అది ఎమ్మెల్యేగానా?, ఎంపీ గానా అనేది పార్టీ నిర్ణయం
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా
నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి అయినా, అనంతపురం, శ్రీకాకుళం స్థానాల నుంచైనా పోటీ రెడీ
విజయనగరం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయమని దాదాపుగా అక్కడ ఉన్న వారంతా ఆహ్వానించారు
ప్రజా సంక్షేమాన్ని కోరుకునేవారు ఎవరైనా ఈ ప్రజా కంటకుడిని ఇంటికి పంపాల్సిందే
జగన్మోహన్ రెడ్డి చేసిన రుణానికి ఈ రాష్ట్రాన్ని బయటపడవేయడం ఎవరివల్ల కాదు …
కనుచూపుమేరలో ఈ రాష్ట్రానికి ఉన్న ఏకైక ఆశాదీపం నారా చంద్రబాబు నాయుడే
అనుభవం, కష్టపడే మనస్తత్వం, వయసును లెక్కచేయనితత్వం ఆయన సొంతం
ఈ రాష్ట్రం బాగుపడాలంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు తోనే సాధ్యమని టిడిపిలో చేరా
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
రానున్న ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని నరసాపురం ఎంపీ, తెదేపా నాయకుడు రఘు రామ కృష్ణంరాజు మరోసారి పునరుద్ఘాటించారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తానా?, ఎంపీగా పోటీ చేస్తానా?? అన్నది పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం పై ఆధారపడి ఉంటుందన్నారు. పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే, అక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు.
శనివారం సాయంత్రం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో ఇష్టా గోష్టిగా మాట్లాడారు. ప్రజా సంక్షేమాన్ని కోరుకునే ఎవరైనా, ప్రజా కంటకుడైన ఇటువంటి వారిని వదిలించుకో వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇవాళ అతను చేసిన రుణాల నుంచి ఈ ఈ రాష్ట్రాన్ని బయటపడవేయడం ఎవరి వల్ల సాధ్యం కాదన్నారు. ఎంతోకొంత కనుచూపుమేరలో ఈ రాష్ట్రానికి ఉన్న ఏకైక ఆశాదీపం నారా చంద్రబాబు నాయుడేనని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టే అనుభవం , కష్టపడే మనస్తత్వం, వయసును కూడా లెక్క చేయని తత్వం ఆయన సొంతమని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు .
ఈ రాష్ట్రం బాగుపడాలంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమని భావించి నేను తెలుగుదేశం పార్టీలో చేరానని స్పష్టం చేశారు. నర్సాపురం పార్లమెంటు పరిధిలోని ఉండి అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోందన్న ప్రశ్నకు రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ ఉండి సీటు ఇస్తున్నానని నాతో నారా చంద్రబాబు నాయుడు ఏమీ చెప్పలేదు. అలాగే ఉండి సీటు నీకు ఇవ్వడం లేదని కూడా రామరాజు తో ఆయన చెప్పలేదని నాకు తెలుసునన్నారు. నాకు తెలిసినంతవరకు ఉండి స్థానం నాదేనని సభకు వచ్చిన వారిని రామరాజు ఓదార్చారని పేర్కొన్నారు. సభకు జనాలను తీసుకువచ్చింది కూడా ఆయనేనన్నారు.
నరసాపురం పార్లమెంట్ ఇన్చార్జి బాధ్యతలను అప్పగించి, పార్లమెంట్ టికెట్ లేదంటే, లోక్ సభ సెగ్మెంట్ పరిధిలోని ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి మిమ్మల్ని పోటీ చేయమనే అవకాశాలు ఉన్నట్లుగా తెలిసిందని మీడియా ప్రతినిధి ఒకరు రఘురామ కృష్ణంరాజు దృష్టికి తీసుకురాగా, నేనైతే రానున్న ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తాననే అనుకుంటున్నాను. నేనేమీ షరతులను విధించి, తెలుగుదేశం పార్టీలో చేరలేదు. నేనంటూ పోటీలో లేకపోతే ప్రజలు అంగీకరిస్తారని అనుకోవడం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజాభిప్రాయం ప్రకారమే ముందుకు వెళ్లాలి. నాకు తెలిసినంతవరకు నేను చేయించిన సర్వేలతోపాటు, నిన్న నేను పార్టీలో చేరక ముందు కొన్ని సర్వేలను మీరు ( మీడియా ప్రతినిధులు) చూసే ఉంటారు. అన్ని సర్వేలలోనూ ఏముందో అందరికీ తెలిసిందే.
