Home » తెలుగు రాష్ట్రం దుర్మరణం పాలైన రోజు…

తెలుగు రాష్ట్రం దుర్మరణం పాలైన రోజు…

మరపురాని ఆ చిరునవ్వు… పంచె కట్టు!

అవి 1991 నాటి రోజులు. కదప కాంగ్రెస్ ఎం. పీ డాక్టర్ వై. ఎస్. రాజశేఖర రెడ్డి తూర్పు గోదావరి జిల్లాకు పర్యటనకు వస్తున్నారు అని తెలిసింది. ఆయన పర్యటన అంటే చాలు. ఏ జిల్లాకు ఆ జిల్లాలో కాంగ్రెస్ యువకులు బిల బిలమంటూ ఆయనను చుట్టూముట్టేసి… ఆయనను ఫాలో అవుతుండేవారు.

తూర్పు గోదావరి అంటే ఆయన దృష్టిలో…. రాజమండ్రే. అభిమాన అనుచరులు… అంటే, జక్కంపూడి రామ్మోహన రావు, ఉండవల్లి అరుణ్ కుమార్. తరువాతి వరుసలోనే వట్టి వసంత కుమార్, పల్లంరాజు, ఆయన శ్రీకాకోళపు శివ సుబ్రహ్మణ్యం తదితరులు.

1991 లో ఓ సారి కాకినాడ సమీపంలో ఏదో కార్యక్రమానికి వస్తున్నట్టు తెలిసింది. ఆ సమయం లో నేను కాకినాడ లో ‘ఆంధ్రభూమి ‘ రిపోర్టర్ గా ఉన్నాను. జక్కంపూడి రామ్మోహన్ రావు కు ఫోన్ చేసి, వై. ఎస్. తో ‘ మీట్ ది ప్రెస్ ‘ పెడతాను, కాకినాడ తీసుకు రావాలి అని కోరాను.

‘ జక్కంపూడి ‘ అంటే… పొగరుమోతు పోట్ల గిత్త. ఒక్క వై. ఎస్. ను తప్ప ఎవరినీ కేర్ చేసే రకం కాదు. జక్కంపూడి దంపతులు ఉండేది రాజమండ్రి అయినా, నేను ఉండేది కాకినాడ లో అయినా…. నా పట్ల అపారమైన ప్రేమాభిమానాలతో ఉండేవారు. నా స్థాయికి మించిన ప్రేమాభిమానాలు.

నేను అడిగేవరకు – వైఎస్ కు ఆ పర్యటన లో కాకినాడ లేదు. నేను అడగ గానే, వెంటనే ఓకే చెప్పి, ఉదయం 10 గంటలు అని టైమ్ కూడా ఇచ్చేశారు. జక్కంపూడి ఓకే చెప్పగానే, నాకు దడ వచ్చేసింది. అడగడం అయితే అడిగాము గానీ, వై. ఎస్. ను హ్యాండిల్ చేయగలమా? ఆయన స్థాయికి తగిన హాల్ ఎక్కడ ఉంది? వంటి ప్రశ్నలతో మా జర్నలిస్ట్ ల బుర్రలు హీటెక్కి పోయాయి.

ఠప్ మని జిల్లా పరిషత్ సమావేశ మందిరం గుర్తుకు వచ్చింది. అంతకు ముందే, మూడు కోట్లతో ఆ హాల్ ను రంగ రంగ వైభవం గా తీర్చి దిద్దారు, బాగా డబ్బున్న వారి ఇంట్లో పెళ్లి కూతురుని ముస్తాబు చేసినట్టు. జీ. ఎం. సీ. బాలయోగి జెడ్ పీ.చైర్మన్. తెలుగు దేశంపార్టీ నాయకుడు. వై. యస్సేమో కాంగ్రెస్ ఎం పీ.

