Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలతో సంక్షోభంలో వ్యవసాయ రంగం

– నష్టపోతున్న అన్నదాతను తక్షణమే ఆదుకోవాలి
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
రాష్ట్రంలో పంటలు సాగుచేసే రైతన్నకు కనీస గిట్టుబాటు ధర లేక అప్పుల ఊబిలోకి కూరుకు పోతుంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చోద్యం చూస్తున్నారు. రాష్ట్రంలో టమోట, పచ్చి మిర్చి ధరలు దారుణంగా పతనమయ్యాయి. రైతులను ఆదుకోవడంలో జగన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారు. కర్నూలు, అనంతపురం, చిత్తూరులో టమోట సాగుచేసిన రైతులకు కిలో రూపాయి నుంచి కేవలం రూ.5 వరకు మాత్రమే దక్కుతోంది. కనీసం కూలి, రవాణ ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. టమోట పంటను రోడ్లపైనే రైతులు పారబోస్తుంటే జగన్ రెడ్డి కళ్లకు కనిపించడం లేదా?
కర్నూలులో పచ్చిమిర్చి ధర కేజీ రూ.3కు పడిపోయింది. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా పచ్చిమిర్చి ధర పడిపోయింది. పచ్చిమిర్చి రైతులకు కనీసం కూలి ఖర్చు కూడా రావడం లేదు. వందల ఎకరాల్లో టమోట, పచ్చిమిర్చి పంటను రైతులు పశువులకు మేతగా వదిలేయడం జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనం. మరోవైపు హిందూపురం మార్కెట్ యార్డులో మిర్చి ధర ఒక్కసారిగా పతనమైంది. క్వింటా మిర్చి 3 వేల వరకు తగ్గింది. దీంతో రైతులు యార్డుకు తాళం వేసే పరిస్థితి నెలకొంది. పత్తి కొనుగోలులోనూ రైతులకు అన్యాయం జరుగుతోంది. తేమ 8 శాతం మించి ఉంటే ధరలో కోత విధించడం దారుణం.
12 శాతం మించి తేమ ఉంటే సీసీఐ కొనుగోలు చేయని పరిస్థితి. ఈ-క్రాప్ నమోదు తప్పనిసరి చేయడంతో పలువురు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతు భరోసా కేంద్రాలు వైసీపీ నాయకుల అక్రమాలకు మాత్రమే పనికి వస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులను రోడ్లపైనే పారబోయడం, పొలంలోనే పంటలను రైతులు తగులబెడుతుంటే ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి కన్నబాబు ఏం చేస్తున్నారు? రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారో సమాధానం చెప్పాలి. తక్షణమే మిర్చి, టమోట, పత్తి పంటలకు గిట్టుబాట ధర కల్పించేలా జగన్ రెడ్డి చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం తప్పదు.

LEAVE A RESPONSE