Suryaa.co.in

Political News

సునీల్‌పై చర్యలకు భయమెందుకు?

– ఆయన కులాన్ని చూసి సర్కారు భయపడుతోందా?
– సునీల్‌కు మద్దతుగా విజయనగరంలో మాలల ఆందోళన
– సుప్రీంకోర్టు తీర్పుకు సునీల్ వక్రభాష్యంపై చర్చ
– సుప్రీం సూచన ప్రకారమే కేసు ఉపసంహరించుకున్న రఘరామరాజు
– తిరిగి హైకోర్టునే ఆశ్రయించిన నాటి ఎంపి రాజు
– ఎఫ్‌ఐఆర్‌ను తప్పుపట్టడం ధిక్కారమేనంటున్న అధికారులు
– గతంలో ఏబీవీ మీడియా మందుకెళ్లారని సస్పెన్షన్
– మరి ఇప్పుడు సునీల్‌కు ఆ సస్పెన్షన్ వర్తించదా?
– ట్వీట్ చేయడం సర్వీసు రూల్సు అతిక్రమణేనంటున్న అధికారులు
– జగన్‌పాటి ధైర్యం చేయదన్న వ్యాఖ్యలు
– పోలీసు శాఖలో హాట్‌టాపిక్
( అన్వేష్)

నాటి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును కస్టడీలోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేశారని హత్యాప్రయత్నం ఆరోపణ ఎదుర్కొంటున్న సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌కుమార్‌పై.. క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం భయపడుతుందనే చర్చకు తెరలేచింది.

ప్రభుత్వం అనుమతి లేకుండా సున్నిత-వివాదాస్పద అంశాలపై ట్వీట్ చేయటం, సొంత పోలీసు శాఖ తనపై పెట్టిన కేసు గురించి.. ట్వీట్ ద్వారా కామెంట్లు చేయడంతోపాటు, అందులో సుప్రీంకోర్టును లాగడం, సుప్రీంకోర్టు కొట్టి వేయని అంశాన్ని కొట్టివేసిందంటూ తప్పుదోవపట్టించినందుకు, ప్రభుత్వం ఆయనపై కాండక్టు రూల్సు ఉల్లంఘించినందుకు, సాధారణంగా అయితే వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. జగన్‌రెడ్డి జమానాలో ప్రభుత్వాన్ని విమర్శించకుండానే మీడియాలో మాట్లాడినందుకు, ఏబీ వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్ చేసిన విషయాన్ని సీనియర్ ఐపిఎస్ అధికారులు గుర్తు చేస్తున్నారు.

ఒకవేళ ఆయన ఫలానా కులానికి చెందిన అధికారి కాబట్టి.. సునీల్‌పై చర్యలు తీసుకుంటే ఆ కులం ప్రభుత్వానికి-అధికారపార్టీకి దూరమవుతుందని భయపడి చర్యలకు వెనుకంజ వేస్తే.. భవిష్యత్తులో ఇదే ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ పోలీసు అధికారులు ట్వీట్ల ద్వారా ప్రశ్నించడం, వ్యాఖ్యానించటం ఒక సంప్రదాయంగా మార్చే ప్రమాదం ఉంది.

ఎందుకంటే సునీల్.. పోలీసులు తనపై కేసు నమోదు చేసిన తర్వాత కులం కార్డు సంధించటం ప్రారంభించారని గుర్తు చేస్తున్నారు. ఆయన వర్గానికి చెందిన కొన్ని ఈ- పేపర్లు సైతం అప్పుడే రంగంలోకి దిగిపోయి, దళిత అధికారిని వేధిస్తున్నారన్న విష ప్రచారానికి తెరలేపాయి. విజయనగరం వంటి ప్రాంతాల్లో అయితే మాల సంఘాలు రోడ్డెక్కి సునీల్‌పై కేసును నిరసించాయి. అటు సునీల్ సైతం ‘‘సుప్రీంకోర్టులో మూడేళ్లు నడిచి సాక్షాత్తూ సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్‌ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా’’ నని ట్వీట్ చేశారు.

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు, ఈ సందర్భంగా సునీల్‌కు ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. ‘‘ మీ హృదయం మీద చేయి వేసుకుని చెప్పండి సర్. మిమ్మల్ని ఆసరా చేసుకుని సీఐడీ సంస్థ భుజాలమీద తుపాకి పెట్టి వైసీపీ తన అవసరాలకు అనుకూలంగా, ప్రతిపక్షాలను భయభ్రాంతులను చేయడానికి ఉపయోగించిందా? లేదా? సమాజం క్రింది నుండి ఐపిఎస్ స్థాయికి వచ్చిన మీలాంటి వ్యక్తుల నుంచి సమాజం గొప్పగా ఆశిస్తుంది’’ అని ప్రశ్నించారు.

దానికి స్పందించిన సునీల్.. ‘‘మీరు నేను కాదు. సుప్రీంకోర్టు డిసైడ్ చేసింది. ఏ రోజూ ఏ కోర్టు నన్ను తప్పుపట్టలేదు. మీ అభిప్రాయం మీకు ఉండవచ్చు’’ అని నాగోతుకు జవాబిచ్చారు.

