Suryaa.co.in

Telangana

తెలంగాణ మహిళల అదృశ్యంపై స్మిత సబర్వాల్ స్పందించరేం?

– “నైతికత లేని మెజార్టీ ప్రజలతో ప్రమాదం” అంటూ హిందువులను అవమానించడం ఐఏఎస్ అధికారికే చెల్లింది..
– తెలంగాణలో మహిళలపై రోజు కో రీతిలో దారుణాలు జరుగుతున్నా స్పందించకుండా.. భాజపా పాలిత ప్రాంతాలపై విమర్శలు చేయడం దేనికి సంకేతం..?
-రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ.. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం తగునా..!
– ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రులను టార్గెట్ చేస్తూ పోస్టులు
– స్మిత ఇంతలా రెచ్చిపోతుంటే… తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ ఇంటలిజెన్సీ ఏం చేస్తున్నట్టు..?
– తెలంగాణలోని తప్పులను దృష్టి మరల్చేందుకే “గురువింద” చేష్టలు..

హిందుత్వాన్ని.. భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ తెలంగాణ సీఎంవో అధికారి విమర్శలు చేయడం సర్వసాధారణంగా సాగుతోంది. ఇటీవల కాలంలో అది మరింత పెరుగుతోంది. మణిపూర్ ఘటనను ఊటంకిస్తూ..” నైతికత లేని మెజార్టీ ప్రజలతో ప్రమాదం” అంటూ హిందువులను విమర్శించారు. ఒక ఉన్నత స్థాయి అధికారిగా ఉంటూ పార్టీల మధ్య, మతాల మధ్య వ్యత్యాసాలు చూపడం తగునా..?

తెలంగాణలోని మహిళల అదృశ్యంపై స్పందిస్తే మహిళా సమాజానికి మేలు జరిగేది. దాదాపు 35000 మంది మహిళలు తెలంగాణలో అదృశ్యమయ్యారంటే ఇది సాధారణ విషయం కాదు. కానీ దీని విషయంలో కనీసం కూడా స్పందించకపోవడం మహిళలపై స్మిత సబర్వాల్ గారికి ఉన్న ప్రేమను గుర్తు చేస్తోంది.!

మహిళలపై జరిగే అఘాయిత్యాలపై సోషల్ మీడియాలో యాక్టివ్ గా స్పందించే ఆమె.. తన చుట్టూ జరిగే సంఘటనలను పక్కదోవ పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగా స్పందిస్తున్నట్టు అర్థమవుతుంది. దీనినే తెలంగాణ భాషలో “గురువింద నీతులు” అని అంటారు.

తన తప్పులను కప్పిపుచ్చుకొని, ఎదుటివారిని నిందించే పనిలో భాగంగా హిందుత్వంపై.. భారతీయ జనతా పార్టీపై స్మితా సబర్వాల్ గారు బురదజల్లే పనిని ప్రణాళిక బద్ధంగా చేస్తున్నట్లు తెలుస్తోంది.

భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో జరుగుతున్న ఘటనలను భూతద్దంలో చూపి ట్విట్టర్ ద్వారా స్పందించే స్మిత గారు.. తాను పనిచేసే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆకృత్యాలపై నోరు ఇవ్వకపోవడం గమనార్హం!

పనిగట్టుకొని హిందుత్వంపై, భారతీయ జనతా పార్టీపై బురద జల్లడమే ధ్యేయంగా పనిచేస్తామంటే సభ్య సమాజం సహించదు అనే విషయం తెలుసుకోవాలి. నిన్నగాక మొన్న నల్లగొండ జిల్లా వద్దిపట్లలో ఓ మహిళా సర్పంచ్ పై జరిగిన ఘటనపై స్పందించేందుకు స్మిత గారికి సమయం ఉండదు.

గుజరాత్ లో ఏం జరుగుతోంది..? మణిపూర్ లో ఏం జరుగుతోంది..? మధ్యప్రదేశ్లో ఏం జరుగుతోంది..? అంటూ బిజెపి పాలిత ప్రాంతాలను ఎన్నుకోవడం.. కావాలని బురద జల్లడం తన స్థాయికి తగ్గ పని కాదనే విషయం గుర్తుంచుకోవాలి.

ముఖ్యంగా శ్రీమతి స్మిత సబర్వాల్ గారు మహిళా పక్షపాతి అయితే వెంటనే పార్లమెంటు సాక్షిగా వెలుగు చూసిన మహిళల అపహరణ విషయంపై స్పందించాలి.

తెలంగాణలో మహిళల భద్రతకు ఏది భరోసా..?
తెలంగాణ రాష్ట్రంలో గోరాతి గోరంగా మహిళలు అదృశ్యమవుతున్నారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో 34,495 మంది మహిళలు కనిపించకుండా పోవడం ఆందోళన కలిగించే అంశం. ఇదే విషయాన్ని రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా గారు గణాంకాలతో సహా వెల్లడించారు. మరి ఈ విషయంపై స్పందించేందుకు స్మిత గారికి సమయం లేదా..? పౌరుల సంరక్షణ బాధ్యత రాష్ట్రాల దేని అనే విషయం తెలియదా..?

