బీజేపీ నేత సత్యకుమార్ వ్యాఖ్యలు బూమెరాంగ్

– రాష్ట్రపతి ఎన్నికలో వైసీపీ మద్దతు బీజేపీ కోరలేదన్న సత్యకుమార్
– సత్యకుమార్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకత్వానికి జగన్ ఫిర్యాదు
– వైసీపీ మద్దతుకోరామని స్పష్టం చేసిన కేంద్రమంత్రి షెకావత్
– ద్రౌపదితో భేటీ ఏర్పాటుచేయాలని కోరిన బీజేపీ
– అవసరం లేదు మద్దతునిస్తామన్న వైసీపీ?
– ఆ సందర్భంలోనే సత్యకుమార్ వ్యాఖ్యల ప్రస్తావన
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎన్డీఏ మద్దతుతో బరిలోకి దిగిన రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపదిముర్ముకి ఓటు వేయమని తమ పార్టీ వైసీపీని కోరలేదంటూ.. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపాయి. అది చివరకు సీఎం జగన్, వైసీపీ నేతలు బీజేపీ జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేసే వరకూ వెళ్లడం.. దానితో ఆగమేఘాలపై స్పందించిన కేంద్రమంత్రి షెకావత్, సత్యకుమార్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కొట్టిపారేయడం.. రాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతు అంశంలో తాము జగన్‌తో కూడా మాట్లాడామని స్పష్టం చేయడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. దీనితో సత్యకుమార్ వ్యాఖ్యలు బెడిసికొట్టినట్టయింది. అయితే ఈ పరిణామాలు, వైసీపీ మద్దతు కోసం మంగళవారం విజయవాడ రానున్న రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము పర్యటనపై ప్రభావం చూపుతుందా? లేదా? అన్న అంశంపై మధ్యాహ్నం వరకూ ఉత్కంఠకు కారణమయింది.

సత్యకుమార్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకత్వానికి జగన్ ఫిర్యాదు

రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు ఓటు వేయమని తమ పార్టీ వైసీపీని అభ్యర్ధించలేదని, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇరు పార్టీల్లో పెనుదుమారం సృష్టించాయి. సత్యకుమార్ వ్యాఖ్యలు మీడియాలో ప్రముఖంగా రావడం చర్చనీయాంశమయింది. దీనిపై ఆగ్రహించిన సీఎం జగన్ సహా వైసీపీ పార్లమెంటరీపార్టీ నేత విజయసాయిరెడ్డి, బీజేపీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తాము బేషరతుగానే రాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతు ప్రకటించిన విషయాన్ని, జగన్ బీజేపీ పెద్దల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. అలాంటిది సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు, రాజకీయంగా తమకు నష్టం కలిగించేలా ఉన్నందున, పార్టీ అభిప్రాయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నట్లు బీజేపీ పెద్దలకు వివరించినట్లు తెలుస్తోంది.

వైసీపీ మద్దతుకోరామని స్పష్టం చేసిన కేంద్రమంత్రి షెకావత్

దీనితో నష్టనివారణకు దిగిన కేంద్రమంత్రి షెకావత్.. తమ పార్టీ నేత సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ‘అవన్నీ సత్యకుమార్ వ్యక్తిగత వ్యాఖ్యలు. వాటితో పార్టీకి సంబంధం లేదు. ఆయన

వ్యాఖ్యలు అవాస్తవం. ముర్ముకు మద్దతునివ్వాలని బీజేపీ ఏపీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను కోరింది. ఆ మేరకు ఆయనతో వ్యక్తిగతంగా కూడా మాట్లాడింది. ఆమె నామినేషన్ కార్యక్రమానికి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కూడా హాజరయ్యార’ని షెకావత్ గుర్తు చేశారు. దీనితో వైసీపీ-బీజేపీ మధ్య నెలకొందని భావిస్తున్న ప్రతిష్ఠంభన తొలగినట్లయింది.