దీనికి సంబంధించి సునీల్ చేసిన ట్వీట్లు పరిశీలిస్తే.. ఆయన సర్వీసు రూల్సును పూర్తిగా ఉల్లంఘించినట్లేనని, సీనియర్ ఐపిఎస్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. స్వయంగా పోలీసు శాఖ వేసిన ఎఫ్‌ఐఆర్‌ను విమర్శించడమంటే ప్రభుత్వాన్ని, పోలీసు శాఖను తప్పు పట్టడమేనని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి లేకుండా, ప్రభుత్వం వేసిన ఎఫ్‌ఐఆర్‌ను ప్రశ్నించడం సర్వీసు రూల్సు ఉల్లంఘనే అని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.

నిజానికి రఘురామకృష్ణంరాజు కేసును సుప్రీంకోర్టు కొట్టివేయలేదని, మీరు హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించగా, అందుకు అంగీకరించిన రఘురామరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వాపసు తీసుకుని, తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. వాస్తవం ఇదికాగా సుప్రీంకోర్టు, తనకు క్లీన్‌చిట్ ఇచ్చిందన్నట్లు ట్వీట్ చేయడం.. అటు సుప్రీంకోర్టును కూడా తప్పు దోవపట్టించడమేనంటున్నారు.

పైగా మేజిస్ట్రేట్ ముందే రఘురామకృష్ణంరాజు తనకు కస్టడీలో పోలీసులు చేసిన గాయాలు చూపించారు. అటు సికింద్రాబాద్ మిలటరీ వైద్యులు సైతం రఘురామరాజు దెబ్బలను ధృవీకరించడం గమనార్హం.

కాగా జగన్‌రెడ్డి వేధింపులతో సస్పెన్షన్‌కు గురైన ఏబీ వెంకటేశ్వరరావుకు అనుకూలంగా అప్పట్లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ సందర్భంలో, ఆ తర్వాత కూడా ఆయన మీడియాతో మాట్లాడిన విషయాన్ని, ఐపిఎస్ అధికారులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అప్పుడు ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గానీ, తనకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్లు ఇచ్చిన అధికారులను గానీ విమర్శించలేదు. కేవలం తన కేసు వరకే పరిమితమయి మీడియాతో మాట్లాడారు.

అయినప్పటికీ, సర్వీసు రూల్సు ఉల్లంఘించారంటూ జగన్‌రెడ్డి సర్కారు, ఏబీవీని సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ‘‘ఈ విషయంలో సునీల్‌కు ఒక న్యాయం.. ఏబీకి మరొక న్యాయమా? సునీల్ నేరుగా ఎఫ్‌ఐఆర్‌ను తప్పుపడుతూ ట్వీట్ చేసినా చర్యలు లేవు. అప్పుడు ప్రభుత్వాన్ని కించిత్తు విమర్శించకపోయినా ఏబీపై చర్యలు తీసుకున్నారు. ఇదేం న్యాయం? ప్రభుత్వమంటే ఎవరున్నా ప్రభుత్వమే కదా?’’ అని ఓ సీనియర్ ఐపిఎస్ అధికారి ప్రశ్నించారు.

నిజానికి సునీల్ ట్వీట్ చేసిన వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవలసి ఉందని, కానీ ఇప్పటివరకూ ఆ పనిచేయలేదంటే.. ప్రభుత్వం ఆయన కులానికి భయపడుతోందన్న అనుమానాలు రావడం సహజమేనని, పోలీసు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘ఇదే జగన్‌రెడ్డి ప్రభుత్వంలో జరిగి ఉంటే ఐదే ఐదు నిమిషాల్లో ఆ అధికారిపై చర్యలు తీసుకుంటున్నట్లు టీవీలో స్క్రోలింగులు వచ్చేవి. దేనికైనా గట్స్ కావాలి. అవి జగన్‌రెడ్డిలో ఉన్నాయి.

అందుకే సునీల్ స్వేచ్ఛగా తాను అనుకున్నవి చేశారు. ఈ ప్రభుత్వం మైనస్-ప్లస్సులు ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి, ఎప్పుడు చర్య తీసుకుంటారో చెప్పలేం’’ అని ఓ సీనియర్ ఐపిఎస్ అధికారి వ్యాఖ్యానించారు.
ఇదిలాఉండగా.. దళిత సంఘాలతో, ప్రధానంగా మాల సంఘాలతో సునీల్‌కు అనుబంధం ఉన్న నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా సీఎం చంద్రబాబు, లోకేష్, రఘురామృష్ణంరాజుకు వ్యతిరేకంగా మాల సంఘాలు ఆందోళనకు తెరలేపడంపై, పోలీసు వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుల సంఘాలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై ఒత్తిడి చేసే వ్యూహాలకు చెక్ పెట్టకపోతే.. రేపు మరొకరు కూడా ఇదే సూత్రం అమలు చేస్తారని ఐపిఎస్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

సర్కారుకు మద్దతుగా రోడ్డెక్కనున్న మాదిగ దండోరా
ఇదిలాఉండగా.. సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌ను సమర్థిస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్న మాల సంఘాల ఒత్తిడిని తిప్పికొట్టేందుకు మాదిగ సంఘాలు రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం అక్రమమని మాల సంఘాలు శనివారం ఆందోళన చేసిన విషయం తెలిసిందే. గతంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య సైతం.. సునీల్ కేవలం మాలలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సునీల్‌పై ఎఫ్‌ఐఆర్ పెట్టడాన్ని సమర్ధిస్తూ మాదిగ దండోరా రోడ్డెక్కాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

LEAVE A RESPONSE