నా పట్ల ఎంత ప్రేమగా… గౌరవం గా… అభిమానం గా బాలయోగి వ్యవహరించే వారో ఇప్పుడు తలుచుకున్నా, రాయాల్సి వచ్చినా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆయనను అడిగాను, వై. ఎస్. గారితో సమావేశానికి సమావేశ మందిరం…. ఓ రెండు గంటలు కావాలి అని. ప్రైవేట్ సమావేశాలకు ఈ సమావేశ మందిరాన్ని ఇవ్వగూడదని జెడ్. పీ తీర్మానం ఉన్నప్పటికీ, ఆయన వెంటనే ఇచ్చారు.

నేను తూర్పు గోదావరి జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ కు అధ్యక్షుడిని కూడా అయినందున, జిల్లా వ్యాప్తం గా అన్ని పత్రికల విలేకరులను ఈ ‘ మీట్ ది ప్రెస్ ‘ కు ఆహ్వానించాము. వారంతా నా పట్ల నా ఊహకు అందనంత అభిమానం తో ఉండేవారు. హాల్ నిండిపోయింది. సరిగ్గా సమయానికి వై. ఎస్. బృందం వచ్చేసింది. ‘ నిత్య అసమ్మతి వాది ‘ గా ముద్రపడిపోయిన వై. ఎస్, జక్కంపూడి దిగారు. పుష్ప గుచ్ఛం చేతికి అందించి, పరిచయం చేసుకున్నాను. నన్ను జక్కంపూడి ఎంతో ఘనం గా వై ఎస్ కు పరిచయం చేశారు.

ఆ చిరునవ్వు, పంచె కట్టు లో ఏదో కనికట్టు ఉన్నదనిపించింది. కాంగ్రెస్ యువ అభిమానుల కోలాహలం మధ్య ఆయనను హాల్ లోకి తీసుకు వెళ్లాను. వేదిక పై నేను, వై. ఎస్. గారే. ఆడియన్స్ లో జక్కంపూడి రామ్మోహన రావు, ఉండవల్లి అరుణ్ కుమార్, పల్లంరాజు, శివ సుబ్రహ్మణ్యం, వట్టి వసంత కుమార్ వగైరాలు. కాంగ్రెస్ ను రాష్ట్రం లో పటిష్టం చేయడం గురించి ఆయన మాట్లాడారు. ఇక, చివరగా….’ మీరు నిత్య అసమ్మతి వాది అనే ముద్ర పడింది కదా! మీ తదుపరి కార్యక్రమం ఏమిటి?’ అని అడిగాను.

‘ ఏముందీ! జనార్ధన రెడ్డి ని దింపడమే….’ అంటూ హాయిగా… పెద్దగా…. గల గలా నవ్వుతూ కుర్చీ లోంచి పైకి లేచారు. హాల్ లో ఒక్కసారి చప్పట్లు మారుమోగి పోయాయి. నేదురుమిల్లి జనార్ధన రెడ్డి ముఖ్యమంత్రిత్వం పై డాక్టర్ వై. ఎస్.తిరుగుబాటు జండా ఎగరేసింది కాకినాడ లోనే. నేను, ఆయన మాత్రమే వేదిక పై ఉన్న ‘ మీట్ ది ప్రెస్ ‘ కార్యక్రమంలోనే. ఆ తరువాత, ముఖ్యమంత్రి కావడానికి ఆయన మరో పదమూడేళ్లు ఆగాల్సి వచ్చింది.

2004 అసెంబ్లీ ఎన్నికలకు ముందు…. ఆయన రాష్ట్రం లో పాదయాత్ర ప్రారంభించారు, చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు. ఆ సమయం లి నేను హైదరాబాద్ లో ‘ ఆంధ్ర ప్రభ ‘ స్పెషల్ కరెస్పాండెంట్ గా ఉన్నాను. ఏబీకే ప్రసాద్ గారు ఎడిటర్. నేను అంతకు ముందే ఉదయం దిన పత్రికలో ఆయన సంపాదకత్వం లో పని చేసి ఉండడం వల్ల…. ఒక వాక్యం కలపడమో…., తీసి వేయడమో ఉండేది కాదు.
వై. ఎస్. పాదయాత్ర ను ఆంధ్ర ప్రభ వరకు నేనే కవర్ చేసేవాడిని. ఏబీకే అంటే… బై లైన్లే. అంటే, ఐటమ్ కు రిపోర్టర్ పేరు ఉండేది, కొంచెం బాగుంటే.

