మోడీ ప్రభుత్వం అమరావతికి నిధులు కేటాయిస్తే అభినందించరేంటి! అంటూ ఒక బిజెపి నాయకుడు పాపం చాలా నిష్టూరంగా సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టు పెట్టారు. అమరావతి రాజధాని నిర్మాణానికి మోడీ ప్రభుత్వం నిధులు కేటాయించిన బడ్జెట్ పత్రాలను వెల్లడించమని ఆ బిజెపి నేతకు విజ్ఞప్తి చేస్తున్నా.
కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బడ్జెట్ పేపర్స్ ను నేను పరిశీలించాను. సంతోషపడడానికి వాటిలో ఏమీ లేదు. అదొక సాధారణ బడ్జెట్ ప్రక్రియ అంతే! గతంలో ఆమోదించబడి, నిర్మాణం పెండింగ్ లో ఉన్న పధకాలు/పనుల అంచనా వ్యయాన్ని ప్రస్తావించి, బడ్జెట్ లో మాత్రం నామమాత్రంగా ఒక లక్ష రూపాయల చొప్పున కేటాయించారు.
ఆ పెండింగ్ నిర్మాణ పనులు కూడా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం
– 2014లో పొందుపరచిన రాజధాని నిర్మాణానికి సంబంధంలేని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర సచివాలయం, వాటిలో పనిచేసే ఉద్యోగుల గృహ సముదాయాల నిర్మాణ పనులు మాత్రమే. వాటికైనా నిధులు ఎక్కుగా కేటాయించి, నిర్మాణ పనులను వేగవంతం చేసే ఆలోచన చేశారా అంటే అదీ లేదు.
రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ పట్ల మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న అలసత్వం, నిర్లక్ష్యంతో కూడిన బాధ్యతారాహిత్యానికి శభాష్! అని చప్పట్లు కొట్టాలా! ఆంధ్రప్రదేశ్ పట్ల బాధ్యతగా ఆలోచించండి.