అయినా నేను ఇప్పుడు ఒక పార్టీలో చేరాను కాబట్టి, ఆ పార్టీ నిర్ణయం మేరకు నడుచుకోవాల్సిందేనన్నారు. తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు, రానున్న ఎన్నికల్లో కచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటాననే విశ్వాసం నాకు ఉందని చెప్పారు. నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచా లేకపోతే అనంతపురం, శ్రీకాకుళం నుంచా అన్నది పార్టీ నిర్ణయం అని తెలిపారు. అనంతపురం, శ్రీకాకుళం పేర్లను కేవలం ఆ మూల, ఈ మూలన ఉంటాయి కాబట్టి ప్రస్తావించానని ఇందులో విపరీత అర్ధాలు తీయొద్దన్నారు. నేనైతే కచ్చితంగా పోటీలో ఉంటానని, అందులో ఎటువంటి అనుమానం అక్కర్లేదని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు.
పార్టీ ఎక్కడ నుంచి ఆదేశిస్తే, అక్కడ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే గానా, ఎంపీ గానా అన్నది మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తారని తెలిపారు. లేకపోతే కాలక్షేపంగా మీరైనా డిసైడ్ చేయాలంటూ మీడియా ప్రతినిధులను ఉద్దేశించి హాస్య
మాడారు. నర్సాపురం పార్లమెంట్ స్థానం ఇన్చార్జిగా ఎన్నికల ప్రచారం వరకు మీకు బాధ్యతలను అప్పగించారని తెలిసిందంటూ ఒక మీడియా ప్రతినిధి చేసిన కామెంట్ పై రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ, నాకైతే అటువంటి సమాచారం ఏమీ లేదని, అయినా జూన్ 4 వ తేదీ వరకు నేనే ఎంపీ నని గుర్తు చేశారు.
విజయనగరం నుంచి పోటీ చేస్తే గెలుస్తారని మాజీ మంత్రి అశోక గజపతిరాజు ప్రతిపాదించినట్లుగా తెలిసిందన్న మరొక విలేఖరి ప్రశ్నపై ఆయన మాట్లాడుతూ.. పేర్లు చెప్పను కానీ అక్కడి వారందరూ నన్ను పోటీ చేయమని ఆహ్వానించారని తెలిపారు. విజయనగరం లోక్ సభ స్థానంతో పాటు, వైజాగ్ ఈస్ట్, ఉంగటూరు స్థానాలకు కూడా మీ పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది అన్న ప్రశ్నపై నాకైతే తెలియదు… పార్టీ నాయకత్వం ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఉండి అసెంబ్లీ స్థానం అభ్యర్థి గురించి ప్రకటించకపోవడం వల్ల కార్యకర్తలు గందరగోళం చేశారన్న ఒక విలేఖరి ప్రశ్నపై, ఎవరి పేరును ప్రకటించలేదని గందరగోళం చేశారని రఘురామ కృష్ణంరాజు ఎదురు ప్రశ్నించారు.
నేను పార్టీలో చేరింది నిన్న ( శుక్రవారం) రాత్రి 8:30 గంటలకని, అభ్యర్థి ఎంపికలో పార్టీకి కొన్ని పద్ధతులు ఉంటాయని గుర్తు చేశారు. ఐ వి ఆర్ ఎస్ విధానం ద్వారా కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకుంటారని చెప్పిన రఘురామకృష్ణంరాజు, గతంలో నా పేరుపై కూడా ఐ వి ఆర్ ఎస్ ద్వారా కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారని గుర్తు చేశారు. ఉండి టికెట్ మీకు ఖరారు చేస్తే పోటీ చేస్తారా? అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నపై, మూడు నిమిషాల క్రితమే పార్టీ నాయకత్వం ఎక్కడ నుంచి పోటీ చేయమని చెబితే అక్కడ నుంచి పోటీ చేస్తానని చెప్పానని… మళ్లీ మీరు అడిగిన ప్రశ్నకు వేరుగా సమాధానం చెప్పలేనన్నారు.