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలపై, సోమవారం ఉదయం నుంచే ఇరు పార్టీల్లోనూ కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము మంగళవారం విజయవాడకు వచ్చి, సీఎం జగన్‌ను కలసి మద్దతు కోరనున్న నేపథ్యంలో ..సత్యకుమార్ వ్యాఖ్యలు ఇరు పార్టీల్లోనూ గందరగోళం సృష్టించాయి. ఈ క్రమంలో ఆమె వైసీపీ ప్రజాప్రతినిధులతో జరపదలచిన సమావేశంపై తాజా పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపుతాయన్న చర్చకు తెరలేచింది.

అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం… సోమవారం సీఎం జగన్, వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి బీజేపీ నాయకత్వంతో మాట్లాడారు. సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలను వారిద్దరూ బీజేపీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. సత్యకుమార్ వ్యాఖ్యల వల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని, బీజేపీ కోరకుండానే వైసీపీ వెంటపడీ మరీ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతునిస్తోందన్న భావన మీడియా, సోషల్‌మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్లిందని వివరించారు. దానితో స్పందించిన బీజేపీ నాయకత్వం.. ఈ అంశంపై తాము అధికారికంగా స్పందించి, దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

హామీ ఇచ్చినట్లుగానే.. రాష్ట్రపతి అభ్యర్ధిని గెలిపించేందుకు వేసిన కమిటీలో కీలకపాత్ర పోషిస్తున్న కేంద్రమంత్రి షెకావత్ రంగంలోకి దిగారు. మీడియాను పిలిచిమరీ, సత్యకుమార్ వ్యాఖ్యలను ఖండించారు. దానితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. బీజేపీ నాయకత్వం వైసీపీ మద్దతు కోరడమే కాకుండా, సీఎం జగన్‌తో కూడా మాట్లాడిందని వ్యాఖ్యానించడం ద్వారా, వైసీపీ ప్రతిష్ఠ నిలబెట్టారు.

ద్రౌపదితో భేటీ ఏర్పాటుచేయాలని కోరిన బీజేపీ

అయితే.. రాష్టపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము మంగళవారం విజయవాడకు రావలసి ఉంది. ఆమె వైసీపీ ప్రజాప్రతినిధుల మద్దతు కోరే కార్యక్రమం చాలారోజుల క్రితమే ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో సత్యకుమార్ వ్యాఖ్యల పరిణామం చోటుచేసుకుంది. ముర్ము మీ మద్దతుకోసం వస్తారని బీజేపీ నాయకత్వం జగన్‌కు ముందే సమాచారం ఇచ్చింది. ఆ మేరకు భేటీ కార్యక్రమం జరగవలసి ఉంది.

అవసరం లేదు మద్దతునిస్తామన్న వైసీపీ?

మారిన పరిణామాల నేపథ్యంలో..‘ సమావేశం అవసరం లేదు. మేం పార్టీపరంగా మద్దతునిస్తామని హామీ ఇచ్చినందున, ఆ మేరకు ఆమెకు ఓటు వేస్తాం కాబట్టి ముర్ము రావలసిన పనిలేద’ని వైసీపీ సీనియర్ ఎంపీ ఒకరు, బీజేపీ నాయకత్వానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీనితో ఆందోళన చెందిన బీజేపీ నాయకత్వం, మరోసారి జగన్‌ను సంప్రదించింది. ఇన్ని ఆసక్తికర పరిణామాల నేపథ్యంలో, చివరకు వైసీపీ నేతలతో ముర్ము భేటీ కార్యక్రమం సికె కన్వన్షన్ హాల్‌లోనే ఖరారయింది. నిజానికి ముర్ముతో భేటీ కార్యక్రమాన్ని విజయసాయిరెడ్డి, వైసీపీ ప్లీనరీ సమయంలోనే ఎమ్మెల్యే, ఎంపీలకు వెల్లడించారు. ఇన్ని ట్విస్టుల మధ్య ఎట్టకేలకూ ముర్ము భేటీ కార్యక్రమం మంగళవారం జరగనుంది.

