Suryaa.co.in

Editorial

ఏబీవీ..కింకర్తవ్యం?

– క్యాట్ తీర్పు సీఎస్‌కు ఇచ్చిన ఏబీ వెంకటేశ్వరరావు
– సీఎంకు ఫైల్ పంపామన్న సీఎస్?
– కోడ్ సమయంలో సీఎం నిర్ణయం తీసుకుంటారా?
-8న ఏబీకి అనుకూలంగా తీర్పు
– మూడురోజులకు తీర్పు కాపీ ఇచ్చిన వైచిత్రి
– వారంరోజులయినా దిక్కులేని పోస్టింగ్
-ఈలోగా ఏబీపై ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి
– పోస్టింగుకు ప్రాసిక్యూషన్‌తో సంబంధం లేదు
– అయినా ఏబీ పోస్టింగ్‌పై తాత్సారం
– ఈనెల 31తో ఏబీవీ రిటైర్మెంట్
– పోస్టింగ్ ఇవ్వకుండానే రిటైర్ చేయిస్తారా?
– ఏబీపై జగన్ వ్యూహాత్మక వేధింపు
( మార్తి సుబ్రహ్మణ్యం)

మేం బురద చల్లుతాం. మీరు కడుక్కోండి అన్నట్లుంది ఏపీ సర్కారు తీరు. డీజీపీ స్థాయి అధికారి ఆలూరి బాల వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదని క్యాట్ విస్పష్టంగా తీర్పు ఇచ్చింది. తక్షణమే పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశంతోపాటు.. ఆయనకు రావలసిన బకాయిలు కూడా ఇవ్వాలని, జగన్ సర్కారును ఆదేశించింది. ఈనెల 8న క్యాట్ తీర్పు ఇచ్చింది. అయితే తీర్పు కాపీ ఇచ్చేందుకు మూడురోజులు పట్టడం ఆశ్చర్యం.

డీజీపీ స్థాయి అధికారి, భారత ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులు పొందిన ఏబీ వెంకటేశ్వరరావు అనే సీనియర్ అధికారి భవిష్యత్తును, రిటైర్మెంట్ ముందు జగన్ సర్కారు అగమ్యగోచరంగా మార్చింది. రెండుసార్లు సస్పెండ్ చేసిన ఆయనను ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా చేసిన జగన్ సర్కారు, చివరకు జీతం కూడా ఇవ్వకుండా వేధించింది.

ఏబీ నిఘా దళపతిగా ఉన్నప్పుడు పరికరాల కొనుగోలులో, అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగం ఇప్పటికీ నిరూపించలేని జగన్ సర్కారు.. ఆయనను మరోసారి సస్పెండ్ చేసింది. అసలు తాము ఎలాంటి పరికరాలు కొనుగోలు చేయలేదని, చివరకు ఆర్ధికశాఖ కూడా స్పష్టం చేయడం విశేషం. కొనుగోలు చేయని పరికరాల్లో అక్రమాలు ఎలా జరిగాయన్న ఏబీ ప్రశ్నకు జగన్ సర్కారు దగ్గర ఇప్పటికీ జవాబు లేదు.

దానిని సవాల్ చేస్తూ క్యాట్‌ను ఆశ్రయించిన ఏబీకి, అక్కడ ఊరట లభించింది. జగన్ సర్కారు సస్పెన్షన్ చెల్లదని, సుప్రీంకోర్టు ఆదేశాలను ఎలా ఉల్లంఘిస్తారని ప్రశ్నించింది. సస్పెన్షన్ కాలంలో ఆయనకు ఇవ్వాల్సిన జీతం చెల్లించడంతోపాటు, తక్షణం ఆయనను విధుల్లోకి తీసుకోవాలని, ఈనెల 8న క్యాట్ తీర్పు ఇచ్చింది. అయితే ఆ తీర్పు కాపీ మూడు రోజుల తర్వాత ఏబీ చేతికి రావడమే ఆశ్చర్యం.

క్యాట్‌లో విచారణను సాగదీయడంలో, జగన్ సర్కారు విజయం సాధించింది. ఒక్క క్యాట్ మాత్రమే కాదు. అటు హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ జగన్ సర్కారు ఇదే సాగతీత వ్యూహం అనుసరించింది. ఈమధ్యకాలంలో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కూడా, నిర్ణయం తీసుకోవడంలో కావల్సినంత తాత్సారం చేశారు. అయితే ఈనెల 31తో ఏబీ రిటైర్ అవుతుండటం ప్రస్తావనార్హం. ఇవన్నీ నిశితంగా పరిశీలిస్తే, ఏబీకి పోస్టింగ్ ఇవ్వకుండానే ఆయనను రిటైర్ చేసేలా, జగన్ సర్కారు విజయం సాధించబోతోందని మెడపై తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది.

కాగా క్యాట్ తీర్పు కాపీని సీఎస్ జవహర్‌రెడ్డికి అందచేసి, తీర్పు ప్రకారం తనకు పోస్టింగ్ ఇవ్వాలంటూ ఏబీ ఒక దరఖాస్తు కూడా ఇచ్చారు. ఇది జరిగి దాదాపు ఆరు రోజులవుతున్నా, ఇప్పటివరకూ ఆయన పోస్టింగ్‌కు అతీగతీ లే కపోవడమే ఆశ్చర్యం. అయితే ఏబీ ఇచ్చిన క్యాట్ తీర్పు కాపీ- ఆయన దరఖాస్తును సీఎం వద్దకు పంపినట్లు, ఏబీకి సీఎస్ చెప్పినట్లు తెలుస్తోంది.

కోడ్ ఉన్న సమయంలో నిర్ణయం తీసుకోవలసిన సీఎస్, అందుకు భిన్నంగా సీఎంకు ఫైల్ పంపించడమే ఆశ్చర్యం. కోడ్ వల్ల సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకు వీలు లేదు. అంటే వచ్చేనెల కౌంటింగ్ తర్వాత కొత్త ప్రభుత్వమే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈలోగా ఆయన ఈనెల 31న రిటైర్ అయిపోతారు.

తాజాగా పోలింగ్ సమయంలో ఏబీ వెంకటేశ్వరరావుతోపాటు, మాజీ డీజీపీ ఠాకూర్ టీడీపీ కార్యాలయంలో కూర్చుని.. ఎస్పీ-డీఎస్పీ స్థాయి అధికారులకు ఫోన్ చేసి, టీడీపీకి అనుకూలంగా పనిచేయాలని బెదిరించినట్లు వైసీపీ ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన వైనం చర్చనీయాంశమయింది.

నిజానికి ఏబీవీ ఆరోజు తన తల్లితో ఓటు వేయించడానికి, కుటుంబసభ్యులతో కలసి నూజివీడు వెళ్లారు. అక్కడ తన తోటలో మనువడితో కాలక్షేపం చేశారు. ఈ ఫిర్యాదు తెలిసిన వెంటనే మీడియా ప్రతినిధులు ఆయనకు ఫోన్ చేసి, మీరు టీడీపీ ఆఫీసులో ఉన్నారా? అని ఆరా తీశారు.

దానితో ఆయన తన తోటలో మనుమడితో కలసి ఉన్న ఫొటోను పంపారు. ఏబీకి ఐదేళ్లూ పోస్టింగు ఇవ్వకుండా వేధించిన సర్కారు.. చివరాఖరకు విజయవాడలో ఉన్న ఆయన ఓటును కూడా తొలగించడం బట్టి, ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో స్పష్టమవుతోంది.

ఇదిలాఉండగా, ఏబీవీకి అనుకూలంగా క్యాట్ తీర్పు వచ్చిన కొద్దిరోజులకే.. ఆయనను విచారించవచ్చంటూ, కేంద్రం అనుమతించడం మరో విశేషం. అయితే ఏబీకి క్యాట్ తీర్పు ప్రకారం పోస్టింగ్ ఇవ్వడానికి, కేంద్ర విచారణకూ సంబంధం లేదని అధికారవర్గాలు చెప్పాయి.

LEAVE A RESPONSE