ఏమిటీ వెటకారమా?… మన వెధవాయిత్వంపై వ్యంగ్యాస్త్రమా?.. చేవచచ్చిన మన చైతన్యంపై విమర్శనాస్త్రమా?.. కలసి వెరసి జాతి సంపదను ఎవరు దోచుకుంటే మనకెందుకు? మన పోర్టులను ఎవరు స్వాధీనం చేసుకుంటే మనకెందుకు? మన గుళ్లు, మన గోపురాలు, మన పెన్షన్లు వస్తే చాలు. మన కులపోళ్లు చల్లగా ఉంటే చాలనకునే తెలుగువాడి నిస్సహాయ నిష్క్రియాపర్వంపై నిప్పులు చిమ్మే అస్త్రాలనుకుంటున్నారా?… అబ్బే కానేకాదు. ఆ చేవచచ్చి, చైతన్యం ఉడిగిపోయిన తెలుగుజాతిని మేల్కొలిపే ప్రయత్నం కానేకాదిది. అయినా.. నెలవారీ తాయిలాల మత్తులో జోగుతున్న తెలుగోడిని మేల్కొలిపే దమ్మెవరికీ లేదిప్పుడు! స్వయంపోషకం నుంచి పరపోషకుడిగా మారి సోమరిపోతుకు నిలువెత్తు నిదర్శనంగా మారిన తెలుగోడి సుఖాన్ని మనమెందుకు చెడగొట్టడం? జస్ట్ … అప్పడు ‘తాకట్టులో భారత దేశం’ రాసిన తరిమెల నాగిరెడ్డి.. ఇప్పుడు బతికిఉంటే, ఏం రాశావాడోనన్న ఊహ మాత్రమే!
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం. అంత సువిశాల సామ్రాజ్యాన్ని నిర్మించాలంటే, ఎన్నో వనరులు కావాలి, ఎంతో సంపద కావాలి. మరి… చిన్న దేశమైన ఇంగ్లాండుకు అది ఎలా సాధ్యం అయింది?
ఒక దేశంలో ఉండే సహజ వనరులు ఆ దేశ అభివృద్ధిని నిర్ణయిస్తాయని సాధారణంగా అనుకుంటాము. కానీ చాలాసార్లు దానికి భిన్నంగా జరిగింది. సహజ వనరులు ఎక్కడున్నాయి, అనే అంశం కన్నా, అవి ఎవరి నియంత్రణలో ఉన్నాయి, అనే అంశమే, అభివృద్ధిని నిర్ణయిస్తుందని చరిత్ర చెప్పిన సత్యం.
1498లో పోర్చుగీసు వారు వ్యాపారం కోసం భారతదేశం వస్తారు.
1602 లో డచ్ వారు వస్తారు. 1600 సంవత్సరం డిసెంబర్లో ఏర్పాటు చేయబడ్డ ఇంగ్లీష్ ఇండియా కంపెనీ అంటే బ్రిటీష్ వారు 1608 లో భారతదేశం వస్తారు. ఆ తర్వాత 1664 లో ఫ్రెంచి వారు వస్తారు.
భారతదేశంలో సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు తక్కువ ధరకు కొని ఐరోపా దేశాలకు ఎగుమతి చేసి లాభాలు ఆర్జించడం కోసం వీరంతా భారతదేశం వస్తారు.
గత వెయ్యి సంవత్సరాల ప్రపంచ ఆర్థికాభివృద్ధి ఎక్కువగా పశ్చిమ దేశాల్లో జరిగింది. దాంతో భారతదేశ పశ్చిమ తీరంలో ఉన్న రేవు పట్టణాలలో ఎక్కువ ఆర్థిక కార్యక్రమాలు జరిగేవి. ఈ దశలో భారతదేశ పశ్చిమ తీరములో ప్రధానమైన బొంబాయి రేవు పట్టణం పోర్చుగీసు నియంత్రణలో ఉండేది. ఆలస్యంగా వచ్చిన బ్రిటీష్ వారికి చిన్న చిన్న రేవుల్లో అవకాశం దొరికింది. దాంతో మొదటి దశలో పోర్చుగీసు వ్యాపారులే భారతదేశంతో జరిగిన వ్యాపారంలో ఎక్కువ లాభం పొందారు.