ప్రతి రోజూ నా బై లైన్ తో పాదయాత్ర కథనాలు వచ్చేవి. ఒక రోజు ఆఫీసు లో ఉండగా ఉన్నట్టుండి ఒక ఫోన్ వచ్చింది. నేను కావాలి అని అవతలి వారు అడిగారు. నేను లైన్ లోకి వచ్చి, ఎవరు అని అడిగాను. ‘రాయుడు గారా? నేను కేవీపీ రామచంద్రరావు. బాగున్నారా? మీ స్టోరీలు చూస్తున్నా. వై. ఎస్. ముఖ్యమంత్రి కావాలనే కోరిక మీ కథనాల్లో కనపడుతున్నది. సంతోషం. ఆ విషయం మీకు చెబుదామని ఫోన్ చేశా. ” అని అన్నారు. కేవీపీ గారు గారు నాకు మొదటిసారి ఫోన్ చేసి 32 ఏళ్ళు అయింది. ఇప్పటికీ, ఆయన పట్ల అదే గౌరవం.

ట్రింగ్… ట్రింగ్…. ట్రింగ్….
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది.
వై ఎస్ పట్ల సగం పాజిటివ్ ఓటు, చంద్రబాబు పట్ల సగం నెగెటివ్ ఓటు కలిసి కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది.వై. ఎస్. ముఖ్యమంత్రి అయ్యారు. పాతిక సంవత్సరాల ఆయన అభిమానుల కల నెరవేరింది.
ఆయన చేపట్టిన ” జలయజ్ఞం” ప్రాజెక్ట్ కింద రాష్ట్రం లోని 20 జిల్లాలలో గల 26 పెండింగ్ నీటిపారుదల ప్రాజెక్ట్ లను పూర్తి చేయడం ఒక యజ్ఞం లాగా చేపట్టారు. ఇందుకోసం, నీటి పారుదల శాఖ కు ముగ్గురు కార్యదర్సులను నియమించారు. సతీష్ చంద్ర , రాజీవ్ రంజన్ మిశ్రా, ఆదిత్యనాధ్ దాస్ – ఆ ముగ్గురు కార్యదర్సులు. వీరిపై, ముఖ్యమంత్రి కార్యాలయం లో ఎంజీవీకే భాను. ప్రతి వారం వై ఎస్ స్థాయి లో రివ్యూ.

2006 నాటికి జలయజ్ఞం పనులు ఊపందుకున్నాయి.సతీష్ చంద్ర కాకినాడ కు కలెక్టర్ గా ఉన్న సమయం లో నాకు బాగా పరిచయం. ఆయనకూ రాత్రిళ్ళు రెండింటి వరకు నిద్ర పట్టేది కాదు. నాకూ అంతే. అందుకే, ఇద్దరికీ కుదిరింది.అర్ధరాత్రి దాటాక, కలెక్టర్ బంగళా గార్డెన్ లో బెంచీల మీద కూర్చుని బాతాఖానీ కొట్టేవాళ్ళం. మధ్య మధ్య లో యానాం ఎంఎల్ఏ మల్లాడి కృష్ణా రావు వచ్చి కలిసేవాడు.ఆ సతీష్ చంద్ర ఇప్పుడు నీటిపారుదల శాఖకు ముఖ్య కార్యదర్శి కదా…., ఎలా పనులు జరుగుతున్నాయో అడుగుదామని సతీష్ చంద్ర ఇంటికి వెళ్లాను.

