– ఎవడ్రా మీకు చెప్పింది గ్లాసులు పీకమని?
– నీరా కేఫ్ వద్ద మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, గౌడ సంఘం నేతల ఆందోళన
హైదరాబాద్: వందల మంది గౌడన్నలను జైళ్లలో పెట్టే పరిస్థితులు వచ్చాయి. ఆనాటి ప్రభుత్వంలో గౌడన్నలు కాలర్ ఎగరేసుకుని బతికారు. ఈ నీరా కేఫ్ మాది అని గుండెలు చరుసుకున్నారు. కేసీఆర్ తన ముందుచూపు ఆలోచనతో దేశంలో ఎక్కడా లేని విధంగా నీరా కేఫ్‌ను తీసుకొచ్చారు. కుల వృత్తులను పునరుద్ధరించారు.
కేసీఆర్ ఆలోచన మేరకు, ఆయన ఆర్థిక ప్రోత్సాహంతో మేము ఎన్నో కష్టాలుపడి నీరా కేఫ్‌ను నిర్మించుకున్నాం. బోర్డులు పీకేశారు, గౌడన్నలు చెట్లు ఎక్కే ప్రతిమలు పీకేశారు. ఇవాళ వినోద్ గౌడ్ అనే వ్యక్తికి ఇచ్చామని చెబుతున్న ఎక్సైజ్‌శాఖ.. అవన్నీ మేము అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన అనుమతులేగా? నేను టూరిజం మంత్రిగా, ఎక్సైజ్ మంత్రిగా పనిచేసిన కాబట్టే.. ఈ ల్యాండ్‌ను రెండింటికి ఉపయోగించుకున్నాం.
మేము నిర్మించుకున్న ఈ ఆత్మగౌరవ పతాకను అన్ని రాష్ట్రాల వాళ్లు వచ్చి చూసి వెళ్లారు, మెచ్చుకున్నారు. కల్లు ద్వారా వైన్ తయారు చేసే విధానాన్ని మా గౌడన్నలు కనుగొన్నారు. మీకు ఈ కుల వృత్తి ఒక్కటే తెలుసునని గుర్తించిన నాటీ సీఎం కేసీఆర్ మద్యం షాపుల్లో 15శాతం రిజర్వేషన్ అమలు చేశారు. ఈ నీరా కేఫ్‌లో నీరా బై ప్రొడక్ట్ తీసుకొచ్చాం. తాటిబెల్లం, ఈత బెల్లం ఉత్పత్తులను వెలుగులోకి తీసుకొచ్చాం.
మంచి ఔషధ గుణం ఉన్న నీరాకు నాటి సీఎం కేసీఆర్ ప్రాణం పోశారు. ఈ నీరా కేఫ్‌కు వచ్చే గౌడన్నలకు మీటింగ్‌లు ఏర్పాటు చేసుకునేందుకు పైన హాల్ నిర్మించాం. నెల క్రితమే శంకర్‌రెడ్డి అనే వ్యక్తికి టూరిజం వాళ్లే ఈ కేఫ్ మొత్తం గుంపుగుత్తగా ఇచ్చేశారు. గతంలో బీసీ కార్పొరేషన్ ద్వారా హ్యాండోవర్ చేసుకుంటామని జీఓ ఇచ్చారు.. ఆ పని మొదలు పెట్టకుండా శంకర్‌రెడ్డి అనే వ్యక్తికి మొత్తం దారాదత్తం చేశారు.
మేము మురుగునీరు వాసన రాకుండా అందమైన అద్దాలతో, సెంట్రల్ ఏసీతో కేఫ్‌ను నిర్మించాం. ఆ అద్దాలు మొత్తం తీసేశారు. లోపలికి వాసన వస్తే.. నీరా కేఫ్‌లోకి ఎవ్వరూ రాకుండా ఉంటారనే దురాలోచన వారిది. ఇది దుర్మార్గులు, శాడిస్టులు, చరిత్ర హీనుల పని.
ఎవరికి వచ్చింది ఈ ఆలోచన.. ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తారు ఎవడాడు? బిడ్డా మేము ఊదితే.. కొట్టుకపోతారు మీరంతా.ఎవడ్రా మీకు చెప్పింది గ్లాసులు పీకమని? కొత్త నీరా కేంద్రాలు ఏర్పాటు చేస్తారనుకుంటే.. ఉన్నదాన్ని ఊడగొడ్తరా? నీరా చరిత్రను తుడిపేసే కుట్ర చేస్తున్నారా?
నార్కోటిక్ డ్రగ్స్ పేరుతో గౌడన్నలు వేధిస్తున్నారు.వందశాతం జనాభా తాగే పాలపై దృష్టిపెట్టకుండా.. కేవలం రెండుశాతం ప్రజలు తాగే కల్లుపైనే దృష్టిపెట్టి.. కల్తి కల్లు పేరుతో వేధిస్తున్నారు. నీరా కేఫ్‌లో టూరిజంశాఖకు ఎలాంటి అధికారం లేదు. ఇది మొత్తం బీసీ సంక్షేమశాఖ డబ్బు.. ప్రభుత్వం కార్పొరేషన్ నుంచి కట్టిన బిల్డింగ్. ల్యాండ్ మాత్రమే టూరిజం శాఖది. ఇక్కడ మెయింటనెన్స్ కోసమే వారికి ఇచ్చాం.
మా పొన్నం ప్రభాకర్‌గౌడ్, మహేశ్‌కుమార్‌గౌడ్, ముఖ్యమంత్రి కానీ.. మీకు కుల వృత్తులపై గౌరవం ఉంటే.. మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. జనగామకు సర్వాయి పాపన్నగౌడ్ పేరు పెడతామన్నారు చేయలేదు. ట్యాంక్‌బండ్ విగ్రహం పెట్టమని చెప్పినం చెయ్యలేదు. 500 కోట్ల భవనం ఇస్తే.. దాన్ని వదిలేశారు.
కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్, గౌడ, కల్లుగీత సంఘాల నాయకులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, వెంకటనర్సయ్య, అంబాల నారాయణగౌడ్, విజయ్‌కుమార్‌గౌడ్, కల్లుగీత కార్మిక సంఘాల జేఏసీ నుంచి అయిలి వెంకన్న, సాయిలు గౌడ్, నాగభూషణం గౌడ్, గౌడ విద్యార్థి సంఘం నుంచి శ్రీకాంత్‌గౌడ్, సర్పంచ్‌ల సంఘం మాజీ అధ్యక్షుడు యాదయ్యగౌడ్, గౌడ అఫిషియల్స్ నుంచి డాక్టర్ బండి సాయన్న, బిజినెస్ నెట్‌వర్క్ అధ్యక్షుడు ప్రభాకర్‌గౌడ్, ఇతర నేతలు రామ్మోహన్‌గౌడ్, మానసగౌడ్, బీఆర్‌ఎస్వీ నేతలు రమేశ్‌గౌడ్, పంజాబ్ హర్యానా రాష్ట్రాల గౌడ సంఘం అధ్యక్షుడు మోహన్‌సింగ్ అ్లవాలియా తదితర నేతలు పాల్గొన్నారు.