Home » ఎన్నికల కమిషన్ అనుమతి లేక క్యాబినెట్ భేటీ వాయిదా

ఎన్నికల కమిషన్ అనుమతి లేక క్యాబినెట్ భేటీ వాయిదా

-అనుమతి ఎప్పుడు వస్తే.. అప్పుడే కేబినేట్ భేటీ
-అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఈసీ అనుమతి కోరతాం
-తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. శనివారం మధ్యాహ్నం కేబినేట్ సమావేశం నిర్వహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కేబినేట్ సమావేశానికి ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది. కానీ శనివారం రాత్రి వరకు ఈసీ నుంచి అనుమతి రాలేదు.

ఈసీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో ఈరోజు జరగాల్సిన కేబినేట్ భేటీ నిలిచిపోయింది. ఈసీ నుంచి ఏ క్షణమైన అనుమతి వస్తుందని మంత్రులు అందరూ శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సచివాలయంలో వేచి ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని విభాగాల అధికారులు కేబినేట్ భేటీకి హాజరయ్యేందుకు ఆఫీసులకు చేరుకున్నారు.

కానీ రాత్రి 7 గంటల వరకు ఈసీ నుంచి స్పందన లేకపోవటంతో కేబినేట్ భేటీ జరగలేదు. సీఎంతో పాటు మంత్రులు వెనుదిరిగి వెళ్లారు.

రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయాలపై ఈ భేటీలో చర్చించాలని ఎజెండా సిద్ధం చేసుకున్నారు. కానీ ఈసీ నుంచి స్పందన లేకపోవటంతో రైతుల సంక్షేమం, అత్యవసరమైన అంశాలపై చర్చించలేకపోయామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం. అందుకు సంబంధించిన వేడుకల నిర్వహణతో పాటు పునర్విభజనకు పదేండ్లు పూర్తి కావటంతో ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న అంశాలు, పునర్విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న కీలకమైన అంశాలను కేబినేట్ భేటీలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కేబినేట్ భేటీ వాయిదా పడటంతో ఇవేవీ చర్చ జరగలేదు.

ఈసీ నుంచి అనుమతి ఎప్పుడు వస్తే.. అప్పుడే కేబినేట్ భేటీ జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. సోమవారం లోపు ఈసీ నుంచి అనుమతి రాకపోతే, అవసరమైతే మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అనుమతి కోరుతామని చెప్పారు.

Leave a Reply