” వై. ఎస్. గారు చిత్త శుద్ధి తో జలయజ్ఞం చేస్తున్నారు రాయుడు. ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. ఇంత మంది ఆఫీసర్లు, ఇంజనీర్లు దానిమీద పనిచేస్తున్నారు. కానీ, ప్రెస్ లో ఒక్క వాక్యం రావడం లేదు. చాలా అన్యాయం అనిపిస్తోంది. నువ్వు ఒక ఆర్టికిల్ రాయగూడదా? ” అన్నారు.
“ఇంత పెద్ద ప్రాజెక్ట్ గురించి, మీ ఆఫీసర్లు చెబితే చెవితో విని రాయలేను సర్. 26 ప్రాజెక్ట్ లను కంటితో చూస్తేనే… రాయగలను ” అన్నాను.
” 20 జిల్లాలు తిరగాలి. అయ్యే పనేనా? ” అన్నారు.
“వై ఎస్ మీద అభిమానమే తిరిగేటట్టు చేస్తుంది. తిరుగుతాను.” అన్నాను.
” మీకు ఏమి కావాలో చెప్పండి. గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేస్తా ” అని సతీష్ చంద్ర అన్నారు.
” ఒక్క రూపాయి అవసరం లేదు. వెళ్లిన చోట వసతి, కాస్త తిండి. ప్రాజెక్ట్ చూపించి, ఎక్సప్లయిన్ చేసే ఇంజినీరు ఉంటే చాలు…. ” అన్నాను.
ఒక క్యాబ్ (ఇండికా ), ఒక ఫోటోగ్రాఫర్ మిత్రుడి ని తీసుకున్నాను. నెల రోజుల వరకు రానని ఇంట్లో చెప్పాను. 26 ప్రాజెక్ట్ లు 22 రోజుల్లో తిరిగాను. పగలు ప్రాజెక్ట్ విజిట్టు. రాత్రి నోట్స్ రాసుకోవడం. ఏరోజుకు ఆరోజు హైదరాబాద్ సచివాలయం కార్యదర్సుల ఆఫీస్ ల నుంచి మరుసటి రోజు విజిట్టు కు సంబంధించిన ప్రాజెక్ట్ అధికారులకు మెసేజ్ లు. ప్రాజెక్ట్ వివరాలు వివరం గా చెప్పాలి అని.
నెల రోజుల తరువాతే, హైదరాబాద్ తిరిగి వచ్చాను.
ఫోటోలు, నా స్క్రిప్ట్ తో ఒక డమ్మీ సంచిక రూపొందించా.
దానిని తీసుకెళ్లి ముఖ్య కార్యదర్శి గా ఉన్న సతీష్ చంద్ర కు చూపించా.
ఆయన షాక్. “రాత్రికి సీ ఎం గారికి పంపిస్తా ” అని తీసుకున్నారు.
మరుసటి రోజు ఉదయం 10 గంటల ప్రాంతం లో మా ఇంట్లో నా మొబైల్ మోగింది.
” హలో! రాయుడు గారా? క్యాంపు ఆఫీసు నుంచి. సీ ఎం గారు మాట్లాడతారు. కలుపుతున్నా… ” అంటూ ఒక గొంతు.
బిగుసుకు పోయా. షాక్ లోకి వెళ్ళా.

