Suryaa.co.in

Andhra Pradesh

ఐటి కంపెనీలు తెస్తా…యువత కలలు నెరవేరుస్తా!

-అహర్నిశలు కష్టపడతా… ప్రతిహామీ నిలబెట్టుకుంటా
-అధికారంలో రాగానే వైసిపి బాధిత దళితులకు న్యాయం
-మంగళగిరి రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్
-పెదకొండూరు లో లోకేష్ కు జనసైనికుల అపూర్వస్వాగతం

మంగళగిరి: తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మంగళగిరికి ఐటి కంపెనీలు తెచ్చి, యువత కలలను నెరవేరుస్తానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దుగ్గిరాల మండలం పెదకొండూరు, పెదపాలెం, మోరంపూడి గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ సభల్లో యువనేత పాల్గొన్నారు. పెదకొండూరు గ్రామంలో యువనేతకు అపూర్వ స్వాగతం లభించింది. తొలుత పెదకొండూరు గ్రామశివార్లలోని శ్రీ కనక పుట్టలమ్మ అమ్మవారిని లోకేష్ దర్శించుకున్నారు.

అనంతరం గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్తలు, జనసైనికులు, యువనేతకు మోటారు సైకిళ్లు, ట్రాక్టర్లతో ర్యాలీగా ఊరంతా తిప్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పెదకొండూరు ప్రజల అభిమానానికి యువనేత మంత్రముగ్దుడయ్యారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో మంగళగిరి ఆటోనగర్ లో తాము తెచ్చిన ఐటి కంపెనీల మాదిరిగానే అధికారంలోకి వచ్చాక కొత్త కంపెనీలను రప్పిస్తాం. అహర్నిశలు కష్టపడి మంగళగిరి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటా. 2019లో ఓడిపోయాక మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలనే పట్టుదలతో ప్రయాణం ప్రారంభించాను.

గెలిచినోళ్లు నియోజకవర్గాన్నిపట్టించుకోకుండా వెళ్లిపోతే, ఓడిపోయినా 29సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సొంతనిధులతో అమలుచేశాను. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే ఒక్క రోడ్డుగానీ, సిమెంటు బల్లగానీ వేశారా? నేను చేసిన సంక్షేమంలో 10వవంతైనా చేయగలిగారా? మెయిన్ రోడ్డుపై కనీసం గుంతలు కూడా పూడ్చలేకపోయారు. ఎమ్మెల్యే ఆర్కే ఒక్కసారి కూడా ఈ గ్రామానికి ముఖం చూపలేదు.

నేను రెండుసార్లు వచ్చి ప్రజల కష్టాలు తెలుసుకున్నా. అధికారంలోకి వచ్చాక నియోజకవర్గ వ్యాప్తంగా భూగర్భ డ్రైనేజి ఏర్పాటుచేస్తా. కృష్ణానది నుంచి పైప్ లైన్ వేసి ఇంటింటికీ కుళాయిద్వారా నీరు అందిస్తాం. పెండింగ్ రోడ్లు, డొంకరోడ్ల నిర్మాణం చేపడతాం. అహర్నిశలు కష్టపడి మంగళగిరిని దేశంలోనే అభివృద్ధికి చిరునామాగా మార్చే బాధ్యత నేను తీసుకుంటా.

కులాలపేరుతో చిచ్చుపెట్టేందుకు ముసుగునేతల కుట్ర
కాపునేతల ముసుగులో ఉన్న కొందరు జగన్ కోవర్టులు ప్రజలమధ్య చిచ్చుపెట్టేందుకు కుట్రపన్నుతున్నారు. జగన్ కాపు రిజర్వేషన్ రద్దుచేసినపుడు ఆ నేతలు పట్టించుకోలేదు. గత అయిదేళ్లుగా కాపు కార్పొరేషన్ కు ఒక్కరూపాయి కేటాయించలేదు. కాపులకోసం కార్పొరేషన్ ఏర్పాటుచేసి నిధులు కేటాయించింది గత టిడిపి ప్రభుత్వం మాత్రమే. దళితుల కోసం చంద్రబాబు 27సంక్షేమ పథకాలు, పండుగ కానుకలు, పెళ్లికానుక, విదేశీవిద్య వంటివి అమలుచేస్తే, వైసిపి ప్రభుత్వం వాటన్నింటినీ రద్దుచేసింది.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక దళితులపై దాడులు పెరిగిపోయాయి. వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను దారుణంగా హతమార్చి శవాన్నిడోర్ డెలివరీ చేశాడు. నాసిరకంపై మద్యంపై ప్రశ్నించిన ఓంప్రతాప్ ను పాపాల పెద్దిరెడ్డి హతమార్చారు. ఇసుక అక్రమాలపై ప్రశ్నించినందుకు తూర్పుగోదావరిలో వరప్రసాద్ కు గుండుకొట్టించారు. కరోనా సమయంలో పిపిఇ కిట్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ను మానసికంగా వేధించి గుండెపోటు వచ్చేలాచేసి ప్రాణాలు తీశారు.

