- రాష్ట్రంలో కరవు పరిస్థితి తీవ్రంగా ఉంది
- తూతూమంత్రంగా కరవు మండలాల ప్రకటన
- వాస్తవ విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వ వంచన
- రైతుకు అండగా ఉండటమే మా ప్రధాన అజెండా
- జనసేన – తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశంలో రైతుల కడగండ్లపై ప్రధానంగా చర్చిస్తాం
- పక్కా ప్రణాళికతో రైతుల తరఫున సమష్టి పోరాటం
- పశ్చిమ కృష్ణా డెల్టా పరిధిలో ఎండిపోయిన పంట భూములను పరిశీలించిన జనసేన పార్టీ
- పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
‘మా ప్రాంతంలో ఒకప్పుడు కళ్ళం నిండా నీరు… కనుచూపు మేర పచ్చని పైరుతో కళకళలాడేది. నేడు ఆ పరిస్థితి మారిపోయింది. పంట సాగుకు చుక్క నీరు అందక నెర్రెలిచ్చిన బీళ్లు… ఎండిపోయిన చేలు కనిపిస్తున్నాయి’ పశ్చిమ కృష్ణా డెల్టా రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పశ్చిమ కృష్ణా డెల్టాలో ఎండిపోయిన పంట పొలాలను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ బుధవారం పరిశీలించారు. తెనాలి రూరల్ మండలం, కొలకలూరు, ఖాజీపేట, హాఫ్ పేట గ్రామాల పరిధిలోని పశ్చిమ కృష్ణా డెల్టా, 3, 4 బ్రాంచ్ కెనాల్స్ నీరు లేక ఎండిపోయిన పంట పొలాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడారు. అక్కడున్న పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ఒక్కో రైతుతో విడిగా మాట్లాడారు. వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఎందుకు నీరు అందడం లేదో రైతులు మనోహర్ కి వివరించి చెప్పారు.
రైతులు తమ బాధను వెల్లడించారు. పంటను కాపాడుకునేందుకు రోజూ నీటి కోసం ఓ యుద్ధమే చేస్తున్నామన్నారు. పంట ఈనే దశలో తడుల కోసం కష్టమంతా కోర్చి కష్టపడుతున్నామనీ, పశ్చిమ కృష్ణా డెల్టా లోని పంట పొలాలకు సాగునీరు లేకపోవడంతో ఎండిపోయి కనిపిస్తున్నాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. కాలువల నిండా తూడు పూడుకుపోయిందనీ, ఎన్నో ఆశలతో ఊడ్చిన చేళ్లకు నీరు అందక పూర్తిగా వరిదుబ్బు దశలోనే ఎండిపోతున్నాయని తెలిపారు. గతంలో ఎన్నడూ పశ్చిమ కృష్ణా డెల్టాలో సాగునీరు విషయంలో ఇంతటి దుర్భిక్ష పరిస్థితి లేదని, వేలకు వేల రూపాయలు పెట్టుబడులు పెట్టినా పైసా వస్తుందనే ఆశ కలగడం లేదన్నారు. కృష్ణా డెల్టాలోని ఏ కాలువలోనూ నీరు లేకపోవడంతో రైతులు పంట తడులు కోసం సొంతంగా మోటారు ఇంజిన్లు వాడుకోవాల్సి వస్తుందన్నారు. నీరు అందించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని, కనీసం చివరి తడులకు సైతం నీరు అందించడంలో వారాబందీ పద్ధతి కూడా విఫలం అయిందని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నామని రైతులు ఎండిపోయిన పంట పొలాలను మనోహర్ కి చూపిస్తూ విలపించారు.
రైతులపై వైసీపీది కఠిన వైఖరి
రైతుల వెతలను, వ్యధలను ఓపికగా విన్న నాదెండ్ల మనోహర్ అక్కడే మీడియాతో మాట్లాడుతూ “తమది రైతు ప్రభుత్వమని, మనసున్న ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం మాత్రమే ముఖ్యమంత్రికి తెలుసు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని ఏ మాత్రం వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సాగు నీటి విడుదల విషయంలో రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. పంటలు సాగు కోసం నీరు కూడా సరిగా అందించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉంది. వాటర్ మేనేజ్మెంట్ సిస్టం అమలు విషయంలో వైసీపీ ప్రభుత్వం విఫలం అయింది. పశ్చిమ కృష్ణా డెల్టా అంటే ఎప్పుడు నీటితో కళకళ్ళాడే ప్రాంతం. ఇక్కడే పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉన్నాయంటే, రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో కరవు ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరవు మండలాలను ప్రకటించడంలో కూడా వైసీపీ ప్రభుత్వానికి మనసు లేదు. రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని, కరువుతో అల్లాడుతున్నారని ప్రకటించడానికి వైసీపీ ప్రభుత్వానికి నామోషీ వచ్చింది. ఈ కారణంతోనే తీవ్ర కరవు పరిస్థితులను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోంది.
కరవు మండలాల ప్రకటనలో ఎందుకు అంత గోప్యం?
రాష్ట్రంలో చాలా చోట్ల అత్యంత తక్కువగా వర్షపాతం నమోదయింది. దాదాపు అన్న ప్రాంతాల్లోనూ లోటు వర్షపాతం నమోదు అయింది. సాధారణ వర్షపాతం కంటే అత్యంత తక్కువగా క్షేత్రస్థాయిలో వర్షపాతం నమోదయింది. దీంతో రాష్ట్రంలో ఉన్న 680 మండలాల్లో సుమారు 361 మండలాలు తీవ్ర కరువు పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ సంఘాల సైతం ఆ మేరకు కరువు మండలాల ప్రకటన చేయాలని డిమాండ్ చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదు. అక్టోబర్ 31వ తేదీ అర్ధరాత్రి అత్యంత రహస్యంగా, ఎవరికీ తెలియకుండా రాష్ట్రంలో 103 కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటించింది. ఆ కరవు మండలాల పూర్తి వివరాలు కూడా వెల్లడించకపోవడం ప్రభుత్వ తీరుకు అర్థంపడుతోంది. కరవు మండలాల ప్రకటనకు వైసీపీ ఎందుకు నామోషీ ఫీలవుతుందో?
పశ్చిమ కృష్టా డెల్టా లో ఉన్న గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఒక్క కరవు మండలం కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు మండలాల్లో మాత్రమే కరువు ఉన్నట్లు చూపించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఖరీఫ్ లో 24 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. దీన్ని ప్రభుత్వం కప్పి పుచ్చుతోంది. మండలాల వారీగా కరవును లెక్కించే విధానం ప్రస్తుతం ఉంది. ఆ మేరకు ఏ జిల్లాలో ఎన్ని మండలాలు కరువు మండలాలు అనేది స్పష్టంగా ప్రకటించాల్సిన ప్రభుత్వం దాని తూతు మంత్రంగానే చేసింది. ఇక కరవు సాయం విషయంలో కూడా స్పష్టత ఇవ్వలేదు. పూర్తి స్థాయిలో కరవు మండలాలను జగన్ ప్రభుత్వం ప్రకటించడానికి సిగ్గుపడడం ఎందుకో అర్ధం కావడం లేదు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసి పూర్తిస్థాయిలో కరవు మండలాలను ప్రకటించాల్సిన అవసరం ఉంది. కష్ట కాలంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అన్నారు. మనోహర్ వెంట పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్, గుంటూరు, కృష్ణా జిల్లాల అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, బండ్రెడ్డి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శులు వడ్రాణం మార్కండేయబాబు, మండలి రాజేష్, గుంటూరు నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్, పార్టీ నాయకులు బండారు రవికాంత్, ఇస్మాయిల్ బేగ్, హరిదాసు గౌరీ శంకర్, పసుపులేటి మురళీకృష్ణ, తోటకూర వెంకట రమణారావు, గుంటూరు కృష్ణ మోహన్, చొప్పర ప్రీతి తదితరులు పాల్గొన్నారు.
పంట వేసినప్పుడు కురిసిన వర్షమే – రాగం వెంకటరాఘవమ్మ, మహిళా రైతు, కొలకలూరు
పంట వేసిన దగ్గర నుంచి చేను తడుపుకునే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు కాలువల ద్వారా చుక్క నీరు రాలేదు. మురుగు కాల్వల నుంచి తోడుకుని కొంతకాలం కాపాడుకున్నాం. ఖర్చులు పెరిగిపోయి వదిలేశాం. వెద వేసినప్పుడు కురిసిన వర్షమే. తర్వాత చుక్క నీరు రాలేదు. రెండున్నర ఎకరాల పంట పూర్తిగా ఎండిపోయింది. రూ. 25 వేలు కౌలు ముందుగానే చెల్లించి పంట వేశాం. తర్వాత భర్త చనిపోయారు. అది జరిగి 5 నెలలు గడచింది. వితంతు ఫించన్ కూడా ఇవ్వడం లేదు. ప్రభుత్వం నుంచి ఏవిధమైన ఆసరా లేదు.
ఎకరాకి రూ. 4 వేలు ఖర్చు – సుదర్శనం, సుబ్బయ్య, రైతులు
రెండుసార్లు వెద వేశాం. కలుపులు తీశాం. వర్షం కురుస్తుంది, కాలువలు వస్తాయన్న ఆశతో ఎదరు చూశాం. చూసి చూసి కళ్లు కాయలు కాశాయి. ఆశ చచ్చిపోయింది. వారాబందీ ప్రకారం కూడా నీరు వదలడం లేదు. చివరికి మురుగు కాలువ నీరే దిక్కవుతోంది. ఒక్కో తడుపుకి ఎకరాకి రూ. 4 వేలు ఖర్చు అవుతోంది. రైతు భరోసా కేంద్రాల్లో పంట నష్టం నమోదు చేయమంటే పై నుంచి ఆర్డర్స్ రాలేదంటున్నారు. రైతు నష్టపోతున్నా ఎంతోకొంత సాయం చేద్దామన్న ధ్యాస ఈ ప్రభుత్వానికి లేదు. రైతుని పలుకరించే నాథుడు లేడు.
నీటి పైపుల అద్దె తడిసి మోపెడవుతోంది – కోటేశ్వరరావు, రైతు కొలకలూరు
పంట తడుపుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నాం. 100 అడుగుల నీటి పైపుకి రోజుకి రూ. 5 అద్దె చెల్లించాల్సి వస్తోంది. కొన్ని చోట్ల 4 వేల అడుగులు పైపులు వేయాల్సిన పరిస్థితి. పంటను బతికించుకునేందుకు నానా ఇబ్బందులుపడుతున్నాం. 50 రోజుల క్రితం పంట వేసినప్పుడు వర్షం కురిసింది. ఇప్పటి వరకు లేదు. ప్రభుత్వం మా వైపు చూడడం లేదన్నారు. పూడిక తీసి పదేళ్లు అయ్యింది. ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయకపోతే పంటలు వేసే పరిస్థితి లేదు.