ఈ నేపథ్యంలో 1661 లో జరిగిన ఒక వివాహం ఇంగ్లాండు ఆర్థిక వ్యవస్థని ప్రపంచంలో మొదటి స్థానానికి తీసుకెళ్ళింది.
భారతదేశంలో వలసలు ఏర్పాటుచేసి పరిపాలిస్తున్న పోర్చుగీసు రాజకుటుంబం మరియు బ్రిటిష్ రాజ కుటుంబాల మధ్య 1661లో ఒక వివాహం జరిగింది.
బ్రిటిష్ రాజకుమారుడైన రెండవ చార్లెస్ వివాహం పోర్చుగీసు యువరాణి క్యాథరిన్ తో జరుగుతుంది. పోర్చుగీసు రాజకుటుంబం అల్లుడికి అపారమైన సంపదతో పాటు మొరాకో లోని టాంగియర్స్ మరియు భారతదేశంలోని బొంబాయి రేవు పట్టణాలను కట్నంగా ఇస్తారు.
తమ రాజకుటుంబానికి కట్నంగా లభించిన బొంబాయి రేవు పట్టణాన్ని, తమ కుటుంబం భాగస్వామిగా ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ రాజ కుటుంబం లీజుకు ఇస్తుంది.
అప్పుడు మొదలైంది ఈస్టిండియా కంపెనీ వ్యాపార విశ్వరూపం.
భారతదేశంలో దాదాపు అన్ని ప్రాంతాల నుండి రేవు పట్టణాలకు రహదారులను అభివృద్ధి చేయటం, ఆ తర్వాత రైల్వేలను నిర్మించి, ఆయా ప్రాంతాలలో లభించే భారతీయ ఉత్పత్తులను తక్కువ ధరకు కొని, బొంబాయి రేవుకు తరలించి, అక్కడి నుండి ఐరోపా మార్కెట్లోకి తరలించి, అనేక రెట్లు అధిక ధరకు విక్రయించడం ద్వారా ఇంగ్లీష్ వ్యాపారులు ప్రపంచ వ్యాపారం మీద పట్టు బిగించారు.
ఈ విధంగా వచ్చిన లాభాలను, పెట్టుబడిగా పెట్టి, భారతీయులనే తమ సైన్యం లో లక్షలాదిగా చేర్చుకుని, బ్రిటిషు సైన్యంలోని భారతీయ సైనికుల సహాయంతోనే, గొప్ప దేశ భక్తులు, పోరాట యోధులు, బ్రిటిష్ వారి సామ్రాజ్య విస్తరణ కాంక్షను ముందుగా అర్థం చేసుకున్న మైసూర్ పాలకులు హైదర్ ఆలీ, టిప్పుసుల్తాన్ లను అంతం చేస్తారు.
భారతీయ పాలకులు అందరిని బ్రిటిష్ వాళ్ళు ఓడించలేదు, చంపలేదు. కేవలం భారతదేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం నిలబడిన టిప్పుసుల్తాన్ లాంటి వారిని మాత్రమే అడ్డు తొలగించుకున్నారు. తమకు సహకరించిన హైదరాబాద్ నిజాం లాంటి వారిని సంరక్షించారు.
దాదాపు 1980వ దశకం వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తో భారతదేశ అనుసంధానం బొంబాయి రేవు పట్టణం ద్వారా జరిగింది. అందుకే బొంబాయిని GATE WAY OF INDIA అంటారు.
20వ శతాబ్దం రెండవ భాగంలో ప్రపంచ ఆర్థిక వ్యవహారాలలో అమెరికా ఆధిపత్యం పెరిగినప్పటికీ… మనదేశ ఎగుమతుల ను దిగుమతులను బొంబాయి రేవు నిర్ణయించింది.
కానీ 1978లో చైనాలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమై, కోట్లాదిమంది తన దేశ ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచటం కోసం చైనా ఉత్పత్తి, ఎగుమతి ఆధార… పారిశ్రామిక విధానాన్ని ప్రారంభించిన తర్వాత, చైనా ఎగుమతులు విపరీతంగా పెరిగి, భారతదేశ తూర్పు తీర రేవు పట్టణాల ప్రాధాన్యత పెరిగింది.
