Suryaa.co.in

Andhra Pradesh

క్యాబినెట్, అసెంబ్లీలో చర్చించి, ‘అపవిత్రు’లపై చర్య!

– శ్రీవారి మహాప్రసాదం కల్తీ దుర్మార్గం
– వైసీపీ హయాంలోని ఆ ప్రసాదాన్నిఅయోధ్యకు పంపారు
• హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టం
• తప్పు చేసినవారిని జగన్ ఏ విధంగా సమర్థిస్తారు?
– చర్చి, మసీదులో ఇలా జరిగితే దేశం అల్లకల్లోలమయ్యేది
– ప్రపంచం అంతా మాట్లాడేది…. గ్లోబల్ న్యూస్ అయ్యేది…
• ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన అనంతరం మీడియాతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
• గుంటూరు జిల్లా నంబూరు శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో దీక్ష మాలధారణ

నంబూరు: తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారికి నైవేద్యంగా సమర్పించే మహాప్రసాదం లడ్డూను కల్తీ చేయడం దుర్మార్గమైన చర్య అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూకు వినియోగించిన నెయ్యిలో బీఫ్ ఫ్యాట్, పంది కొవ్వు, చేప నూనె, సోయా, సన్ ఫ్లవర్ లాంటి ఇతర నూనెలు ఉన్నట్టు ఎన్ఏడీబీ సీఏఎల్ఎఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. వైసీపీ పాలన కాలంలో ఇలాంటి నేతిని వినియోగించి తయారు చేసిన లక్ష లడ్డూలను శతాబ్దాలుగా పోరాటం చేసి సాధించుకున్న రామ జన్మభూమి మందిరానికి తిరుమల తిరుపతి దేవస్థానం పంపి చాలా పెద్ద తప్పు చేసిందని అన్నారు.

హిందువులు మహాప్రసాదంగా భావించే లడ్డూకు వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలపడం నీచమైన చర్య అని, ప్రతి హిందువు, ధర్మాన్ని పాటించే ప్రతీ వ్యక్తి దీన్ని ఖండించి పోరాడాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. దీనిపై కేబినెట్, అసెంబ్లీలో చర్చించి దోషులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగినట్టు నిర్థారణ అయిన నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు.

గుంటూరు జిల్లాలోని నంబూరులో ఉన్న శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం ఉదయం వెళ్ళి దీక్ష తీసుకున్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రమైన నేపథ్యంలో క్షమించమని వెంకటేశ్వర స్వామిని కోరుతూ ఆయన దీక్ష మాలధారణ తీసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఏమన్నారంటే… తిరుమలను హిందువులు పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు.

2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సంస్కరణల పేరుతో చాలా మార్పులు చేసింది. స్వామివారి పూజా విధానాలను మార్చేశారు. శ్రీవాణి ట్రస్టు పేరుతో రూ.10 వేలు వసూలు చేశారు. ఐదుగురు కుటుంబ సభ్యులు స్వామివారి దర్శనానికి వస్తే రూ.50వేలు వసూలు చేసి బిల్లు మాత్రం రూ. 500 చొప్పునే ఇచ్చారు. నాతోపాటు చాలా మంది రాజకీయ నాయకులు దీనిపై ప్రస్తావించాం. తప్పు జరుగుతుందని వేలెత్తి చూపినా వైసీపీ నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదు.

ఏ మతమైనా మనోభావాలు దెబ్బతినకూడదు

వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో చాలా అవకతవకలు జరిగాయి. ప్రసాదాల నాణ్యత తగ్గిపోయింది. శ్రీవారి లడ్డూను హిందువులు మహాప్రసాదంగా భావిస్తారు. ఆ మహా ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారు. అయితే, ఈ స్థాయిలో కల్తీ జరుగుతోందని ఊహించలేదు. దారుణం ఏమిటంటే శతాబ్దాలుగా పోరాటం చేసి సాధించుకున్న రామ జన్మభూమి మందిరానికి ఇదే నెయ్యితో చేసిన లక్ష లడ్డూలు పంపించారు. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో కూడా ప్రసాదాల నాణ్యతపై చర్చ జరుగుతోంది.

గత ప్రభుత్వ పాలన కాలంలో 219 ఆలయాలను అపవిత్రం చేశారు. రథాలు తగలబెట్టారు. రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహానికి శిరచ్ఛేదం చేస్తే ఆనాడు పోరాడాం. ఏ మతమైనా మనోభావాలు దెబ్బ తినకూడదు. రామతీర్థం ఘటనపై అందరూ బయటకు రావాలని కోరితే చిలకలూరిపేట నుంచి ముస్లిం సోదరులు బయటకు వచ్చి మద్దతు ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నామని వైసీపీ మాట్లాడుతోంది. రామతీర్థం దేవుడి విగ్రహం ధ్వంసం చేసినప్పుడే రోడ్డు మీదకు వచ్చేవాడిని. ఆ రోజు రాజకీయం చేయలేదు. అన్ని మతాలను సమానంగా చూస్తాను కనుకే సంయమనం పాటించాను. రామతీర్థం దోషులను పట్టుకొని శిక్షించాలని కోరితే పట్టుకోలేకపోయారు.

వైసీపీ తప్పులకు పుల్ స్టాప్ పెట్టాలి

దాడులు జరుగుతున్నప్పుడు చూస్తూ కూర్చుకోడం కూడా తప్పే. ధర్మాన్ని పాడు చేసే హక్కు ఎవరికీ లేదు. పగ, ప్రతీకారం తీర్చుకునే ప్రభుత్వం కాదు మాది. వైసీపీకి తప్పులు చేయడం అలవాటు అయింది. దీనికి పుల్‌స్టాప్ పెట్టాలి. నెయ్యి కల్తీపై గత టీటీడీ బోర్డు బాధ్యత వహించాలి. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఇతర పాలక వర్గంపై విచారణ జరగాలి, తప్పు ఎవరు చేశారో బయటకు తీయాలి.

మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు. అలాగే ఎవరైనా తప్పులు చేస్తే ఉపేక్షించే ప్రభుత్వం కూడా కాదు. టీటీడీ బోర్డు ఉన్నది ధర్మాన్ని పరిరక్షించడానికి మాత్రమే… దర్శనం టిక్కెట్లు మీ వారికి ఇచ్చుకోవడానికో, మీ ఇష్టానికి కాంట్రాక్టులు ఇవ్వడానికో కాదు. టీటీడీ బోర్డులో తప్పులు చేస్తూ, శ్రీవారిని అపవిత్రం చేస్తాం. మీరు మాట్లాడకూడదు అంటే కుదరదు. కచ్చితంగా కోపాలు వస్తాయి. మేము మాట్లాడతాం. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నిస్తాం, ఖండిస్తాం, చర్యలు తీసుకుంటాం.

జగన్ ఎలా సమర్థిస్తారు?

తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా జగన్ వారిని ఎలా సమర్థిస్తారు? కోట్ల మంది హిందువులు స్వీకరించే ప్రసాదాన్ని అపవిత్రం చేస్తారా? దోషులకు శిక్ష పడాల్సిందే. చర్చి, మసీదులో ఇలా జరిగితే దేశం అల్లకల్లోలం అయిపోయేది. ప్రపంచం అంతా మాట్లాడేది. గ్లోబల్ న్యూస్ అయ్యేది. అదే హిందువులకు జరిగితే మాట్లాడకూడదా..? సెక్యూలర్ వ్యవస్థకు విఘాతం కలుగుతుందా..? హిందువులకు మనోభావాలు ఉండవా..? ఏ మతంపై దాడి జరిగినా ఇలాగే స్పందిస్తాం.

గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని సూటిగా అడుగుతున్నాను. తిరుమలలో జరిగిన విధంగా ఒక చర్చికి అపవిత్రం జరిగితే ఊరుకుంటావా? ఒక మసీదుకు జరిగితే ఊరుకుంటావా? మరి తిరుమలలో అపవిత్రం జరిగితే ఎందుకు మాట్లాడకూడదు అంటున్నారు? మేము మాట్లాడతాం, మేము హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ మతం మీద దాడి జరిగినా మాట్లాడతాం, సనాతన ధర్మంపై దాడి జరిగినా మాట్లాడుతాను. తిరుమల ఘటనలో దోషులకు కఠిన శిక్ష పడాల్సిందే.

సీఎంకు విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేస్తున్నాను… గత ప్రభుత్వ హయంలో టీటీడీలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, అపచారాలపై విచారణ జరగాలి, దోషులను శిక్షించాలి. నిన్న మీడియా ప్రతినిధులు సీబీఐకి ఈ కేసు తీసుకువెళ్తారా అని అడిగారు, క్యాబినెట్ లో చర్చ జరిగే విధంగా చూసి, దీనిపై నిర్ణయం తీసుకోవలసిందిగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేము సహకరిస్తాం. తిరుమలలో జరిగిన ఘటన ఇంకెప్పుడు భవిష్యత్తులో జరగకుండా చూసేలా మా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

కల్తీ జరుగుతుంటే హిందూ అధికారులు ఎందుకు మాట్లాడలేదు?

తిరుమలలో ప్రతి రోజు దాదాపు 15వేల కిలోల నెయ్యి వినియోగిస్తారు. ఒక కిలో నెయ్యి తయారీకి దాదాపు రూ.వెయ్యి ఖర్చవుతుంది. అలాంటిది రూ.360కే వస్తుందని ఒక మధ్యవర్తి చెబితే క్వాలిటీ చెక్ చేయకుండా ఎలా తీసుకుంటారు.? స్వామివారి ప్రసాదంలో కల్తీ జరుగుతుంటే హిందూ అధికారులు, బోర్డు సభ్యులు ఎందుకు మాట్లాడలేదు. వైసీపీ అంటే భయమా? లేక సుబ్బారెడ్డి అంటే భయమా? ఉద్యోగులు మౌనంగా ఉండి మహా అపరాధం చేశారు. ఈ అపరాధంతో నాకు సంబంధం లేకపోయినా ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటున్నాను” అన్నారు.

పూర్ణకుంభంతో స్వాగతం

ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టేందుకు నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లకు పవన్ కల్యాణ్‌ పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పవన్ కల్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈ దీక్ష 11 రోజులపాటు కొనసాగనుంది. దీక్ష ముగిసిన అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు.

అంతకు ముందు పార్టీ నాయకులు పవన్ కల్యాణ్‌ కి పూల వర్షంతో స్వాగతం పలికారు. శాస్త్రీయ నృత్యరీతులతో పలికిన ఈ స్వాగతం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు పిడుగు హరిప్రసాద్, జనసేన నేతలు కల్యాణం శివ శ్రీనివాస్, అమ్మిశెట్టి వాసు, బండ్రెడ్డి రామకృష్ణ, తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE