు తవ్వకాలు అప్పగించడమే కాదు వాల్టా చట్టానికి సవరణలు చెయ్యడం ఎవరి ప్రయోజనాలకోసం అని పర్యావరణ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. గతంలో అనుమతి వున్న రీచ్ లలో కూడా ఇసుక తవ్వకాలు అడ్డగోలుగా తవ్వకుండా నిబందనలు వుండేవి .కానీ ఇప్పుడు ఇష్టారాజ్యంగా తవ్వకాలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం వాల్టా చట్టం సవరణ చెయ్యడం దారుణం.
నదుల్లో ప్రమాదకరంగా గోతులు తవ్వుతున్నారు.ఇసుక ధరను మూడు నుండి నాలుగు రెట్లు ధరను పెంచింది.దీంతో ఇసుక మాఫియా గుట్టు చప్పుడు కాకుండా పొరుగు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకొంటున్నారు.దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడటమే కాదు విలువైన ఖనిజ సంపద కనుమరుగై పోతుంది.ఒక్కొక్క లో లారీ 40 టన్నులు వరకు లోడు చేస్తారు.
హైదరాబాద్ లో లారీ ఇసుక ధర రూ, లక్షకు పైగా ధర పలుకుతుంది.కృష్ణా నది పరీవాహక ప్రాంతాల రీచ్ ల నుండి వేలాది లారీలతో ఇసుక తరలి పోతుంది.ఉదాహరణ కి ఒక్క చందర్లపాడు మండలం కాసరబాద రేవు నుండే రోజుకు 1000 లారీలతో ఇసుకను తరలిస్తున్నారు.ఈ ఇసుక రవాణాలో అధికార పార్టీలో ప్రధాన వ్యక్తుల ప్రమేయం ఉండటంతో అధికారులు సైతం నోరు మెదపడం లేదు.
ఇసుక మనిషి నిత్య జీవితంలో కీలక వనరు గా మారిన పరిస్థితులలో… రానున్న రోజుల్లో ఇసుక భూమి నుండి కనుమరుగు అయ్యే ప్రమాదం ఉందంటూ, ఐక్యరాజ్య సమితి తాజాగా హెచ్చరించడం ఆందోళన కలిగించే విషయం. ఇదే విధంగా ఇసుక తవ్వకాలు జరిగితే భూమి మీద ఇసుక లభ్యత సంగతి మాట అలా ఉంచితే, భూగోళం ఉనికే ప్రమాదంలో పడే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఈ ఇసుక దోపిడిని ఆపాలని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.
ప్రకృతిలో ఇసుక తయారు కావడానికి పట్టే సమయంతో పోలిస్తే, వినియోగం వేల రెట్లు వేగంతో సాగుతుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ వినియోగపు తీరే ఇసుక కొరతకు దారి తీస్తోంది. పెద్ద ఎత్తున పారిశ్రామీకీకరణ, పట్టణీకరణ జరుగుతుండటంతో రానున్నరోజుల్లో ఇసుక వినియోగం మరింతగా పెరగనుందని ఐక్య రాజ్య సమితి అంచనా వేసింది.
అంతే కాకుండా రాష్ట్రంలో వ్యవసాయం తరువాత ఉపాధి పై ఎక్కువ మంది ఆధారపడుతున్నరంగం భవన నిర్మాణ రంగమే అని చెప్పాలి. ఇసుక కొరత కారణంగా నిర్మాణ రంగం కుదేలు కావడంతో రాష్ట్రంలో చోటుచేసుకున్న దుష్పరిణామాలు చూస్తున్నాం. నాలుగేళ్లుగా వైసీపీ ఇసుక కొరత సృష్టించడంతో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్డున పడిన విషయం తెలిసిందే.
ఇసుక తవ్వకాల లో అధికార పార్టీ నేతల,కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. ఉపాధి కల్పనతో పాటు, అభివృద్ధికి కీలకమైన ఇసుక వినియోగం, నియంత్రణకు సంబంధించి పటిష్ట విధానాన్ని రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక తవ్వకాలతో అనేక పర్యావరణ సమస్యలతో పాటు, సామాజిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయని, ఇసుకతో పాటు, నీరు కూడా మాయమవుతోందని, ఇది జలచరాలపై ప్రభావం చూపనుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించడం ఆందోళన కలిగిస్తుంది. ప్రకృతి ప్రసాదించిన జాతిసంపదను కాపాడాల్సిన ప్రభుత్వం తవ్వుకు పోతున్న ఇసుక మాఫియాకు అండగా నిలుస్తున్నది జగన్ ప్రభుత్వం.