– ప్రజల సూచనలు ఎందుకు స్వీకరించలేదు?
– గ్రామాలు, మండలాల వారీగా డేటా ఎందుకు గోప్యంగా పెట్టారు?
– ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలి
– బీజేపీని బీఆర్ఎస్ విమర్శించడమంటే దెయ్యాలు వేదాలు చదివినట్టే
-భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్
హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ అసలు ముఖం బయటపడింది. కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ రిజర్వేషన్ల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మరోసారి నిరూపితమైంది. రిజర్వేషన్ల అంశం న్యాయసమీక్షకు వెళ్తుందని తెలిసినా, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించారు. దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే.
బీసీలకు నిజమైన రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచన రేవంత్ రెడ్డికి లేదు. కేవలం బీహార్ ఎన్నికల్లో రాజకీయ లాభం కోసం, రాహుల్ గాంధీ ఒత్తిడికి లొంగి బీసీ రిజర్వేషన్ల పేరుతో డ్రామాలు ఆడారు. చివరికి బీసీ వర్గాలను మరోసారి వంచించారు.
బీహార్‌లో బీసీ వర్గాలన్నీ ఎన్డీయే వైపు మొగ్గుచూపుతున్నాయి. అన్ని వర్గాల మద్దతుతో ఎన్డీయే విజయం సాధించనుందని సర్వేలు చెబుతున్నాయి. దీని భయంతోనే కాంగ్రెస్ పార్టీ 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై గత మూడునెలలుగా పన్నాగాలు పన్నింది.
బీసీలకు రిజర్వేషన్లు పెంచే ప్రయత్నం చేశామని చెప్పి, కోర్టు తీర్పులను నెపంగా వాడుకుని బీసీల ఓట్లు దండుకోవాలన్న ప్రయత్నమే చేసింది కాంగ్రెస్. ప్రజలను, బీసీ వర్గాలను రెచ్చగొట్టే రాజకీయ యత్నం తప్ప ఇది మరొకటి కాదు. రిజర్వేషన్ల అంశం రాజ్యాంగపరమైన, శాస్త్రీయమైన ప్రక్రియతోనే సాధ్యమని తెలిసీ, కాంగ్రెస్ పార్టీ దానిని పూర్తిగా అపహాస్యం చేసింది. ఆర్డినెన్స్, జీవోల పేరుతో కాలయాపన చేస్తూ కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసింది.
ట్రిపుల్ టెస్ట్, ఎంపిరికల్ డేటా అంశంలో పూర్తిగా వైఫల్యం చెందారు. సుప్రీంకోర్టు ఇచ్చిన “ట్రిపుల్ టెస్ట్” ప్రకారం ప్రత్యేక కమిషన్, ఎంపిరికల్ డేటా, 50 శాతం రిజర్వేషన్ క్యాప్ అనుసరించాల్సిన బాధ్యత రాష్ట్రాలకు ఉంది. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో, న్యాయపరమైన సలహాలు లేకుండా బీసీలను మోసం చేయాలని చూశింది.
రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 31న అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్‌కు పంపి, గవర్నర్ నిర్ణయానికి ముందు గడువు ముగియకముందే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది చట్టవిరుద్ధ చర్య. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను కూడా విస్మరించింది.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే వివరాలను పబ్లిక్ డొమైన్లో ఎందుకు ఉంచలేదు? ప్రజల సూచనలు ఎందుకు స్వీకరించలేదు? గ్రామాలు, మండలాల వారీగా డేటా ఎందుకు గోప్యంగా పెట్టారు? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలి.
కాంగ్రెస్‌కు బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించిన హామీలను అమలు చేసేది. 22 నెలలు గడిచినా 42 శాతం రిజర్వేషన్ల అంశంలో ఎటువంటి పురోగతి లేదు. బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ ఉద్దేశం అని ఇవాళ స్పష్టమైంది.
గ్రామాల జనాభా, మండలాల జనాభాను దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగాలి. కోర్టు కూడా గుర్తించింది — ఎలక్షన్ కమిషన్ రాష్ట్రాన్ని మొత్తం ఒకే యూనిట్‌గా ఎందుకు పరిగణించింది? అనే ప్రశ్నే ఇప్పుడు ప్రధానాంశంగా మారింది.
అడిషనల్ జనరల్ అభిషేక్ సింఘ్వీ , రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సమాధానం చెప్పలేకపోవడం, “మాకు సమాచారం లేదు. ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకుంటాం” అని చెప్పడం ఆశ్చర్యకరం. ప్రభుత్వం తరపున వాదించే న్యాయవాదులకే వివరాలు తెలియకపోతే, బీసీల పట్ల ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో ఇది స్పష్టంగా చూపిస్తోంది.
ఇలాంటి నిర్లక్ష్యం, సమగ్ర సమాచారం లేని తీరే బీసీ సమాజాన్ని ఎలా వంచిస్తున్నారో చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. గత లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సున్నా సీట్లు సాధించి రాజకీయంగా కనుమరుగవుతోంది. గతంలో ఆ పార్టీ కూడా బీసీలను మోసం చేసింది. ఇప్పుడు రాజకీయంగా తాము నిలబడలేకపోవడంతో బీసీల గురించి ముసలి కన్నీళ్లు కారుస్తూ నాటకాలు వేస్తోంది.
మీ చేతుల్లో ఉండి పార్టీ సంస్థాగత ఎన్నికల్లో కూడా మీరు ఒక బీసీని నియమించలేని బీఆర్ఎస్ పార్టీ, మీ చేతుల్లో ఉన్న నామినేటెడ్ మంత్రి పదవులు ఇవ్వలేని బీఆర్ఎస్ పార్టీ, ఇవాళ బీజేపీని విమర్శించడమంటే దెయ్యాలు వేదాలు చదివినట్టే ఉంది.
బీసీల సంక్షేమం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి నిజంగా ప్రేమ చిత్తశుద్ధి ఉంటే… బీసీ మేధావులు, బీసీ సంఘాలు ఒకసారి ఆలోచించండి. ఈ ప్రభుత్వ భ్రమలకు లోనుకాకుండా, మీ హక్కుల కోసం, అధికారాల కోసం తప్పకుండా పోరాటం చేయండి. బీజేపీ పూర్తిగా మీకు అండగా ఉంటుంది.
రేవంత్ రెడ్డి కి కొన్ని ప్రశ్నలు
మీరు కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీ సబ్‌ప్లాన్‌కి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. ఇప్పుడు ఏ కోర్టులు మీకు అడ్డం వచ్చాయి? ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రతి ఏటా 20 వేల కోట్ల బడ్జెట్ బీసీల సంక్షేమం కోసం ఖర్చు పెడతామని చెప్పారు. అంటే ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్లు ఖర్చు చేయాలని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు బడ్జెట్లో 4 శాతం కూడా కేటాయింపులు లేవు. ఏ కోర్టు అడ్డం వచ్చింది?
మీకు నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉంటే, సామాజిక న్యాయం జరగాలని చిత్తశుద్ధి ఉంటే — కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పినట్లు ప్రభుత్వ సివిల్ కాంట్రాక్ట్స్, కన్స్ట్రక్షన్స్, మెయింటెనెన్స్‌లో బీసీలకు 42% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేకపోయారు? తెలంగాణలో ఒక్క కాంట్రాక్ట్‌లో అయినా అది అమలయ్యిందా?
ఆనాడు బీఆర్ఎస్ “తెలంగాణా సెంటిమెంట్, తెలంగాణా నిధులు, నీళ్లు, నియామకాలు” అంటూ లక్షల కోట్ల కాంట్రాక్టులు ఎవరికి అప్పగించిందో.. తెలంగాణ సమాజం ఇప్పుడు అర్థం చేసుకుంటోంది.
ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి పని చేస్తోంది..?
బీసీ యువత కోసం చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి, ఉన్నత విద్య కోసం వడ్డీ లేకుండా రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తామని మీరు చెప్పారు. ఇప్పటివరకు ఎంతమందికి ఆ రుణాలు ఇచ్చారు? వీటిన్నింటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.
బీసీ యువతకు చిన్న వ్యాపారాలు నిర్వహించుకునేందుకు, ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేని, వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు. ఇంతవరకు ఎంత మందికి ఇచ్చారు? మొత్తం ఎంత ఇచ్చారు? దీనిపై స్పష్టత లేదు.
అన్ని జిల్లా కేంద్రాల్లో రూ.50 కోట్లతో కన్వెన్షన్ హాల్, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ సమీకృత భవనాలు నిర్మిస్తామన్నారు. ఇప్పటివరకు ఒక్క భవనం కూడా నిర్మించలేదు.
ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాలకు సమానంగా బీసీల కోసం ఒక కొత్త గురుకులం, ప్రతి జిల్లాలో ఒక కొత్త డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విషయంలో ఇప్పటివరకు అడుగు కూడా ముందుకు పెట్టబడలేదు.
వార్షిక ఆదాయం రూ.3 లక్షల కంటే తక్కువ ఉన్న బీసీ కుటుంబాల యువతకు ర్యాంక్ సంబంధం లేకుండా మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని ప్రకటించారు. ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇవ్వబడలేదు.
“వృత్తి బజార్” పేరుతో ప్రతి మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి, మంగలి, వడ్రంగి, చాకలి, కమ్మరి, స్వర్ణకారుల వంటి చేతి వృత్తుల వారికి ఉచితంగా షాపు స్థలాలు అందిస్తామని తెలిపారు. కనీసం ఒక్క మండలంలోనైనా షాపింగ్ బజార్లు ఏర్పాటు చేశారా? ఇంకా ఏర్పాట్లు లేవు.
బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ, రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఇప్పటివరకు ఒక్క సొసైటీకి కూడా సాయం అందలేదు.
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీ చేస్తామని చెప్పారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాగ్దానాలు పూర్తిచేయలేదు.
ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయింపు, ఈత మొక్కలు, బిందు సేద్యం, కాంపౌండ్ నిర్మాణాలపై 90% సబ్సిడీ ఇవ్వాలని చెప్పారు. ఇప్పటివరకు ఏమీ జరగలేదు.
మద్యం షాపుల లైసెన్సులలో గౌడ్లకు ఉన్న రిజర్వేషన్లు 15% నుండి 25%కి పెంచుతామని చెప్పారు. ఇప్పటివరకు ఎందుకు పెంచలేదు? ఎందుకు మీకు మనసు రాలేదు?
జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు మారుస్తామని చెప్పారు. కాని ఇంతవరకు పేరు మార్చలేదు.
తెలంగాణలో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి, యువ పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ రుణాలు పంపిణీ చేయాలని హామీ ఇచ్చారు, కానీ ఇప్పటివరకు ఏమీ జరగలేదు.
జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలలో మెగా పవర్లూమ్ క్లస్టర్ల ఏర్పాటు చేస్తామని చెప్పారు. చేనేతలను ఆదుకోవడానికి చర్యలు తీసుకున్న పాపానపోలేదు. పద్మశాలీలకు పవర్ లూమ్స్ మరియు పరికరాలపై 90% సబ్సిడీ ఇవ్వలేదు.
మంగలి, స్వర్ణకారులు, కమ్మరి, వడ్రంగులు, రజకులు, కుమ్మరులకు 90% సబ్సిడీతో టూల్ కిట్లు పంపిణీ చేస్తామని చెప్పారు. ఒక్క టూల్ కిట్ కూడా పంపిణీ చేయలేదు. ఇదే సమయంలో, నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పీఎం విశ్వకర్మ యోజన ద్వారా 30 లక్షల కుటుంబాలకు ఆధునిక టూల్ కిట్లు ఉచితంగా పంపిణీ చేసింది.
ఇవన్నీ కామారెడ్డి డిక్లరేషన్‌లో పేర్కొన్న హామీలు. ఎక్కడా న్యాయస్థానాలు అడ్డుపడలేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా అమలు చేయలేదు. ఎందుకంటే బీసీలను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే పరిగణించి, మళ్లీ ఎన్నికల సమయంలోనే చూద్దాం అనుకుంటూ ఏ హామీ అమలు చేయలేదు.
బీసీల విషయంలో కాంగ్రెస్ ది గతమంతా మోసపూరిత వైఖరే. మొదటిసారిగా కాకా కలేల్కర్ కమిషన్ 1955లో రిపోర్ట్ ఇచ్చింది — ఈ దేశంలో కులగణన చేపట్టి, ఆ కులాల జనాభాకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ సూచించింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ రిపోర్టును చెత్తబుట్టలో పడేసింది.
మండల్ కమిషన్ 1978లో మురార్జీ, దేశాయ్ కమిషన్ సిఫారసులు వచ్చాయి. తరువాత మరొకసారి 1990లో కూడా అదే సిఫార్సులు పలు సందర్భాల్లో పునరుద్ఘాటించడం జరిగింది. ఈ దేశంలో కులగణన చేపట్టి, దానికి అనుగుణంగా ప్రభుత్వాలు వారి సంక్షేమ కార్యక్రమాలు, జనాభా ఆధారంగా రిజర్వేషన్ల ప్రక్రియను నడపాలని సూచన వచ్చింది. అయితే, రాజీవ్ గాంధీ గారు ఈ విషయాన్ని పక్కన పెట్టిన చరిత్ర తెలంగాణ బీసీలు మర్చిపోవద్దు.
అన్ని వర్గాలకు సమదృష్టితో, పేదవారికి, బలహీన వర్గాలకు, దళితులకు, ఆదివాసీలకు, మహిళలకు, రైతు యువతకు వంటివారికి భాగస్వామ్యాన్ని కల్పిస్తూ “సబ్ కా సాత్, సబ్ కా వికాస్ ధోరణితో సామాజిక న్యాయం కోసం పనిచేస్తోంది.
ఇప్పటికైనా తెలంగాణ సమాజం, ముఖ్యంగా బీసీ మేధావులు, విద్యార్థులు, యువకులు బీసీల పట్ల జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పన్నిన కుట్రలకు వ్యతిరేకంగా ఒక్కటిగా నిలబడాలి.
అందుకే అన్ని బీసీ సంఘాలు, నాయకులు, యువత ఒకచోట కట్టి, గట్టి లక్ష్యంతో ముందుకు రావాలని కోరుతున్నాను. రాజకీయ డ్రామాలలో మురిగిపోకుండా, మీ హక్కుల కోసం ఒకటై పోరాడండి. బీజేపీ మీకు అండగా ఉంది.