” రాయుడూ… బాగున్నావా? ఏం అద్భుతం గా రాశావయ్యా జలయజ్ఞం బుక్కు. ఆ నలభయ్యో పేజీ లో ఫోటో – అరవై రెండో పేజీ లో రిపీట్ అయింది చూశావా…? గవర్నమెంట్ నుంచి రూపాయి కూడా తీసుకోలేదటగా…. ఎలా వీలైంది…. తిరగడం?…. ” అంటూ ఆయన మాట్లాడుతుంటే…., ” సర్… సర్…. సర్….'” అనడమే తప్ప మాటలు రాలేదు.
” సర్, దీనికి ముందు మాట మీరు రాయాలి. ” అని మాత్రం అనగలిగాను.
” తప్పకుండా. రేపు ఉదయం నాలుగున్నర కు క్యాంపు ఆఫీసు కు రా…. ” అన్నారు.
ఒక చిన్న టేప్ రికార్డర్ కొనుక్కుని మరుసటి రోజు తెల్లవారు ఝామున నాలుగుగంటలకు క్యాంపు ఆఫీసు కు వెళ్లాను.
తెల్లని లుంగీ పంచె, ఓ కాటన్ చేతుల బనీను తో…. ఎనిమిది కోట్ల ఆంధ్రుల ముఖ్యమంత్రి…. నా ముందు ప్రత్యక్షం.
వస్తూనే… ఆయన చేతుల్లో – నేను రాసిన జలయజ్ఞం సంచిక. దాని గురించి ఎంత గొప్పగానో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయీ తీసుకోకుండా అన్ని ప్రాజెక్టలు కేవలం నెలలో తిరిగి ఆ పుస్తకం రాయడం ఆయనను అబ్బుర పరిచింది.
” ముందు మాట సర్…. ” అని నసిగాను.
టేప్ రికార్డర్ ఆన్ చేశాను. ( అంతకు ముందు 20 ఏళ్ళ క్రితం ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిగా 1987 లో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా టేప్ రికార్డరే వాడాను )
ఆయన ఫస్ట్ పర్సన్ లో ఈ బుక్ కు చెప్పిన విషయాలు ఏకంగా రెండు పేజీలు వచ్చాయి.
అవి కంపోజ్ చేసి తీసుకెళ్లా. చదివి,అడుగున సంతకం చేసి, good అని రాశారు.
“మీరు ఈ ప్రత్యేక సంచిక ను లాంచ్ చెయ్యాలి సర్ ” అని అడిగాను. అప్పుడు సమయం ఉదయం 5 గంటలు. వెంటనే, తన కార్యదర్శి ఎంజీవీకే భానుకు ఫోన్ చేశారు.

” భానూ, రాయుడు జలయజ్ఞం మీద అద్భుతమైన బుక్ రాశాడు. జూబిలీ హాల్ లో గవర్నమెంట్ ఫంక్షన్ లా బుక్ రిలీజ్ ఏర్పాటు చెయ్యి. మినిస్టర్స్ అందరూ అటెండ్ అవ్వాలి. ఇరిగేషన్ సీఈ లు అందరూ అటెండ్ అవ్వమను. రాయుడు తో డిస్కస్ చేసి, డేట్ ఫిక్స్ చెయ్యి… ” అని వై. ఎస్. ఆదేశాలు జారీ చేశారు. ఈ డెవలప్మెంట్ చెబుదామని కేవీపీ రామచంద్రరావు దగ్గరకు వెడితే, ఏమి జరిగిందో….. ఆయనే నాకు చెప్పారు. ఆశ్చర్యంతో నోరు తెరిచా.

ఆయన మరణం…. ఒక మామూలు మరణం కాదు.అది- తెలుగు జాతిగా ఒక రాష్ట్ర మరణం. రాష్ట్ర రాజకీయాలలో ఆత్మీయత కు మరణం. తెలుగు వారి చరిత్రను, రాజకీయ నడకను ముళ్ల పొదల్లోకి మలుపు తిప్పిన మరణం.

ఈ సెప్టెంబర్ 2 న మన తెలుగు రాష్ట్ర చిరునవ్వు, తెలుగుతనం… పావురాల గుట్ట లో అమరులైన వేళ…. ఆ చిరంజీవికి శ్రద్ధాంజలి ఫటిస్తున్నాను.
(ఆయుష్షు ఉన్నంత వరకు ఆ మహా మనిషి తో ఒక్కో ఏడాది ఒక్కో అనుభవం నెమరు వేసుకుందాం )

భోగాది వేంకట రాయుడు
medhomadhanam@gmail.com

Leave a Reply