-
‘కమలం’ గొంతులో జగన్ ‘ఆల్ఫా’ లడ్డు
-
బీజేపీ నేతలకు జగన్ చురకలు
-
బోర్డులో బీజేపీ సభ్యులు ఏం చేస్తున్నారని ప్రశ్నల వర్షం
-
జగన్ జమానాలో సభ్యులను సిఫార్సు చేసిన నాటి కేంద్రమంత్రులు
-
టీటీడీకి పేర్లు ఇవ్వాలని మంత్రుల చుట్టూ తిరిగిన విజయసాయిరెడ్డి
-
బోర్డులో అమిత్‌షా, నిర్మల, పియూష్, ధర్మేంద్రప్రధాన్ సిఫార్సులు
-
దానినే ఇప్పుడు బీజేపీపై ప్రయోగించి ఇరికించిన జగన్
-
బీజేపీ వాళ్లకు సగమే తెలుసంటూ వ్యంగ్యాస్త్రాలు
-
అయినా జగన్‌పై కనిపించని బీజేపీ ఎదురుదాడి
-
సత్యకుమార్, శ్రీనివాసవర్మ, పురందేశ్వరి మాట్లాడరేం?
-
బాబు మాటలు నమ్మనన్న ఐవైఆర్
-
ఐవైఆర్ వ్యాఖ్యలు వ్యక్తిగతమా? పార్టీవా?
-
జగన్ వ్యాఖ్యలపై నోరెత్తని బీజేపీ అగ్రనేతలు
-
వీహెచ్‌పీ నేత నందిరెడ్డి వ్యాఖ్యలను బీజేపీ సమర్థిస్తుందా?
-
లడ్డుపై కోర్‌కమిటీ, రాష్ట్ర అత్యవసర కార్యవర్గ సమావేశమేదీ?
-
నేతల మౌనంపై భగ్గుమంటున్న బీజేపీ శ్రేణులు
( మార్తి సుబ్రహ్మణ్యం)
జగన్‌కు రాజకీయాలు తెలియవు.. జగన్ మూర్ఖుడు.. జగన్ పక్కా వ్యాపారస్తుడు. ఇవీ వైసీపీ సహా, చాలామందికి మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ గురించి నాటుకుపోయిన బలమైన అభిప్రాయాలు. కానీ అలా తనను అనుకునేవారి అమాయకత్వం చూసి జాలిపడుతూ.. జగన్ చేసిన తాజా వ్యాఖ్యలు బీజేపీ గొంతులో, తిరుమల ‘ఆల్ఫా’ లడ్డులా అడ్డం పడింది. అంటే జగన్ బీజేపీని.. దాని అవకాశవాదంపై అంత గురిచూసి కొట్టారన్నమాట.
జగన్ జమానాలో కేంద్రం ఆయనతో.. జగన్ కేంద్రంతో అంటకాగారన్నది, మనం మనుషులం అన్నంత నిజం. అదో బహిరంగ రహస్యం కూడా. రాష్ట్రంలోని కొందరు అగ్రనేతలు సైతం, జగన్ భజన చేసి టీడీపీ ‘చంద్ర’నిప్పులు కురిపించారు. సరే దానికి తగిన ప్రతిఫలం, పారితోషికం, ఇసుక రీచ్, క్వారీలు దక్కాయనుకోండి. కానీ జగన్ సర్కారు అవినీతిపై యుద్ధం చేసిన అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాస్ లీడర్‌గా పేరున్న కన్నా లక్ష్మీనారాయణను బలిపశువును చేసిందనుకోండి. అది వేరే కథ.
అసలు పీఎంఓ, కేంద్రమంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్, పియూష్‌గోయల్, ధర్మేంద్రప్రధాన్.. అంటే మోదీ కోటరీ వద్ద.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, నాటి ఎంపి బాలశౌరి, మిధున్‌రెడ్డి నిరంతరం దర్శనమిచ్చేవారు. అంతేకాదు.. జగన న్న నుంచి- విజయసాయి వరకూ, టీటీడీలో మెంబర్ల పేర్లు ఇవ్వాలంటూ కేంద్రమంత్రులకు బంపర్ ఆఫర్లు ఇచ్చారన్నది బహిరంగ రహస్యం.
ఆ ప్రకారంగా కేంద్రమంత్రులు సూచించిన సంపత్ రవినారాయణ, అనంత, నారాయణ స్వామి శ్రీనివాసన్, కృష్ణమూర్తి వైద్యనాధన్‌ను.. జగన్ మహదానందంతో టీటీడీ బోర్డు మెంబర్లుగా నియమించింది. నాటి సీఎం కేసీఆర్-కేటీఆర్-కవిత సిఫార్సుతో రామేశ్వర్‌రావు, మరికొందరు తెలంగాణ పారిశ్రామికవేత్తలనూ నియమించింది. వీరిని టీటీడీ బోర్డు పర్చేంజింగ్-ఫైనాన్స్ కమిటీలో సభ్యులుగా చేర్చింది.
