Suryaa.co.in

Telangana

ఈ-కార్ రేస్ కేసులో ఈడీ ఎందుకు కేటీఆర్ ను అరెస్ట్ చేయడం లేదు?

– ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ కాకుండా కాపాడుతుందే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్
– సంజయ్.. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ను ఎప్పుడు అమెరికా నుంచి తీసుకువస్తావో చెప్పు?
– ఫామ్ హౌస్ లో పడుకునే కేసీఆర్ మాకు పోటీనా?
– తలసాని, సబితమ్మ ను కేసీఆర్ సిగ్గు లేకుండా మంత్రులను చేశాడు
– ఎన్నికల బరిలో నిలబడని బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ను ప్రశ్నించే అర్హత ఉందా?
– నిజామాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి

నిజామాబాద్: పట్టభద్రుల శాసనమండలి అభ్యర్థి గా నరేందర్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. ప్రభుత్వానికి, పట్టభద్రులకు వారిధి గా ఉంటారనే నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టాం. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు, కుతంత్రాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీన పర్చాలని ప్రయత్నిస్తున్నాయి. బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించి , తెలంగాణ తో మీకు సంబంధం లేదని పేగు బంధం తెగిపోయిందని ఫామ్ హౌస్ పడుకోమని చెప్పారు.

కేసీఆర్ అందుకే ఫామ్ హౌస్ లో పడుకున్నారు.. అయినా కుట్రలు ఆపలేదు. కాంగ్రెస్ ను గెలిపించి వద్దని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్లు ఏ అభ్యర్థికి ఓటు వేయాలని చెబుతున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది.. పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది.ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు. ఎన్నికల్లో పోటీ చేయని పార్టీ కి రాజకీయ పార్టీ అని చెప్పుకునే అర్హత ఉందా?

తెలంగాణ ఉద్యమాన్ని పట్టభద్రులు ముందుండి నడిపారు. ఎన్నికల బరిలో నిలబడని బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ను ప్రశ్నించే అర్హత ఉందా? పది నెలలలో ఏమీ చేయలేని కాంగ్రెస్ ను అంటున్న బీఆర్ఎస్ పదేళ్లలో ఏం చేసింది? ఎన్నికల కోడ్ కారణంగా ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు మాత్రమే మాకు పరిపాలన చేసే అవకాశం వచ్చింది. పదేళ్లలో నిరుద్యోగ సమస్య కారణంగా అనేక మంది యువతీ యువకులు ఆత్మహత్య లు చేసుకున్నారు.

పదేళ్లలో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగడమే సరిపోయింది. నోటిఫికేషన్లు రాలేదు.. నియామకాలు చేయలేదు. నోటిఫికేషన్లు ఇస్తే కోచింగ్ సెంటర్ల తో కుమ్మక్కు అయి కోర్టులకు వెళ్లి పరీక్షలు ఆపించారు.మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 55,163 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది నిజం కాదా? మేం 55 వేల ఉద్యోగాలు ఇస్తేనే కాంగ్రెస్ కు ఓటు వేయండి.35 వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, 22 వేల మంది కి బదిలీలు చేయడంతో పాటు 17 వేల మంది నూతనంగా నియమించాం.మేం చెప్పింది నిజమైతే మాకు టీచర్లు ఓటు వేయాలి.

65 ఐటీఐ లను 2400 కోట్ల తో టాటా కంపెనీ సహకారంతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు గా తీర్చిదిద్దుతున్నాం.ఆనంద్ మహీంద్రా ను చైర్మన్ గా యంగ్ స్కిల్స్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధమౌతున్నాం. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలంపిక్స్ లో బంగారు పతకం తేలేకపోయింది. ప్రపంచంతో పోటీ పడలేక పోతున్నామనే తెలంగాణ లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేస్తున్నాం.నిజామాబాద్ కు చెందిన నిక్కత్ జరీన్ కు రెండు కోట్ల నగదు ఇచ్చి గ్రూప్ 1 ఆఫీసర్ గా నియమించింది నిజమైతే కాంగ్రెస్ కు ఓటు వేయాలి. భారత బౌలర్ సిరాజ్ కు అన్ని మినహాయింపులు ఇచ్చి గ్రూప్ వన్ ఉద్యోగం ఇచ్చాం. క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వం ఆదుకుంటుందని నిరూపించాం.వరంగల్ కు చెందిన కీర్తి కి గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చి 25 లక్షల ఆర్థిక సాయం చేశాం.

