Suryaa.co.in

Editorial

కేసీఆర్‌ యాగంతో బీజేపీ ఓట్లు ఆగం?

– యాగంతో కేసీఆర్‌ హిందువులకు చేరువ
– మరోసారి రాజశ్యామల యాగం చేసిన కేసీఆర్‌
– ఎన్నికల ముందు హిందువులకు చేరువ
– హిందూ వ్యతిరేకి అంటూ కేసీఆర్‌పై బీజేపీ విమర్శలు
– ముస్లిం అనుకూలనేతగా బీజేపీ ముద్ర
– సంజయ్‌ హయాంలో కేసీఆర్‌పై బీజేపీ వ్యతిరేక ముద్ర
– తరచూ భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలంటూ సంజయ్‌ సవాల్‌
– తాజాగా రాజశ్యామల యాగంతో ఇరుకునపడ్డ బీజేపీ
– హైందవతత్వం పూర్తిగా తెలిసిన మహాజ్ఞాని అంటూ స్వరూపానంద కితాబు
-మహాభారతం చదివిన జ్ఞానిగా శారదాపీఠాథిపతి స్వరూపానంద ఆశీస్సులు
– రాజశ్యామల యాగంతోనే హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని వెల్లడి
– రాజశ్యామల యాగంతో హిందువులకు చేరువైన కేసీఆర్‌
– హిందువుల ఓట్లలో చీలిక తప్పదా?
– కేసీఆర్‌పై బీజేపీ ‘హిందూ వ్యతిరేకముద్ర’ మంత్రం పనిచేయదా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

బీఆర్‌ఎస్‌ అధినేత-తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరోసారి హిందువుల హృదయాలను జయించబోతున్నారా? ఇప్పటివరకూ తనపై ఉన్న హిందూ వ్యతిరేకముద్రను తొలగించుకుని, హిందువుల ఓట్లు సాధించనున్నారా? తాజాగా శారదా పీఠాథిపతి స్వరూనంద స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న రాజశ్యామల యాగ ఫలితం అదేనా అన్న చర్చకు తెరలేచింది.

తరచూ యాగాలు నిర్వహించే కేసీఆర్‌, ఎన్నికల ముందు మరోసారి చేసిన రాజశ్యామల యాగం.. కేసీఆర్‌పై బీజేపీ వేసిన హిందూ వ్యతిరేక ముద్రను చెరిపివేసేందుకు కారణమయింది. నిజానికి హిందూ ధార్మిక వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే కేసీఆర్‌కు జోతిష- సంఖ్యా-వాస్తు శాస్ర్తాలపై నమ్మకం మెండు. ఏ కార్యక్రమం నిర్వహించినా మంచిరోజు, శుభఘడియ, తనకు కలసివచ్చిన సంఖ్య ప్రకారమే, కేసీఆర్‌ తన ప్రస్థానం ప్రారంభిస్తారు. పండితులను పోషిస్తారు. బ్రాహ్మణ పండితులను సత్కరిస్తుంటారు.

అయినా కేసీఆర్‌ హిందువులకు వ్యతిరేకంగా, ముస్లింలకు అనుకూలంగా ఉన్నారన్న ప్రచారాన్ని, బీజేపీ క్షేత్రస్థాయిలో చర్చనీయాంశం చేయడమే ఆశ్చర్యం. రాజకీయంగా ఆయన మజ్లిస్‌ పార్టీతో సత్సంబంధాలు కొనసాగించడం, మజ్లిస్‌ తన మిత్రపక్షం అని బహిరంగంగా ప్రకటించడమే దానికి కారణం కావచ్చు. గతంలో నిజాం నవాబును కూడా కేసీఆర్‌ పొగిడిన వైనం వివాదానికి దారితీసింది. దానికితోడు ఒక బహిరంగసభలో హిందూ గాళ్లు-బొందు గాళ్లంటూ చేసిన వ్యాఖ్య వివాదం సృష్టించిన విషయం తెలిసిందే.

హిందూ మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించిన నాటి రజాకార్ల వారసులైన మజ్లిస్‌ పార్టీకి.. కేసీఆర్‌ మద్దతునివ్వడం ఏమిటని, నాటి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కొన్ని వందలసార్లు ప్రశ్నించారు. ప్రతి సందర్భంలోనూ చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్‌ విసిరేవారు. ఇవన్నీ కేసీఆర్‌ను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేసేందుకు, బీజేపీ గత కొంతకాలం నుంచీ చేస్తున్న ప్రయత్నాలేనన్నది బహిరంగ రహస్యం.