అందులో ఇప్పటి సమాచారశాఖ మంత్రి కొలుసు పార్ధసారథి, కొవ్వూరు టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అప్పట్లో పర్చేజింగ్ కమిటీలో ఉన్నారు. వీరి హయాంలో ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు? నెయ్యి టెండర్ల ఖరారులో వీరి పాత్ర ఎంత? అసలు పరాయి రాష్ట్రాల్లో నిర్మించిన టీటీడీ దే వాలయాలకు, స్థానికులను చైర్మన్లుగా నియమించకుండా ఏపీలో ఉండేవారికి ఎలా ఇచ్చారు? బోర్డు సమావేశాల్లో కూర్చునే అర్హత లేని వారిని ఏవిధంగా బోర్డు మీటింగుల్లో కూర్చోబెట్టారు? అసలు టీటీడీ చట్టం ఏం చెబుతోందనే ఆసక్తికర అంశాలను తర్వాత చర్చిద్దాం.
ఇప్పుడు మళ్లీ జగన్ జమానా దగ్గరకు వస్తే.. నాడు కేంద్రపెద్దలు చెప్పిన వారికి టీటీడీ బోర్డు, టీటీడీ లోకల్ బోర్డు పదవులు ‘పువ్వు’లో పెట్టి అప్పగించిన జగన్.. ఇప్పుడు సరిగ్గా తాను చిక్కుల్లో పడిన వేళ, ఆ అస్త్రం ప్రయోగించి, పువ్వును నవ్వులపాలు చేయటం చర్చనీయాంశంగా మారింది. అంటే అప్పుడు తానే బీజేపీకి పదవులు ఎర వేసి, ఇప్పుడు ఆ అస్త్రాన్నే వారిపై సంధించారన్నమాట. మరి జగన్ తెలివిలేనివాడు, వ్యూహం లేని వాడు ఎలా అవుతారు? నిజంగా జగన్ జీనియస్.
ప్రపంచంలోని కోట్లాది హిందువులు… భక్తితో ఆరగించే తిరుమల శ్రీవారి లడ్డులో, జంతుమాంస కళేబరాలున్న నెయ్యి వాడుతున్నారని, అందుకు యుపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సన్నిహిత ఆల్ఫా కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారన్న వివాదం, హిందూ సమాజంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్ ఏలుబడిలోని టీటీడీ బోర్డును ఉద్ధరించిన రెడ్లు.. ఈ కంపెనీకి పెద్దపీట వేశారన్నది దాని సారాంశం.
టీటీడీకి ఆల్ఫా కంపెనీ సరఫరా చేసే నెయ్యిలో గొడ్డు-పంది కళేబరాల ఆవాళ్లున్నాయని, గుజరాత్‌లోని ఓ సంస్థ వెల్లడించింది. దీనిని స్వయంగా సీఎం చంద్రబాబునాయుడు బాధాతప్త హృదయంతో వెల్లడించారు. ఆ తర్వాత టీటీడీ ఈఓ శ్యామలరావు దానిని ధృవీకరించారు. అదే శ్యామలరావు.. అదే ఆల్ఫా కంపెనీకి రివర్స్ టెండరులో 65 శాతం, నందినీ కంపెనీకి 35 శాతం నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారన్నది ఒక ఆరోపణ. దీనితో హిందూలోకం భగ్గుమంది. దేశ, విదేశాల్లో హిందువులు ఒక్కతాటిపైకి వచ్చి, జగన్ దిష్టిబొమ్మలు దహ నం చేస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో తెరపైకి వచ్చిన జగన్.. తన నిర్దోషిత్వం నిరూపించుకునేందుకు, బీజేపీ భుజంపై తుపాకి పెట్టి, చంద్రబాబును పేల్చేందుకు చేసిన ప్రయత్నం జగన్ ధైర్యాన్ని నోరెళ్లబెట్టేలా చేసింది.
