– కిషన్‌రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు?
– ధాన్యం కుప్పలపై రైతుల గుండె ఆగితే ఎందుకు స్పందించలేదు?
– కనీస మద్దతు ధర రూ.1960 చెల్లించాలి
– గవర్నర్‌ను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు
రైతు సమస్యలు, తెరాస ప్రభుత్వం పాల్పడుతున్న అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున గవర్నర్‌కు నివేదిక అందించామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి వివరాలు అందించామన్నారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో భేటీ అయ్యారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు.
‘‘వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, కోటి ఎకరాలకు నీరు ఇస్తున్నామని చెప్పిన సీఎం కేసీఆర్ వరి వేస్తే ఉరి అని రైతులను భయపెట్టారు. రైతులు పండించిన పంట కొనకపోవడం వల్ల రైతులకు వేల కోట్ల
రూపాయల నష్టం జరిగింది. వందలాది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ధాన్యం కుప్పలపై రైతుల గుండె ఆగిపోతుంటే ప్రభుత్వం కనీసం వారి కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వ వైఫల్యం వల్ల చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలి. కొనుగోలు కేంద్రాలు తెరవడంలో ఆలస్యం చేయడంతో దాదాపు 30శాతం మంది రైతులు పండించిన ధాన్యం దళారులు, మిల్లర్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. క్వింటా రూ.1960 కనీస మద్దతు ధరకు కొనాల్సిన ధాన్యాన్ని.. మిల్లర్లు, దళారులు కేవలం రూ.1300కే కొన్నారు. ఇప్పటివరకూ జరిగిన కొనుగోళ్లలో రైతులకు రూ.2వేల కోట్ల మేర నష్టం జరిగింది.
ఏ రైతులు తక్కువ ధరకు పంటను అమ్ముకున్నారో వారి వివరాలు మిల్లర్ల దగ్గరున్నాయి. ఆ రైతులకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ.600 అదనంగా బోనస్ ఇవ్వాలని, ఇప్పించాల్సిందిగా గవర్నర్‌కు నివేదిక ఇచ్చాం. రాష్ట్రంలో రైతులు పండించే ధాన్యంలో చివరి గింజా కొనాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చింది. కాంగ్రెస్ ఒత్తిడికి లొంగి కేసీఆర్ ధాన్యం కొంటామని చెప్పారు. ఇప్పుడు సర్కారు కొనుగోలు చేస్తానని చెప్పిన ధాన్యాన్ని కనీస మద్దతు ధర రూ.1960కి రైతులకు చెందే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరాం.
గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు వరికి సంబంధించి నిధులను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి వడ్లను మిల్లర్లకు ఇస్తే.. మిల్లర్లు వడ్లను బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి సరఫరా చేయాల్సి ఉంది. కానీ మిల్లర్లు 8,34,000 మెట్రిక్ టన్నులు బియ్యం సరఫరా చేయలేదని నిన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. ఆ బియ్యం విలువ రూ.2,600 కోట్లు బియ్యం ఉంటుంది. ఇంత మొత్తంలో అవకతవకలు జరిగితే కేంద్రం సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించలేదు?
బియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వకపోతే మిల్లర్ల దగ్గర వడ్లు ఉండాలి. ఎఫ్‌సీఐ అధికారులు మిల్లర్ల వద్ద తనిఖీలు చేస్తే వారి వద్ద వడ్లు లేవు. అంటే మిల్లర్లు, దళారులు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి రూ.2,600 కోట్ల బియ్యాన్ని మాయం చేశారు. దీనిపై స్పందించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్లను, రైతులను అడ్డం పెట్టుకొని.. రాజకీయ ప్రయోజనాల కోసం ధర్నాలు చేస్తున్నారు’’ అని రేవంత్ ఆరోపించారు.