అయితే.. ఉమ్మడి రాష్టంలో కంటే తెలంగాణ ఏర్పడిన తర్వాతనే, తెలంగాణలో దేవాలయాలు అభివృద్ధి చెందాయన్న భావన క్షేత్రస్థాయిలో ఉంది. ఇక ప్రాధాన్యం ఉన్న జాతర్లకు ప్రభుత్వమే.. చిన్న చిన్న దేవాలయాలను నిధులు ఇస్తున్న సంప్రదాయం కేసీఆర్‌తోనే మొదలయింది. ఉమ్మడి రాష్ట్రంలో చిన్న-మధ్య తరహా దేవాలయాల్లో జరిగే జాతర్లకు, ప్రభుత్వం నుంచి నయాపైసా నిధులు వచ్చేవి కాదు. ఇక కొన్ని విమర్శలున్నప్పటికీ.. యాదాద్రిని అత్యద్భుతంగా తీర్దిదిద్దిన ఘనత కూడా కేసీఆర్‌దే.

యాదాద్రి నిర్మాణాన్ని ఆయన పలుమార్లు స్వయంగా దగ్గరుండి సమీక్షించారు. ఫలితంగా ఇప్పుడు యాదాద్రి పరిసర ప్రాంతాల్లో, స్థలాలకు ఎక్కడ లేని డిమాండ్‌ వచ్చింది. తిరుపతికి ధీటుగా యాదాద్రిని నిర్మించాలన్న కేసీఆర్‌ కల ఇటీవలి కాలంలో నెర వేరింది. అందుకోసం ఆయన చురుకుగా పనిచేసే అధికారులను నియమించి, రోజువారీ పనులను సమీక్షించారు.

మంత్రివర్గంలో కేసీఆర్‌తోపాటు.. పోచారం శ్రీనివాసరెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి వంటి సీనియర్‌ మంత్రులకు సైతం ఆధ్యాత్మికభావన మెండు. వీరిలో చాలామంది సొంత ఖర్చుతో దేవాలయాలు నిర్మించినవారు కొందరయితే.. భారీ స్థాయిలో విరాళాలు ఇచ్చేవారు మరికొందరు. వీరంతా హోదాపరంగా స్థానికంగా ముస్లింలతో సన్నిహితంగా ఉంటున్నప్పటికీ, ఆధ్మాతిక కార్యక్రమాలకు ఎక్కువగా పాల్గొంటుంటారు.

అయితే తమపై బీజేపీ వేసిన ‘కేసీఆర్‌ హిందూ వ్యతిరేకముద్ర’ను చెరిపేయడంలో గానీ, ఖండించడంలో గానీ వీరంతా విఫలమయ్యారన్న భావన బీఆర్‌ఎస్‌లో లేకపోలేదు. బీజేపీ నేతల ప్రచారాన్ని బీఆర్‌ఎస్‌ నేతలు ఖండించకపోవడంతో, బీఆర్‌ఎస్‌ హిందూ వ్యతిరేకి అన్న ముద్ర స్ధిరపడింది.

ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఎన్నికల సమయంలో నిర్వహించిన రాజశ్యామల యాగం, బీఆర్‌ఎస్‌ను హిందువులకు చేరువ చేసినట్టయింది.

పైగా యాగం నిర్వహించిన శారదా పీఠాథిపతి స్వరూపానంద స్వామి సీఎం కేసీఆర్‌నుద్దేశించి చేసిన వ్యాఖ్యలు, బీఆర్‌ఎస్‌ను హిందువులకు చేరువ చేసేలా కనిపిస్తున్నాయి. ‘మహాభారతం చదివిన జ్ఞాని కేసీఆర్‌.హైందవతత్వం పూర్తిగా తెలిసిన వ్యక్తి. తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని కేసీఆర్‌ రాజశ్యామలయాగం చేస్తున్నారు. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసమే కేసీఆర్‌ యాగం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ అభివృద్ధి జరిగిందంటే గతంలో కేసీఆర్‌ చేసిన రాజశ్యామలయాగం వల్లనే’’ అని స్వరూపానంద చేసిన వ్యాఖ్యలు, హిందువులపై పెను ప్రభావం చూపేదన్నది సుస్పష్టం.

తాజాగా కేసీఆర్‌ మూడురోజుల పాటు నిర్వహించే రాజశ్యామలయాగం.. దానిని నిర్వహిస్తున్న కేసీఆర్‌ను, స్వరూపానందస్వామి ‘హిందూధర్మ పరిరక్షకుడు’ తెలంగాణ అభివృద్ధి కోసమే యాగం చేస్తున్నార’ంటూ ఇచ్చిన ప్రశంసలతో, బీఆర్‌ఎస్‌పై ఉన్న ‘హిందూవ్యతిరేకముద్ర’ విజయవంతంగా చెరిపేసినట్టయింది.

ఇది ఒకరకంగా బీజేపీ హిందూ ఓట్లలో, చీలిక తెచ్చే పరిణామమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్‌ రాజశ్యామలయాగం.. బీజేపీ హిందుత్వ నినాదం బలహీనపడే ప్రమాదం లేకపోలేదన్న వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.

LEAVE A RESPONSE