ఆర్థిక ఇబ్బందులను అధిగమించుకుంటు ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతున్నాం.. 7 లక్షల కోట్ల అప్పులతో కేసీఆర్ ప్రభుత్వాన్ని మాకు ఇచ్చారు. ప్రతి నెల 6.500 కోట్లు , సంవత్సరానికి 75 వేల కోట్ల అప్పుల కింద చెల్లించాల్సి వచ్చింది. 65 వేల కోట్ల అప్పు చేసి , మరో 15 వేల కోట్లు కలిపి కేసీఆర్ చేసిన అప్పు కట్టాం. ప్రభుత్వ ఉద్యోగులు గుండె మీద చేయి వేసుకుని కేసీఆర్ హయాంలో జీతం ఎప్పుడు వచ్చిందో చెప్పాలి.ఎప్పుడైనా కేసీఆర్ సీఎంగా ఉన్నంత కాలం మొదటి తారీఖున జీతాలు వచ్చాయా?మా ప్రభుత్వం ప్రతి నెల మొదటి తేదీన జీతం వస్తుందా రావడం లేదా? మొదటి తారీఖు న జీతం వస్తే మాకు ఉద్యోగులు ఓటు వేయాలి.

ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు 8 వేల కోట్ల బకాయిలు కేసీఆర్ పెట్టారు.8 వేల కోట్లు తీర్చడానికి నా నడుము వంగిపోతోంది. ఖజానా ఖాళీ చేసి ఫామ్ హౌస్ కు పోయి పడుకుంటే బకాయిలు ఇవ్వడానికి మాకు చాలా కష్టం అవుతుంది. ప్రతి నెలా వెయ్యి కోట్ల బకాయిలు చెల్లించడానికి ప్రయత్నం చేస్తాం.మాటకు కట్టుబడే పార్టీ కాంగ్రెస్.

బండి సంజయ్ ఆకాశమంత ఎగిరి దూకుతున్నడు.బడా బీసీలమని బండి సంజయ్, మోదీ చెబుతున్నారు.2021 లో బీజేపీ జనగణన ఎందుకు చేయలేదు.. అందులో కులగణన చేయలేదు.వందేళ్లలో బీసీ కులగణన చేయకపోతే మీ రేవంత్ రెడ్డి నెలలో కులగణన చేసి లెక్కలు ముందు పెట్టాడు.100 యేళ్ల కులగణన సమస్యను నేను తీర్చాను. వండుకున్న అన్నం లో ఉప్పు వేసి తినకుండా చేయడానికి బీజేపీ నేతలు కుట్ర చేస్తున్నారు.బలహీన వర్గాలకు లెక్క తప్పు అయితే బండి సంజయ్ ఎత్తి చూపించాలి. సొల్లు వాగుడు వాగడం కాదు.

సమగ్ర కుటుంబ సర్వే అనే చిత్తు కాగితాన్ని చూపిస్తున్నారు.బీసీ లెక్క 56.33 శాతం అని నేను పక్కా గా తీశాను. 15.29 శాతం ఓసీ లు, 17.45 శాతం ఎస్సీలు, 10.08 శాతం ఎస్టీ లు, మైనార్టీ 12.56 శాతం ఉన్నారని తేల్చాం. మైనార్టీలను బీసీలలో ఎలా కలుపుతారని బండి సంజయ్ అంటున్నారు.1960 నుంచే మైనార్టీ లు బీసీ రిజర్వేషన్లు పొందుతున్నారు. గుజరాత్ రాష్ట్రంలో 29 ముస్లిం కులాలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు.మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ , బీహార్ లో ముస్లింలు బీసీలు రిజర్వేషన్లు పొందుతున్నారు.అవసరమైతే ఆ రాష్ట్రాలకు నిజనిర్దారణ కమిటీలు పంపుదాం. కేంద్ర మంత్రులు గా ఉండి అబద్దాలు చెపుతు వీధి నాటకాలు వేస్తున్నారు.

శానసమండలి లో పట్టభద్రుల సమస్య ను ప్రస్తావించి పరిష్కరించే నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కావాలి. నరేందర్ రెడ్డి ఓడిపోతే ప్రభుత్వంతో చర్చించే వాడు లేకుండా పోతాడు. అది పట్టభద్రులకు నష్టం. పదేళ్ల పాటు కేసీఆర్ జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది నేను కాదా? ఎన్నికల్లో పోటీ చేయనోడికి మాట్లాడే అర్హత లేదు. కేటీఆర్ ను తెలంగాణ సమాజం ఎప్పుడో బహిష్కరించింది.. నువ్వు లెక్కల్లో కూడా లేవు.

టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికా పారిపోతే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాసి ఎందుకు దేశానికి తీసుకురావడం లేదు? ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ కాకుండా కాపాడుతుందే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. ఈ కార్ రేస్ కేసులో ఫైళ్లు అన్నీ తీసుకుపోయిన ఈడీ ఎందుకు కేటీఆర్ ను అరెస్ట్ చేయడం లేదు? బండి సంజయ్.. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ను ఎప్పుడు అమెరికా నుంచి తీసుకువస్తావో చెప్పు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ను రాష్ట్రానికి తెచ్చిన 48 గంటల్లో బీఆర్ఎస్ నాయకులను బొక్కలో వేస్తాం.

ఫోన్ ట్యాపింగ్ కేసులో జైలుకు పంపించిన రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు కు 10 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారు. గొర్రెల పెంపకం కేసులో ఫైళ్లు తీసుకుపోయిన ఈడీ బీఆర్ఎస్ నాయకులను ఎప్పడు అరెస్టు చేస్తుంది? బండి సంజయ్.. ఎప్పుడు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తావో చెప్పు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఢిల్లీ వెళ్లని హరీష్ రావు, కేటీఆర్ ఇప్పుడెందుకు వెళ్తున్నారు?

వాళ్లు కేంద్ర మంత్రులను ఎందుకు కలుస్తున్నారో అర్థం కావడం లేదా ? నితిన్ గడ్కరీ ని కలిసి కేటీఆర్ చిల్లి గవ్వ తెచ్చారా? తెలంగాణ కు నిధులు తీసుకువస్తే మా తో కలిసి రావాలి కాదా ? మీరిద్దరు చీకట్లో కలిసేంది ఏంది? బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు చీకట్లో ఎందుకు కలుస్తున్నారు? రాష్ట్రానికి నిధుల కోసం మేం రోజు పోరాడుతూనే ఉన్నాం. బీఆర్ఎస్ ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయలేదు? మీ ఓట్లు ఎవరికో చెప్పాలి? మోదీని ఓడించాలా,రేవంత్ రెడ్డిని ఓడించాలా… మీ అభ్యర్థి ఎవరో బీఆర్ఎస్ చెప్పాలి.

కేసీఆర్ అసెంబ్లీకి రాడు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడు.ఉప ఎన్నికల్లో చూపిస్తాడట. పదేళ్లలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనేక మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంటే ఉప ఎన్నికలు వచ్చాయా? మరీ ఇప్పుడెందుకు ఉప ఎన్నికలు వస్తాయి ? అవే కోర్టులు, స్పీకర్లు ఉన్నారు కాదా? తలసాని, సబితమ్మ ను కేసీఆర్ సిగ్గు లేకుండా మంత్రులను చేశాడు. కేసీఆర్ కు మిగిలింది గతమే.. భవిష్యత్తు లేదు.

ఫామ్ హౌస్ లో పడుకునే కేసీఆర్ మాకు పోటీనా? హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు అడ్డం పడి అనుమతి ఇవ్వొద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆపారు. ఉత్తర ప్రదేశ్ లో గంగానది, సబర్మతి ,యుమునా ప్రక్షాళన చేసిన బీజేపీ మూసీ నది ప్రక్షాళన ను మాత్రం అడ్డుకుంటోంది. మూసీ ప్రక్షాళనకు అనుమతులు రాకుండా, నిధులు ఇవ్వకుండా అడ్డుకుంటుంది కిషన్ రెడ్డి కాదా? రీజనల్ రింగ్ రోడ్డు కు అనుమతులు రాకుండా అడ్డుకుంటుంది కిషన్ రెడ్డి కాదా? రేవంత్ రెడ్డి కి పేరు వస్తుందనే కిషన్ రెడ్ది అడ్డుకుంటున్నారు. కిషన్ రెడ్డి ఇదేనా నీ నీతి?

ఏం అర్హత ఉందని కిషన్ రెడ్డి పట్టభద్రుల ఓట్లు అడుగుతున్నవు? ఏమీ తీసుకురాని దద్దమ్మ కిషన్ రెడ్డి నీకు ఓటు అడిగే అర్హత ఉందా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేది కాంగ్రెస్ పార్టీనే. ప్రమాణస్వీకారం నుంచి ఇప్పటి వరకు ఒక్క రోజైనా సెలవు తీసుకోలేదు. ఇప్పటివరకు 150 కోట్ల మంది ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వస్తేనే కాంగ్రెస్ కు ఓటు వేయండి.

LEAVE A RESPONSE