‘‘బీజేపీకి సగం తెలుసు. సగం తెలియదు. చంద్రబాబు పూర్తిగా అబద్ధాల మనిషి. టీటీడీ బోర్డులో కూడా ఇదే బీజేపీ సీనియర్ మంత్రుల ప్రతినిధులు, సభ్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రక్రియ గురించి వారికి తెలియదా? తెలియకపోతే తెలుసుకోమని చెప్పండి. తప్పు చంద్రబాబు చేసి, దుష్ప్రచారం చేశాడని తేలితే ఆయనమీద అక్షింతలు వేసే ధైర్యం ఈ బీజేపీకి ఉందా అని నేనడుగుతున్నా. ఇదే చంద్రబాబు హయాంలో.. 2015 నుంచి 2018 అక్టోబర్ వరకూ కేఎంఎఫ్ బ్రాండ్ ఎందుకు లేదని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారు’’అంటూ సంధించిన ప్రశ్నలకు ఇప్పటివరకూ ఏపీ బీజేపీ నుంచి జవాబు లేకపోవడమే వింత.
మిగిలిన నాయకులకు పక్కనపెడితే… కూటమిలో మంత్రిగా ఉన్న సత్యకుమార్‌యాదవ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, బీజేఎల్పీ నేత విష్ణుకుమార్‌రాజు, మీడియా ఇన్చార్జి పాతూరి నాగభూషణం ఇప్పటివరకూ జగన్ సంధించిన ప్రశ్నలకు, సమాధానం చెప్పకపోవడమే ఆశ్చర్యం. పోనీ.. బీజేపీ ఎంపీ సీఎం రమేష్, జాతీయ కమిటీలో ప్రాతినిధ్యం వహిస్తున్న సోము వీర్రాజు లాంటి నేతలు గానీ.. జగన్ చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వలేదు. అసలు ఈ అంశంలో ఏపీ బీజేపీ ఇన్చార్జి ఇప్పటివరకూ పత్తా లేరు.
పైగా కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ నాయకుడు, మాజీ ఐఏఎస్ ఐవైఆర్ కృష్ణారావు.. సీఎం చంద్రబాబు నాయుడు లడ్డూలపై చేసిన అరోపణలను తాను నమ్మడం లేదని నిర్మొహమాటంగా చెప్పారు. ఒకవేళ బాబు ఆరోపణలు నిజం కాకపోతే, ప్రజలకు ఆయనమ క్షమాపణ చెప్పాలంటూ చేసిన ప్రకటన, కూటమిలో కొత్త చిచ్చు రాజేసింది. ఓవైపు కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీకి చెందిన నాయకుడే, బాబు వ్యాఖ్యలను ఖండించమంటే, అది తేలిగ్గా తీసుకోదగ్గ వ్యవహారం కాదు. మరి ఇది పార్టీ అభిప్రాయమా? ఆయన సొంత అభిప్రాయమా తేలాల్సి ఉంది.
ఇక బీజేపీ అనుబంధ వీహెచ్‌పీకి చెందిన… దక్షిణాంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి కూడా, చంద్రబాబు వ్యాఖ్యలు ఖండించటం విశేషం. ‘లడ్డు ప్రసాద ంపై బాబు చేసిన ఆరోపణలకు ఆధారం చూపాలి. లడ్డు విషయంలో లేనిపోని అపోహలు సీఎం స్థాయి వ్యక్తి సృష్టించడం తగదు. నిజనిర్దారణ జరగకుండా సీఎం స్థాయి వ్యక్తి లడ్డులపై మాట్లాడటం సరైంది కాదు. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాల’ని డిమాండ్ చేశారు. అంటే బీజేపీ కూటమి ధర్మాన్ని పాటిస్తుందా? లేదా? అన్నదే సందేహం.
అంతేతప్ప.. జగన్ వ్యాఖ్యలు అవాస్తవాలని, ఆయన హయాంలోనే నెయ్యిలో కల్లీ జరిగిందని, హలాల్ సర్టిఫెట్ ఉన్న ఆల్ఫా కంపెనీకి నెయ్యి టెండరు ఎలా ఇస్తారని ప్రశ్నించిన ఒక్క బీజేపీ నాయకుడు లేకపోవడమే ఆశ్చర్యం. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే బీజేపీ సీనియర్ నేత విష్ణువర్దన్‌రెడ్డి గానీ, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆయన అనుచరుడైన బీజేపీ ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణరాజు, దయాకర్‌రెడ్డి గానీ.. ఎవరూ జగన్ వ్యాఖ్యలను ఖండించకపోవడం ఆశ్చర్యం. చివరాఖరకు పార్టీకి దిశానిర్దేశం చేసే రాష్ట్ర సంఘటనా మంత్రి మధుకర్‌రెడ్డి సైతం.. ఈ వ్యవహారంలో ఎలా వ్యవహరించాలన్న అంశంపై సూచనలివ్వకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. అంటే జగన్ వ్యాఖ్యలను ఏపీ బీజేపీ నాయకత్వం సమర్థిస్తుందన్నమాట! అంతేగా.. అంతేగా!!