తాజా పరిణామాల నేపథ్యంలో.. రాష్ట్రపతి ఎన్నిక వేదికగా వైసీపీ తన పట్టు మరోసారి నిరూపించుకున్నట్టయింది. నిజానికి బీజేపీ నాయకత్వం ఇటీవలి జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంలోనే, రాష్ట్రపతి అభ్యర్ధి అంశం ప్రస్తావించింది. ఆ మేరకు జగన్ కూడా సానుకూలంగానే స్పందించారు. అయితే.. రాష్ట్రపతి అభ్యర్ధిని గెలిపించాలని బీజేపీ కోరినట్లు, అధికార ప్రకటన వెలువడకపోవడం వల్లనే.. ఇన్ని పరిణామాలు చోటు చేసుకున్నట్లు బీజేపీ-వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

బీజేపీలో భిన్నాభిప్రాయాలు

అయితే ఈ అంశంపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సత్యకుమార్ వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్ఠను కాపాడేందుకేనన్న అభిప్రాయం బీజేపీలోని ఒక వర్గం నుంచి వ్యక్తమవుతుండగా, సీనియర్ నాయకుడయి ఉండీ కీలక సమయంలో పార్టీ వైఖరికి భిన్నంగా ఎలా మాట్లాడతారన్న ప్రశ్నలు మరొక వర్గం నుంచి వినిపిస్తున్నాయి.

‘ప్రధాని భీమవరం పర్యటనలో జగన్‌ను వ్యతిరేకించేవారెవరినీ వేదికపైకి రానీయని క్రమంలో బీజేపీ-వైసీపీ ఒకటేనన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. దానితోపాటు బీజేపీ కోరకుండానే వైసీపీ మద్దతునిస్తోందన్న ట్రోలింగ్ జరిగింది. అంటే మొత్తంగా బీజేపీ-వైసీపీ కలసిపోయాయన్న భావన ఏర్పడింది. దీనివల్ల బీజేపీ ప్రతిష్ఠ దెబ్బతినకుండా ఉండేందుకే సత్య ఆవిధంగా వ్యాఖ్యానించి ఉండవచ్చ’ని బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అయితే ఆ వ్యాఖ్యలు బూమెరాంగ్ అవటం దృరదృష్టకరమన్నారు.

బీజేపీలోని మరో వర్గం మాత్రం.. పార్టీలో సీనియర్ నాయకుడయిన సత్యకుమార్, అంత అనుభవరాహిత్యంతో ఎలా వ్యాఖ్యానించారో అర్ధం కావడం లేదని విస్మయం వ్యక్తం చేస్తోంది. సత్య సుదీర్ఘకాలం నుంచి బీజేపీలో ఉన్నారు. పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన నాయుడు గారితో కలసి పనిచేశారు. కాబట్టి అవసరమైన సందర్భాల్లో పార్టీ ఎలా వ్యవహరిస్తుందో ఆయనకు తెలిసే ఉండాలి. రాష్ట్రపతి ఎన్నిక వంటి ప్రతిష్టాత్మక అంశంలో పార్టీ నాయకత్వం, జగన్‌తో మాట్లాడకుండా ఎలా ఉంటుందనుకున్నారు? పైగా జగన్‌తో మా పార్టీకి విరోధమేమీ లేదు కదా? ముర్ము నామినేషన్ సమయంలో విజయసాయిరెడ్డి కూడా హాజరయ్యారు కదా? అంటే ఆ పార్టీ మద్దతు కోరినట్లే కదా? అలాంటప్పుడు నాయకత్వం జగన్‌తో మాట్లాడకుండా ఎలా ఉంటుంది? బహుశా వైసీపీతో మాట్లాడిన అంశాన్ని మా నాయకత్వం సత్యకు చెప్పలేదేమో’ అని మరో రాష్ట్ర స్థాయి నేత వ్యాఖ్యానించారు.

Leave a Reply