-రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి
శనివారం విశాఖపట్నంలో ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగడంతో తండ్రీకొడుకులకు కడుపుమంట ఎక్కువైంది. ముఖ్యమంత్రి ప్రసంగం విన్నాక టీడీపీ నేతలు బుర్రలు చెడిపోయినట్టయింది. తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్ తమ ఏడుపును పాలకపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై విద్వేషంగా, ఆక్రోశంగా మార్చుకున్నారు. నిరాధార ఆరోపణలతో వికృత విషప్రచారానికి తెగబడుతున్నారు.
విశాఖపట్నం రాష్ట్ర కార్యనిర్వాహక రాజధాని అవుతుందని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పారిశ్రామిక ప్రగతికి గుండెకాయగా పనిచేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పినప్పటి నుంచి తెలుగుదేశం నేతలు పూనకం వచ్చిన రక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్న పాలకపక్షం సీనియర్ నేతలపై నోరు పారేసుకుంటున్నారు. తమ అసభ్య దుష్ప్రచారానికి పరిమితులు లేవన్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక స్థానాల్లో ఉండి రాజకీయ బరువుబాధ్యతలు మోస్తున్న నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. కట్టుకథలు, అబద్ధాలతో ఇంత దుర్మార్గ ప్రచారం చేస్తున్నా తెలుగుదేశం కబుర్లు నమ్మే అమాయక జనం ఉత్తరాంధ్రలో కాని, ఆంధ్ర రాష్ట్రంలోగాని లేరు.
విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్ర సర్కారు చేపట్టిన ప్రగతి యజ్ఞాన్ని ఎవరూ ఆపలేరు. నిరంతర అభ్యుదయానికి, ఆర్థిక వికాసానికి అమలు చేస్తున్న కార్యక్రమాలకు తండ్రీకొడుకుల నాయకత్వంలోని అరాజకశక్తులు భంగం కలిగించలేవు. వీరిద్దరి నాటకాలకు 2019 వేసవిలోనే తెరపడింది. వారి మాటలకు విశ్వసనీయత లేదని ఎన్నికల్లో అఖిలాంధ్ర ప్రజానీకం విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. అయితే, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఘోర పరాజయం తప్పదనే భయం ఈ తండ్రీకొడుకులను పగలనకా రేత్రనకా పీడిస్తోంది. రాష్ట్రంలో నిరాటంకంగా సాగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, ఉత్తరాంధ్రలో పాలకపక్షానికి రోజురోజుకు పెరుగుతున్న ప్రజల మద్దతు తెలుగుదేశాన్ని భయోత్పాతంలో ముంచెత్తుతున్నాయి.
2014–19 మధ్య జనహితం అనే ఊసు లేకుండా పరిపాలించి పాపం మూటగట్టుకున్నారు ఈ ‘అగ్రనేతలు’. ఇప్పుడేమో తమ భవిష్యత్ రాజకీయ చిత్రం ఆశావహంగా కనపడకపోవడంతో వైఎస్సార్సీపీ నేతలపై విషం కక్కుతున్నారు. తమ చుట్టూ ఉన్న దుమ్మూధూళీ పోగుచేసి పాలకపక్షం కీలక నేతలపై పోయాలని చూస్తున్నారు. ఇప్పటికే తమ జుగుప్సాకరమైన ప్రవర్తనతో టీడీపీ నేతలు జనం ముందు చీవాట్లు తింటున్నారు. మంగళగిరిలో అబద్ధాల ప్రచారానికి వచ్చిన ప్రతిపక్ష నేతలను ప్రజలు ఎలా తరిమికొట్టారో చూశాం. ఇప్పుడు విశాఖపట్నం, ఉత్తరాంధ్ర అభివృద్ధి కార్యక్రమాల వెలుగులో పచ్చపార్టీ నేతలు ఉన్మాదులుగా మారుతున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ దురహంకారపూరిత దుష్ట ప్రవర్తనకైనా కొన్ని హద్దులుంటాయని టీడీపీ అగ్రనేతలు గుర్తిస్తే మంచిది. ఇదే ధోరణి కొనసాగితే తెలుగుదేశం పార్టీని బెజవాడ కృష్ణా నదిలో కలిపేసి, తండ్రీకొడుకులిద్దరూ హైదరాబాద్ పారిపోవడం ఖాయం.