40రోజుల్లో ప్రజాప్రభుత్వం వచ్చిన వెనువెంటనే వైసిపి బాధిత దళిత కుటుంబాలకు న్యాయం చేసే ప్రక్రియ ప్రారంభిస్తాం. జగన్ ప్రభుత్వం రద్దుచేసిన 27 ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్దరిస్తాం. జగన్ కు శవరాజకీయాలంటే ఇష్టం. 2014లో తండ్రి శవం, 2019లో బాబాయి శవంతో రాజకీయం చేసిన జగన్… ఈసారి పెన్షన్లు ఇవ్వకుండా 32మంది వృద్ధులను చంపి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రస్తుతం 3వేలు ఉన్న వృద్ధాప్య పెన్షన్ ను 4వేలకు పెంచుతాం.

యువనేత ఎదుట పెదకొండూరు వాసుల సమస్యలు
పెదకొండూరు ప్రజలు యువనేత లోకేష్ ఎదుట సమస్యలను విన్నవించారు. పెదకొండూరులో చదుకున్న యువత ఉపాధిలేక ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజి, పంటపొలాలకు పిల్లకాల్వలు సరిగా లేవు. రెవిన్యూ రికార్డులు సరిగా లేవు. అడంగళ్, 1-బి పత్రాల కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇసుక మాఫియా కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గ్రామంలో యువకులు ఆడుకోవడానికి ఆటస్థలం, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుచేయండి. గ్రామంలోని పుట్టాలమ్మ గుడితోపాటు శివాలయాలు, జనార్దనస్వామి ఆలయాల అభృవృద్ధికి నిధులు కేటాయించండి. ఆధార్ కార్డుల్లో వయసు తప్పుల తడకగా నమోదుచేయడంతో ప్రభుత్వ పథకాలు అందక ఇబ్బంది పడుతున్నాం.

ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ ను నియమించాలి. కౌలురైతులకు ప్రభుత్వం నుంచి సాయం అందడం లేదు. పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతులను ఆదుకోవాలి. సబ్సిడీపై డిఎపి, పొటాష్, ఇతర ఎరువులను అందించాలి. గ్రామంలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. యువనేత లోకేష్ స్పందిస్తూ… అధికారంలోకి రాగానే పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. రెవిన్యూ రికార్డులు సరిచేసి రైతుల ఇబ్బందులను తొలగిస్తాం. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం. కౌలురైతుల చట్టాన్ని పకడ్బందీగా అమలుచేసి కౌలురైతులకు న్యాయంచేస్తాం.

ఆలయాలను అభివృద్ధిచేసి పర్యాటక కేంధ్రంగా తీర్చిదిద్దుతాం. గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి, తాగునీటి పైప్ లైన్ ఏర్పాటుచేశాక సిమెంటు రోడ్లు నిర్మిస్తాం. ఆధార్ కార్డుల్లో తప్పులను సరిచేయిస్తాం. రైతులకు ఎరువుల సబ్సిడీ, ఇన్ పుట్ సబ్సిడీలు అందించి ఆదుకుంటాం. మంగళగిరిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా, మీ చుట్టూ తిరిగి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా, నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని లోకేష్ విజ్ఞప్తిచేశారు.

లోకేష్ ఎదుట పెదపాలెం ప్రజల సమస్యల వెల్లువ
పెదపాలెం ప్రజలు తమ సమస్యలను యువనేత లోకేష్ దృష్టికి తెచ్చారు. గ్రామంలో సైడు కాల్వలు నిర్మించి డ్రైనేజి సమస్యను పరిష్కరించాలి. దళితులు, పల్లెకారులు, గౌడలకు కమ్యూనిటీ హాళ్లు నిర్మించాలి. ఎంఎస్ఎంఈలకు సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించాలి. శ్మశానికి వెళ్లేందుకు రోడ్డునిర్మించాలి. పొలాలకు వెళ్లే డొంకరోడ్ల నిర్మాణం చేపట్టాలి. మీ-సేవ ఆపరేటర్లను ఆదుకోవాలి. ప్రస్తుతం ఊరికి దూరంగా గొడవర్రు వద్ద పనికిరాని స్థలాలిచ్చారు. సొంత గ్రామంలోనే ఇళ్లస్థలాలివ్వాలి. ప్రభుత్వభూముల్లో నివసిస్తున్నవారికి పట్టాలివ్వాలి. గ్రామంలో జూనియర్ కళాశాల నిర్మించాలని కోరారు.

యువనేత నారా లోకేష్ స్పందిస్తూ… అధికారంలోకి వచ్చాక అండర్ గ్రౌండ్ డ్రైనేజి, తాగునీటి పైప్ లైన్ ఏర్పాటుచేసి కుళాయిలు అందిస్తాం.. గ్రామస్తుల కోరిక మేరకు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపడతాం. ఎంఎస్ఎంఈలకు గతంలో మాదిరిగా ప్రోత్సహాకాలు అందజేస్తాం. వల్లభాపురం నుంచి పెదపాలెం వరకు రోడ్డునిర్మాణం చేపడతాం. మీ-సేవ ఆపరేటర్ల సేవలను వినియోగించుకొని ఆ వ్యవస్థను బలోపేతం చేస్తాం. నిరుపేదలకు ఇళ్లు, ప్రభుత్వభూముల్లో నివసిస్తున్న వారికి పట్టాలు అందజేస్తాం. గ్రామంలో ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి జూనియర్ కాలేజి ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE