– బెజవాడ నుంచి హైదరాబాద్‌కు మారిన వేదిక
– బెజవాడలో సీఎం జగన్ వస్తారని ప్రచారం
– ఇప్పుడు హైదరాబాద్‌లో ముఖ్య అతిథి ఎవరు?
– కేటీఆరా? జగనా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరవుతారన్న చర్చ సినీ-రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. నిజానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక, ఈనెల 22న విజయవాడ సిద్దార్థ కాలేజీలో జరగాల్సి ఉంది. దానికి ఏపీ సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరవుతారన్న ప్రచారం కూడా జరిగింది.
అయితే హటాత్తుగా వేదికను హైదరాబాద్‌కు మార్చడం చర్చనీయాంశమయింది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయితే, చిరంజీవికి రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న ముందుచూపుతోనే, వేదికను హైదరాబాద్‌కు మార్చారన్న చర్చ సినిమా వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే చిరంజీవి.. ఏపీ సీఎం జగన్‌తో అతి సన్నిహితంగా వ్యవహరిస్తుంటే, ఆయన త మ్ముడయిన జనసేనాధిపతి పవన్ కల్యాణ్ మాత్రం జగన్‌తో యుద్ధం చేస్తున్నారు. కేవలం పవన్ నటించిన ‘భీమ్లానాయక్’ సినిమాను ఆర్ధికంగా దెబ్బకొట్టేందుకే జగన్ సర్కారు.. ఆ సినిమా విడుదల తర్వాతనే, సినిమా రేట్లు పెంచిందన్న విమర్శలు వినిపించిన విషయం తెలిసిందే.
ఇటీవల సినిమా టికెట్ల పెంపు వ్యవహారంలో… సీఎం జగన్‌తో సినిమా పెద్దలు జరిపిన చర్చల్లో, కేంద్రమంత్రిగా పనిచేసిన చిరంజీవి తన స్థాయి- ఇమేజ్ తగ్గించుకుని మరీ, బ్రతిమిలాడుతూ చేసిన
అభ్యర్ధన వీడియో సోషల్‌మీడియాకు లీకయింది. ఫలితంగా చిరంజీవి వ్యక్తిగత ఇమేజ్ డామేజీ అయింది. బహుశా ఇవన్నీ మళ్లీ చర్చకు రాకూడదన్న కారణాలతోనే చిరంజీవి, తన ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ వేదికను హైదరాబాద్‌కు మార్చినట్లు కనిపిస్తోందన్న వ్యాఖ్యలు సినిమా వర్గాల్లో వినిపిస్తున్నాయి.
కాగా సీఎం జగన్ వ్యక్తిగత వ్యవహార శైలి కూడా, వేదిక మార్పునకు మరో కారణమని పరిశ్రమ వర్గాల్లో మరో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. జగన్ వేదికపై ఉన్న సమయంలో.. ఆయనకు మించిన ఇమేజ్, సినిమా గ్లామర్ చిరంజీవికి ఉన్నప్పుడు సహజంగానే అభిమానులు, చిరంజీవి ప్రసంగానికే చప్పట్లు కొడతారు. ఆ సందర్భంలో అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించి ‘కాబోయే సీఎం పవన్ జిందాబాద్’ అనో.. ‘పవర్‌స్టార్ జిందాబాద్’ అనో..‘చిరంజీవి రాజకీయాల్లోకి మళ్లీ రావాలనో… నినాదాలు చేస్తే, చిరంజీవి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందన్న ముందుచూపు కూడా, వేదిక మార్పునకు మరో కారణం కావచ్చంటున్నారు.
సీఎం జగన్‌కు తన ముందు.. తనకంటే మరెవరికీ ఎక్కువ జిందాబాదులు కొట్టడం గానీ, తనకంటే బాగా మాట్లాడేవారు వేదికపై ప్రసంగించడానికీ ఇష్టం ఉండదన్న విషయం బహిరంగ రహస్యమేనని పరిశ్రమవర్గాలు గుర్తు చేస్తున్నాయి. అందువల్ల ప్రశాంతంగా జరగాల్సిన ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని అనవరంగా వివాదం చేసుకోవడం ఎందుకన్న ముందుచూపుతోనే, వేదికను హైదరాబాద్‌కు మార్చినట్లు కనిపిస్తోందని మరికొందరు విశ్లేషిస్తున్నారు.
అయితే .. వేదిక హైదరాబాద్‌కు మారినందున, దానికి ముఖ్య అతిథిగా ఎవరు హాజరవుతారన్న చర్చ.. అటు సినిమా ఇటు రాజకీయవర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఇటీవల జనసేనాధిపతి పవన్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి, తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పుడు ‘అన్నయ్య’ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమాకు, మళ్లీ కేటీఆరే అతిథిగా హాజరవుతారా? లేక విజయవాడ వేదికను హైదరాబాద్‌కు మార్చినందువల్ల, ఏపీ సీఎం జగన్ అతిథిగా హాజరవుతారా? అసలు ఈ రాజకీయ వివాదాలు ఎందుకన్న ముందుచూపుతో.. చిరంజీవితోనే సినిమా ప్రీ రిలీజ్ లాగించేస్తారా? అన్న చర్చ ఆసక్తికరంగా మారింది.