భారత దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టగలిగిన కళింగపట్నం
భీమునిపట్నం
విశాఖపట్నం
కాకినాడ
మచిలీపట్నం
నిజాంపట్నం
రామాయ పట్నం
చివరిగా
చెన్నపట్నం (చెన్నై)
రేవు పట్టణాలన్నీ
తూర్పు తీరం లోనే ఉన్నాయి. (ఒకప్పుడు తూర్పు తీరాన్ని చోళ మండలం అనేవారు…. ఆ పదం బ్రిటిషువారి భాషా సమస్య వల్ల కోర మండలం అయింది…. చివరికి… కోరమండల్ కోస్ట్ అయింది)
19వ శతాబ్దం ఇంగ్లాండ్ ది.
20వ శతాబ్దం అమెరికాది.
కానీ 21వ శతాబ్దం ఆసియా ది.
అంటే
ప్రపంచ ఆర్థిక, రాజకీయాలను 19వ శతాబ్దంలో ఐరోపా ఖండం శాసించింది.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ ఆర్థిక, రాజకీయాలను అమెరికా శాసించింది.
కానీ 21వ శతాబ్దం ప్రపంచ ఆర్థిక వ్యవహారాలను, ప్రపంచ రాజకీయాలను ఆసియా ఖండం శాసించబోతుంది.
ఆసియా ఖండంలో…. చైనా మరియు భారతదేశం…… ప్రపంచ ఆర్థిక శక్తులుగా ఎదిగే క్రమంలో… గత మూడు దశాబ్దాలుగా చరిత్రలో ఎప్పుడూ లేనంత సంపదను సృష్టించాయి.
ఈ దేశాల్లో ఉన్న సహజ వనరులు, దాదాపు మూడు వందల కోట్లకు చేరువలో ఉన్న మానవ వనరులు…… ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న మూలధన వనరులు (పెట్టుబడి) ఉపయోగించుకుని, ప్రపంచ ఆర్థిక వ్యవహారాలను నిర్ణయించ బోతున్నాయి.
ఈ విషయం అందరికన్నా బాగా తెలిసిన చైనా… శ్రీలంకలో, మాల్దీవులలో, పాకిస్థాన్ లో, బంగ్లాదేశ్లో …. ఉన్న రేవు పట్టణాలను దాదాపుగా తన నియంత్రణలోకి తెచ్చుకుంది.
ఈ నేపథ్యంలో…..
భారత దేశం తూర్పు తీరంలో, ముఖ్యంగా రేపు పట్టణాలపై ఆధిపత్యము, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పై ఆధిపత్యాన్ని నిర్ణయిస్తుంది.
భౌగోళికంగా ఉన్న అనుకూలతల వలన విశాఖపట్నం/గంగవరం మరియు కృష్ణపట్నం రేవు పట్టణాలు భవిష్యత్తులో పైనున్న కలకత్తా, కిందున్న చెన్నై పట్టణాల వ్యాపార సామర్థ్యాన్ని అధిగమిస్తాయి.
ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థం కాకపోయినా….. అదానీలకు అర్ధమైంది.
విమానాశ్రయాలలో, గ్రోత్ కారిడార్లు, ఎకనామిక్ కారిడార్లు, ఎక్స్ ప్రెస్ హైవే లు……. పేరుతో ఏం జరుగుతుందో అర్థం అయితే….. గుండె ఆగిపోతుంది.
1967 లోనే విప్లవకారుడు తరిమెల నాగిరెడ్డి గారు తాకట్టులో భారతదేశం అనే పుస్తకాన్ని రాశారు, మన పాలకులు పెట్టుబడిదారులకు దేశాన్ని ఎలా తాకట్టు పెడుతున్నారో అందులో వివరించారు.
ఇప్పుడు మళ్లీ నాగిరెడ్డిగారి బతికుంటే… INDIA SOLD
అనే పుస్తకం రాశేవారు.
అయినా ఇవన్నీ మనకెందుకు……. రామ మందిరం రెడీ అవుతుందంట…. అయోధ్య వెళ్దాం పదండి.