– బీబీపేట సభలో మంత్రి కేటీఆర్ వెల్లడి
విద్య, వైద్యానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర పురపాలక, ఐటి మంత్రి కల్వకుంట్ల తారక రామారావ్ అన్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో మంగళవారం ఆయన ఉన్నత పాఠశాల భవన సముదాయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. బీబీపేటకు చేరుకోగానే టీఆరెఎస్ నాయకులు, పూర్వవిద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు కేటీఆర్ కు ఘనస్వాగతం పలికారు. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, విప్ గంప గోవర్ధన్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ ఆధునిక సౌకర్యాలతో బీబీపేట లో పాఠశాల భవనాన్ని నిర్మించిన సుభాష్ రెడ్డిని మంత్రి అభినందించారు. సొంత నిధులతో తాను చదివిన పాఠశాల అభివృద్ధికి కృషి చేయడం ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో సుభాష్ రెడ్డి పాఠశాల భవనాన్ని నిర్మించారన్నారు. ఈ పాఠశాలను అప్ గ్రేడ్ చేసి జూనియర్ కళాశాలగా మారుస్తామని, ఆ సందర్బంగా సినీ హీరో మహేష్ బాబును తీసుకు వస్తానని కేటీఆర్ అన్నారు. ప్రతి ఒక్కరు పుట్టిన ఊరుకు సహాయం చేయాలని పిలుపు నిచ్చారు. ప్రపంచంలో పోటీ పడే విధంగా తెలంగాణ విద్యార్థులను తీర్చిదిద్దుతామన్నారు.
తమ పూర్వీకుల గ్రామమైన కోనాపూర్ లో ప్రాథమిక పాఠశాలను ప్రాథమికొన్నత పాఠశాలగా అప్ గ్రేడ్ చేయనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. దశాబ్దాల తరబడి పేరుకుపోయిన సమస్యలను గత ఏడున్నరేళ్లుగా పరిష్కరించుకుంటూ వస్తున్నామని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ పథకాలతో తెలంగాణ రాష్ట్రం ధాన్యం ఉత్పత్తి లో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. 24 గంటల కరెంట్, ఇంటింటికి తాగు నీరు అందించే పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు.
మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సహకారంతో పాఠశాల నిర్వహణకు కార్పస్ ఫండ్ జమ చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్బంగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కార్పస్ ఫండ్ కు తనవంతుగా 11 లక్షలు ప్రకటించగా విప్ గంప గోవర్దన్ 3 లక్షల రూపాయలు ప్రకటించారు. కోటి 20 లక్షల కార్పస్ ఫండ్ తో పాఠశాల నిర్వహణ చేపట్టాడాన్ని మంత్రి అభినందించారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా పరిషద్ ఛైర్ పర్సన్ శోభ, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, ఎమ్మెల్సీలు రఘూత్తంరెడ్డి, జనార్దనరెడ్డి, అదనపు కలెక్టర్లు వెంకటేష్ ధోత్రే, వెంకట మాధవరావు, ఎంపిపి బలమణి, జడ్పీ వైస్ ఛైర్మెన్ ప్రేంకుమార్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.