Home » ఓడినా టీడీపీని వీడని ‘కమ్మ’దనం!

ఓడినా టీడీపీని వీడని ‘కమ్మ’దనం!

-కమ్మసంఘంలో ‘అనంత’ తమ్ముళ్ల భేటీపై విమర్శలు
– నేతల తీరుపై జెసి ప్రభాకర్‌రెడ్డి ఫైర్
-కాల్వకు అండగా పరిటాల,పల్లె
– అనంత ‘దేశం’లో ముఠాల మఠాలు
( మార్తి సుబ్రహ్మణ్యం-విజయవాడ)
వైసీపీ వేసిన కులముద్రతో అధికారం పోగొట్టుకున్న తెలుగుదేశం పార్టీని ఇంకా ఆ కులముద్ర వీడినట్లు లేదు. టీడీపీ అధికారంలో ఉండగా కమ్మవర్గానికే న్యాయం జరిగిందంటూ, నాటి విపక్షమైన వైసీపీ.. మిగిలిన కులాలను టీడీపీకి వ్యతిరేకంగా కూడగట్టడంలో సఫలమయింది. డీఎస్పీల బదిలీ, ప్రమోషన్లలో కమ్మవర్గానికి అడ్డదారిలో కట్టబెట్టారంటూ.. వైసీపీ ఎన్నికల ముందు చేసిన ఆరోపణ, మిగిలిన సామాజికవర్గాల్లో కలవరం సృష్టించింది. అయితే, వైసీపీ దానిని నిరూపించలేకపోయినా అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. దానికితోడు అమరావతి రాజధాని, కేవలం కమ్మవారికోసమేనని ప్రచారం చేసింది. ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ దానిని తిప్పికొట్టడంలో విఫలమయింది.
ఈ పరిణామాలతో టీడీపీకి మూలస్తంభాలుగా ఉన్న బీసీలు కూడా, ఆ ఎన్నికల్లో టీడీపీకి బదులు వైసీపీకి జైకొట్టారు. కేవలం కులముద్ర వల్ల ఇంత నష్టం జరగడంతో, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల తర్వాత పార్టీపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ ఆఫీసులో కమ్మవర్గానికి చెందిన వారెవరూ కనిపించవద్దని ఆదేశాలిచ్చారు. పార్టీ ఓడేందుకు వైసీపీ తమపై వేసిన కుల ముద్రనే ప్రధాన కారణమని గ్రహించిన టీడీపీ.. ఇప్పుడు అదే కుల అస్త్రంతో వైసీపీ సర్కారుపై విరుచుకుపడుతోంది. గత రెండున్నరేళ్లలో కొన్ని వేల మంది రెడ్లకు పదవులిచ్చారంటూ, ఆ జాబితాను విడుదల చేసింది.
అయితే తాజాగా అనంతపురం జిల్లా పార్టీలో తలెత్తిన పరిణామాలు పరిశీలిస్తే.. ఓడినా టీడీపీని ‘కమ్మ’దనం వీడినట్లు లేదన్న సంకేతాలిచ్చాయి. హంద్రీ-నీవా జలాలకు సంబంధించిన అంశంపై చర్చించేందుకు అనంతపురం జిల్లా టీడీపీ నేతలు, అనంతపురంలోని కమ్మసంఘంలో సమావేశమవడం వివాదాస్పదమయింది. జిల్లా పార్టీ కార్యాలయం ఉన్నప్పటికీ, కమ్మసంఘంలో సమావేశం నిర్వహించడం ఏమిటన్న ప్రశ్నలు, పార్టీలోని మిగిలిన సామాజికవర్గాల నుంచి వినిపించాయి. దానిపై వైసీపీ సోషల్‌మీడియా చురుకుగా స్పందించింది. ‘కమ్మసంఘంలో బీసీ పార్టీ టీడీపీ సమావేశం’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించడం ద్వారా, టీడీపీని ఇరుకున పెట్టింది. వెంటనే రంగంలోకి దిగిన మంత్రి శంకర నారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రెస్‌మీట్ నిర్వహించి.. టీడీపీ నేతలు కమ్మ సంఘంలో మీటింగు పెట్టారంటే, వారికి బీసీలపై ఎలాంటి అభిప్రాయం ఉందో స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు.
పైగా ఈ భేటీకి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అయిన జెసి ప్రభాకర్‌రెడ్డిని పిలవకపోవడం విమర్శలకు దారితీసింది. తనకు సమాచారం ఇవ్వకుండానే సమావేశం నిర్వహించడంపై, జెసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు తీరుపై, జెసి మీడియా ముందే ఫైరయ్యారు. ఇదే పరిస్థితి కొనసాగితే టీడీపీ మళ్లీ గెలవదు అని ఖరాఖండీగా తేల్చేశారు. ‘‘ కార్యకర్తలు లేకుండా మీటింగులు పెట్టడం ఏమిటి? ఇదంతా కాల్వ శ్రీనివాసులు డైరక్షన్‌లోనే జరుగుతోంది. ఇంకో నాయకుడు కూడా ఉన్నారు. ఆ పేరు తర్వాత చెబుతా. చంద్రబాబుగారూ.. నేను చెబుతున్నా. మేమే కార్యకర్తలతో మీటింగులు పెట్టుకుంటాం. మీరు పార్టీలో పరిస్థితులు మార్చాలి. రెండున్నరేళ్ల నుంచి ఒక్క నాయకుడు కూడా బయటకు రావడం లేదు. కార్యకర్తల కష్టాలు పట్టించుకోవడం లేదు. వీళ్లంతా కార్యకర్తల కోసం ఏమైనా వచ్చారా? ఒక్కరైనా ఎన్నికల్లో అభ్యర్ధులను నిలబెట్టి, వారికి సాయం చేశారా? సార్.. ఇక్కడ కార్యకర్తలను చూడటం లేదు. అనంతపురంలో టీడీపీ స్ట్రాంగ్‌గా ఉంది. నాయకులను కార్యకర్తలను నమ్మడం లేదు.టీడీపీ ఓట్లున్నాయి. ఇక్కడ చాలా నియోజకవర్గాల్లో అభ్యర్ధులను మార్చాల్సిందే’’ అని మీడియా సమక్షంలోనే కుండబద్దలు కొట్టడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డిని దృష్టిలో ఉంచుకుని జెసి చేసిన వ్యాఖ్యలు కలవరం కలిగించాయి.

టీడీపీలో దాడి- ఎదురుదాడి

కాగా, జెసి వ్యాఖ్యలను ఖండిస్తూ, మాజీ మంత్రి పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలు అనంతపురం టీడీపీలో ముఠా తగాదాలను స్పష్టం చేశాయి. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న కాల్వ శ్రీనివాసులుపై జెసి వ్యాఖ్యలు బాధాకరమన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకే, కాల్వ శ్రీనివాసులు సీమనేతల సదస్సు నిర్వహించారని సునీత స్పష్టం చేశారు. మరో మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డి కూడా జెసి వ్యాఖ్యలపై అనూహ్యంగా ఎదురుదాడి చేశారు. ‘ నా డ్రెస్సింగ్ గురించి అవహేళనగా మాట్లాడం జెసికి తగదు. అసలు పరిపక్వతతో ఆలోచించే మాట్లాడుతున్నావా? నేను ప్యాక్షనిస్టును కాదు. గూండా రాజకీయాలు చేయను. నీలాగా నేను పార్టీ మారలేదు. కార్యకర్తల గురించి మాట్లాడే అర్హత మాకే ఉంది. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి నా బంధువు. శుభ-అశుభ కార్యక్రమంలో కలుస్తామే తప్ప, ఆయనకు రాజకీయంగా మద్దతునివ్వలేదు. ఒకసారి వైఎస్‌ను, ఇంకోసారి జగన్‌ను పొగుడుతావ్. ఇది కార్యకర్తలను అవమానించడం కాదా? నోటిదురద.. లూజ్‌టంగ్ ఉన్న వాళ్లు రాజకీయాల్లో బాగుపడిన దాఖలాలు లేవు. మైసూరారెడ్డి మీ ఇంట్లో కూర్చుని మాట్లాడాడు. మేమైనా అన్నామా? మీలాగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోలేద’ని జెసిపై రఘునాధరెడ్డి ఘాటుగా విరుచుకుపడ్డారు. తాజా ఘటనతో అనంతపురం జిల్లాలో జెసి వర్గం ఒంటరిదయిపోయినట్లు స్పష్టమయింది.

Leave a Reply