Suryaa.co.in

Political News

జగన్ అసెంబ్లీకి వస్తారా?

-జగన్ అసెంబ్లీకి వస్తే అద్భుతమే
-అసెంబ్లీకి, జనంలోకి రావాలి జగన్.. కావాలి జగన్

అధికారం అనుభవించక ముందు ప్రతిపక్షంలో ఉండటం వేరు. అధికారం అనుభవించాక ప్రతిపక్షంలో ఉండటం వేరు. ఇందిర- ఎన్టీఆర్ -జగన్ నియంతృత్వ నేతలకు పరాకాష్టగా నిలిచిన నేతలు. రాజకీయంలో గెలుపు ఓటములు సహజమైనా, ఇటువంటి మనస్తత్వం కలవారు ఒకసారి గెలిచిన తర్వాత ఓటమి జీర్ణించకోవడం కష్టం.

ఇందిర -ఎన్టీఆర్- జగన్ అధికారంలో ఉన్నపుడు ఎవరి మాటా వినలేదు. ఎవరినీ ఏమాత్రం లెక్క చేయలేదు. న్యాయస్థానాలు తీర్పులను కూడా ఈ ముగ్గురూ తమకు అతీతం అనే భావనలో ఉండేవారు. అదృష్టవశాత్తూ 1977 లో ఎమర్జెన్సీ తర్వాత పార్టీ తో పాటు తానూ ఓడింది ఇందిరా గాంధీ. ప్రతిపక్షం లో కూర్చునే అవకాశం లేదు. ఆ తర్వాత కర్ణాటకలో గెలిచినా వెంటనే మళ్ళీ ఎన్నికలు ఇందిరా మళ్ళీ ప్రధాని. ఆపై హత్య.

ఇక ఎన్టీఆర్ 1989 ఓటమి తర్వాత ఎక్కువ కాలం ప్రతిపక్షంలో ఉండలేక, సవాల్ విసిరి అసెంబ్లీ బహిష్కరణ చేశారు. ఇక జగన్ సంగతి చెప్పనక్కరలేదు. ప్రతిపక్షంలో ఉన్న నాయకులను కనీసం మనిషిగా కూడా గుర్తించలేదు. ప్రధాన ప్రతిపక్ష నేత అయిన బాబుని, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా, లెక్క లేకుండా వ్యవహరించారు. లోకేష్, పవన్ అనే పేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడలేదు. తను శాశ్వత ముఖ్యమంత్రి అని, తనను తాను దైవంశ సంభూతుడు అనే భావనలో ఎక్కువగా ఉండేవారు. బహిరంగ సభల్లో అసెంబ్లీలో తన హావభావాలు సాక్ష్యం.

తానొకటి తెలిస్తే దైవం మరొకటి తలచింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని ఘోర పరాభవం జగన్ సొంతం అయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 1994లో కాంగ్రెస్‌కి 26 సీట్లు 8% సీట్లు, అంతకన్నా తక్కువగా ఇప్పుడు వైకాపా(జగన్)కి 11 సీట్లు 6% సీట్లు. కనీసం 10% సీట్లు ఉంటేనే ప్రధాన ప్రతిపక్ష నేతగా కేబినెట్ హోదా ఉంటుంది.

స్పీకర్‌కి కుడివైపు అధికార పార్టీ & ఎడమవైపు ప్రతిపక్ష పార్టీలు ఉండటం సంప్రదాయం. అసెంబ్లీలో మాజీ సీఎం అని ప్రత్యేక కేటాయింపులు ఏవి ఉండవు. ఇప్పుడు జగన్ కి ఎక్కడో వెనకాల ఒకచోట సీటు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. జనం తరపున మాట్లాడటానికి రెండు మూడు నిమిషాలు కూడా దక్కదు. అధికారంలో ఉన్నప్పుడు దాదాపు ప్రతి ఎమ్మెల్యేను, మంత్రిని అవహేళన చేశారు. చేయించారు‌‌. ఇప్పుడు ఇవన్నీ తిరగబడతాయి. మాటల తూటాలు పేలతాయి.

గతంలో బాబు నేతృత్వంలో టిడిపికి ఘోర పరాజయం దక్కినపుడు, బాబు అసెంబ్లీకి వస్తారా రారా అనే చర్చ జరిగినా అసెంబ్లీకి వచ్చారు. బాబు సంగతి భిన్నం. ఎంత కాలం అధికారంలో ఉన్నారో, అంతకాలం ప్రతిపక్షంలో కూడా ఉన్నారు. ప్రజాపక్షం ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేశారు.

జగన్ హయాంలో టిడిపి సభ్యులను మొత్తం సస్పెండ్ చేసినా, బాబు ఒక్కరే నిలబడి ప్రజల పక్షం ఉంటూ గళం వినిపించే ప్రయత్నం చేశారు ఎన్నెన్నో అవమానాలు, అవహేళనలు చేసినా భరించారు నిలబడ్డారు. మరీ దిగజారి తన భార్యపై అవమానం చేసేసరికి, చివరి ఏడాదిలో మాత్రమే అసెంబ్లీని బహిష్కరించి సవాల్ విసిరి బయటకు వచ్చారు.

ఇప్పుడు జగన్ అసెంబ్లీలోకి అడుగుపెడితే, అధికార పార్టీ నేతలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. పేరు పలకడానికి కూడా ఇష్టపడని పవన్- లోకేష్- RRR జస్ట్ ఎదురుగా నిలబడితే చాలు. తను మాట్లాడిన మాటలు, చేసిన చేయించిన అవహేళనలు ఇవన్నీ జగన్ కళ్ళ ముందు కలియ తిరుగుతాయి. ఇవన్నీ తట్టుకునే మనస్తత్వం జగన్‌కి ఉందా అంటే ..? జనంలోకి వస్తే జనం నుంచి నిరసనలు ఉంటాయి అని, అవి భరించలేని మనస్తత్వం తో పరదాలు కట్టించుకుని తిరగడం. జనంలోకి వెళ్ళాల్సిన పరిస్థితిలో పెయిడ్ ఆర్టిస్టులతో సెట్టింగులు. సభలకు మాత్రమే వచ్చి తన మాట తాను చెప్పి వెళ్ళడం.‌ ఇదీ అధికారం లో ఉన్నప్పుడు జగన్ తీరు.

ఇలాంటి జగన్ మళ్లీ అసెంబ్లీకి రావడం జనంలోకి వెళ్ళడం అంటే నిజంగా ఒక అద్భుతం. ఈ అద్భుతం చూడాలని వుంది. అసెంబ్లీకి జనంలోకి రావాలి జగన్. కావాలి జగన్.

– పీపీఎన్

LEAVE A RESPONSE