తెలంగాణలో మహిళలకు, బాలికలకు భద్రత ఉందా..? అంటే ప్రశ్నార్థకం.! ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రతకు హామీ కనిపించడం లేదు. ఎందుకంటే తెలంగాణలో పెద్ద సంఖ్యలో మహిళలు బాలికలు అదృష్టమవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 2019 నుంచి 2021 వరకు తెలంగాణ రాష్ట్రంలో 34,495 మంది మహిళలు.. 8066 మంది బాలికలు అదృశ్యమయ్యారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వెల్లడించారు.

ఈ మేరకు మహిళల అదృశ్యంపై రాజ్యసభలో ఎన్సీపీ ఎంపీ హౌసియా ఖాన్ అడిగిన ప్రశ్నకు బుధవారం (నిన్న) కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ANCRB) ప్రకారం 2019లో 2,840 మంది బాలికలు.. 10,74 4 మంది మహిళలు మిస్సయ్యారు. 2020లో 2232 మంది బాలికలు,10,917 మంది మహిళలు కనిపించకుండా పోయారు.

2021 లో 2994 మంది బాలికలు,12,834 మంది మహిళలు తెలంగాణ రాష్ట్రంలో అదృష్టమయ్యారని మంత్రి చెప్పారు. రాజ్యాంగం ప్రకారం పోలీస్ వ్యవస్థ రాష్ట్ర పరిధిలోని అంశమని.. శాంతిభద్రతలు, పౌరుల జీవనం, ఆస్తుల భద్రతను కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుందనే విషయం స్మిత గారికి తెలిసినా తెలియనట్టు ఉన్నారా..? ఇన్ని తప్పులు తమ కింద పెట్టుకొని గురువింద నీతులు మాట్లాడడం అధికారులకు తగునా అనే విషయంపై తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్నారు.

“నైతికత లేని మెజారిటీ ప్రజల మనోభావాలు మన నాగరికతను ప్రమాదంలోకి నెడుతున్నాయని” స్మిత ఆరోపించడం దుర్మార్గం. నీతి.. నైతిక లేని జాతి ఏదో ఒకసారి మీరు పరిశీలించుకోవాలి. ఇటీవల మన తెలంగాణ రాష్ట్రానికి ఆనుకొని ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో, వందల మంది హిందూ అమ్మాయిల నగ్న దృశ్యాలను, రహస్య కెమెరాలతో చిత్రీకరించి.. ముస్లిం యువకులకు షేర్ చేసిన ముస్లిం అమ్మాయిల విషయం స్మితకు తెలియనిది కాదు. కానీ స్పందించేందుకు మనసు రాదు.!

అంతెందుకు మన రాష్ట్రంలో.. మన భాగ్యనగర్ లో రోజుకొకటి ఎక్కడో ఓ చోట ఘోరాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ మేడికో ప్రీతి హత్య ఘటన.. జూబ్లీహిల్స్ రేప్ కేసు..
వరంగల్ లో ఆరు నెలల చిన్నారిపై అత్యాచారం..
టేకు లక్ష్మి అత్యాచారం, హత్య..
సాక్షాత్తు ఓ ఎమ్మెల్యే తనను వేధిస్తున్నాడని రాష్ట్ర రాజధాని మొదలుకొని, దేశ రాజధానిలో ఆందోళన చేస్తున్న శేజల్ ఘటన..
నిజామాబాదు.. యాచారం ప్రాంతాలలో బీఆర్ఎస్ నాయకుల అత్యాచారం..
ఓ సర్పంచ్ పై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య వేధింపులు.. భూపాలపల్లి ఎమ్మెల్యే అంశం..
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దుర్మార్గాలు మన తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకంగా పనిచేసే అధికారికి తెలియక పోవడం బాధాకరం. కానీ దేశం మొత్తంలో భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాలలోని గోరంత సంఘటనలను కొండంత చేయడం మాత్రం బాగా తెలుసు.

అంతెందుకు… గతంలో ఓసారి రాత్రి వేళ తన ఇంట్లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడిన విషయం రాష్ట్రమంతా సంచలనమైంది. ఈ విషయం కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది.

అయితే ఈ విషయంపై తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు అటు ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రికి సరైన సమాచారం ఇవ్వడం లేదనిపిస్తోంది. ఓ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పనిగట్టుకొని ప్రధానమంత్రి, హోంమంత్రి కించపరిచేలా పోస్టులు పెట్టడం రాజ్యాంగ విరుద్ధం.

ఒకవేళ రాజకీయం చేయాలనుకుంటే వెంబడే రాజీనామా చేసి మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాగా రాజకీయాల్లోకి వెళ్లి ఎవరినైన విమర్శించవచ్చు. కానీ రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ.. రాజ్యాంగ విరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడడం చట్టరీత్యా నేరం కూడా. ఐఏఎస్ లు.. ఐపీఎస్ లు తమ పరిధిలో తాము ప్రజలకు సేవ చేయాలి. కానీ.. తామేం చేసిన చెల్లుతుంది అనుకోవడం పొరపాటు.

– పగుడాకుల బాలస్వామి
అధ్యక్షులు
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (JAT)
9912975753
9182674010

LEAVE A RESPONSE