అసలు ఇంత పెద్ద వివాదాస్పద అంశం చర్చకు వచ్చిన నేపథ్యంలో.. కనీసం కోర్ కమిటీని గానీ, రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశం గానీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి రాకపోవడంపై, పార్టీ నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘నిజానికి ఈ అంశాన్ని మేమే టేకప్ చేసి, హిందువులను ఏక ం చేయాలి. అది ఎలా ఉండాలన్న దానిపై కోర్‌కమిటీ మీటింగు, లేకపోతే రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశమో పెట్టి యాక్షన్‌ప్లాన్ ఖరారు చేయాలి. అందులో జగన్ ఆరోపణలకు సమాధానం చెప్పాలి. అవేమీ లేవు. అంటే జగన్ ఆరోపణలు నిజమేనని మా నాయకత్వమే ధృవీకరించిందన్నమాట’ అని ఓ రాష్ట్ర నాయకుడు వ్యాఖ్యానించారు.
నిజానికి జగన్ ప్రశ్నలకు బీజేపీ నుంచి జవాబు లేదు. రాదు కూడా! కారణం అప్పటి టీటీడీ పాలకమండలిలో, ఏడె నిమిదిమంది సభ్యులు కేంద్రమంత్రులు సిఫార్సు చేసిన వారే ఉండటం! ఇక్కడ జగన్ లాజికల్‌గానే మాట్లాడారు. నిజంగా తమ హయాంలో లడ్లలో అలాంటి జంతుక ళేబరాలు కలిపి ఉంటే.. కేంద్రమంత్రుల ప్రతినిధులు ఎందుకు ప్రశ్నించలేదు? కనీసం పర్చేజింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్న కేంద్రమంత్రుల ప్రతినిధులు, నెయ్యిలో దారుణాలు జరుగుతున్నాయని భావిస్తే, డిసెంట్ నోట్ అయినా రాయాలి కదా? అలా రాయలేదంటే.. నాటి దారుణాలకు కేంద్రమంత్రుల ప్రతినిధుల అంగీకారం ఉన్నట్లే కదా? అన్నది జగన్ పరోక్షంగా సంధించిన ప్రశ్న.
ఇప్పుడు జగన్ బీజేపీపై సంధించిన ప్రశ్నలతో.. ఆల్ఫాకు టెండరు ఖరారు చేసిన వ్యవహారంలో.. బీజేపీ కూడా ఉందన్న విషయం స్పష్టమయింది. ఆ వాస్తవాన్ని జగన్ నేరుగా చెప్పకుండా, చాలా తెలివిగా-వ్యూహాత్మకంగా బీజేపీని ఇరికించారని, మెడ మీద తల ఉన్న అందరికీ అర్ధమవుతుంది.
అంటే.. తమ హయాంలో నెయ్యి కల్తీ అయి, అందులో జంతుకళే బరాల ఆనవాళ్లు ఉండి ఉంటే.. అందుకు వైసీపీతో పాటు, కేంద్రంలోని బీజేపీ మంత్రులు సిఫార్సు చేసిన టీటీడీ బోర్డు సభ్యులు కూడా బాధ్యులేనని.. వైసీపీ అధినేత జగన్ సూటిగా, సుత్తిలేకుండా హిందూ సమాజానికి సంతేకాలిచ్చారు. మరిప్పుడు బీజేపీ ఏం చెబుతుంది? మంత్రి సత్యకుమార్, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ ఏం చెబుతారు? ఇదీ.. ఇప్పుడు బీజేపీలో హాట్‌టాపిక్.
అన్నట్లు.. జగన్న కేంద్రమంత్రుల సిఫార్సుల మేరకు ఇచ్చిన టీటీడీ మెంబర్లలో కొందరు.. అంతకుముందు టీడీపీ-బీజేపీ సంకీర్ణ సర్కారులోనూ, కొండపై దర్పం వెలగబెట్టడాన్ని విస్మరించకూడదు. కర్నాటక-తమిళనాడుకు చెందిన వారంతా బీజేపీ కేంద్రమంత్రుల సిఫార్సులతో ‘కొండ’పైకెక్కినా వారే.
ఆ జేఈఓ రూటే వేరప్పా
– బెంగళూరులో గానా బజానా
– ఆ ఫాంహౌస్‌లో ఒక ఫ్లోరంతా ఆయనకే ప్రత్యేకం
– సారొస్తే ఎవరినీ ఆ ఫ్లోర్‌కు రానీయరు
– కర్నాటక మాజీ సీఎం జల్సాలకూ అదే అడ్డా
– ప్రతి ఆదివారం సింగపూర్, ధాయ్‌లాండ్‌లో జల్సాలు
– ఎవరా జల్సా రాజు. ఏమా కథ?
.. త్వరలో