-
మంత్రి సురేఖపై వందకోట్లకు పరువునష్టం దావా వేసిన నాగార్జున
-
నాగార్జున, సాక్షుల వాంగ్మూలం నమోదు
-
కొండాకు నాంపల్లి కోర్టు నోటీసులు
-
ఇది నిలిచే కేసు కాదంటున్న న్యాయనిపుణులు
-
సమంతను కేటీఆర్ తన వద్దకు పంపించమన్నారన్న సురేఖ
-
ఎందుకు పంపించమన్నారో వెల్లడించని మంత్రి కొండా
-
ఇందులో భావ వ్యక్తీకరణ విశ్లేషణ కూడా ఉంటుందన్న లాయర్లు
-
కోర్టు పరిభాషలో సాక్ష్యాలు సేకరించడం కష్టమేనంటున్న న్యాయనిపుణులు
-
90 శాతం పరువునష్టం వీగిపోయాయని గుర్తు చేస్తున్న లాయరు
-
తన వ్యాఖ్యలు ఉపసహరించుకున్నట్లు ప్రకటించిన సురేఖ
-
తనను ట్రోల్ చేసిన కేటీఆర్ తప్ప, నాగార్జున తన లక్ష్యం కాదని స్పష్టీకరణ
-
వ్యాఖ్యల ఉపసంహరణ తర్వాత కేసు తీవ్రత తగ్గుతుందంటున్న న్యాయనిపుణులు
-
సురేఖ వ్యాఖ్యలో దురుద్దేశం నిరూపించడం కష్టమేనంటున్న న్యాయవాదులు
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణ మంత్రి, ఫైర్‌బ్రాండ్ కొండా సురేఖ.. హీరో నాగార్జునపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం దావా కేసుపై, న్యాయ-రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. కొండా సురేఖ వ్యాఖ్యల వల్ల తన పరువుకు నష్టం జరిగింది కాబట్టి, ఆమెపై 100 కోట్ల రూపాయలు దావా వేసిన విషయం తెలిసిందే.
దానికి సంబంధించి నాంపల్లి కోర్టు, ఆయన వద్ద నుంచి వాంగ్మూలం నమోదుచేసింది. అటు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆమెపై క్రిమినల్ కేసు వేశారు. వీటికి సంబంధించి కోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది.
ఈ పరిణామాలతో అసలు ఈ కేసులో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ సినిమా-న్యాయ-రాజకీయవర్గాల్లో కనిపిస్తోంది. దీనికి సంబంధించి న్యాయనిపుణులు చేస్తున్న వ్యాఖ్యలు పరిశీలిస్తే.. నాగార్జున వేసిన పరువునష్టం దావా నిలబడేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరువునష్టం కేసులకు సంబంధించి క్రిమినల్-సివిల్ కేసులుగా వేస్తుంటారు. ఇప్పుడు ఇందులో మంత్రి సురేఖపై నాగార్జున వంద కోట్లకు సివిల్ కేసు వేయగా, కేటీఆర్ క్రిమినల్ కేసు వేశారు.
ఇక నాగార్జున.. మంత్రిపై వేసిన పరువునష్టం కేసుపై, న్యాయనిపుణులు ఏమంటున్నారో చూద్దాం. దానికంటే ముందు అసలు మంత్రి కొండా సురేఖ ఆరోజు మీడియాతో ఏం మాట్లాడారంటే.. ‘‘ సమంతను తన వద్దకు పంపించకపోతే ఎన్ కన్వెన్షన్ కూల్చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. దానితో నాగార్జున-నాగచైతన్య ఇద్దరూ
సమంతను, కేటీఆర్ వద్దకు వెళ్లకపోతే మా ఇంట్లో ఉండవద్దని చెప్పారు. దానికి సమంత అంగీకరించలేదు. వారి విడాకులకు అదే కారణం’’- ఇదీ.. మంత్రి కొండా సురేఖ మీడియా వద్ద చేసిన వ్యాఖ్యలు. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగానే నాగార్జున, మంత్రి సురేఖపై వందకోట్లకు పరువునష్టం దావా వేశారు.
సురేఖ వ్యాఖ్యలను న్యాయపరంగా విశ్లేషిస్తున్న న్యాయనిపుణులు.. ఆమె వ్యాఖ్యలు పరువునష్టం కిందకు వస్తాయా? రావా? అన్న అంశంపై ఆసక్తికరమైన వివరణ ఇస్తున్నారు. ‘ చానెళ్లు, పత్రికల్లో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే, ఆమె సమంతను కేటీఆర్ దగ్గరకు పంపించమని మాత్రమే చెప్పినట్లు స్పష్టంగా అర్ధమవుతుంది. అయితే ఆమెను ఎందుకు పంపించమన్నది మంత్రి చెప్పలేదు. దీనిని ఎవరిష్టం వచ్చినట్లు వారు భావించుకోవచ్చు. అన్వయించుకోవచ్చు. ఒకరకంగా ఇది భావవ్యక్తీరణ అంశానికి సంబంధించిన అంశం కూడా. ఆమె భావాన్ని కోర్టు ఎలా అర్ధం చేసుకుంటుంది అన్నదానికంటే.. పిటిషనర్ దానికి సంబంధించి సురేఖకు వ్యతిరేకంగా సాక్షాలు, ఆధారాలు కోర్టుకు సమర్పించటమే కష్టం’’ అని, గుంటూరుకు చెందిన ఏపీ హైకోర్టు న్యాయవాది కొత్త రామ్మోహన్‌రావు వ్యాఖ్యానించారు.
‘‘ఆమెను కేటీఆర్ వద్దకు ఎందుకు పంపించమన్నారన్నది మంత్రి చెప్పలేదు. ఆమె ఏ కోణంలో ఆ వ్యాఖ్య చేశారో, ఆ మేరకు తనకు ఎలా పరువునష్టం జరిగిందో నిరూపించుకోవలసిన బాధ్యత పిటిషనరయిన నాగార్జునపైనే ఉంటుంది అని వాదనల్లో తేలుతుంది. ఏ ఉద్దేశంతో ఆమె ఆ వ్యాఖ్యలు చేశారో, దానికి సంబంధించిన ఆధారాలు కూడా నాగార్జున సమర్పించాల్సి ఉంటుంది. అందులో పరువునష్టం జరిగిందన్న ఆధారం కచ్చితంగా ఉంటేనే, పిటిషనర్ వాదనకు ఉపయోగం ఉంటుంది అని రామ్మోహన్ వివరించారు.
సామాన్య భాష- వాడుక వ్యవహారాలకు, కోర్టు పరిభాషకు తేడా ఉంటుంది. కోర్టుకు కావలసింది సాక్ష్యాలు, ఆధారాలు మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. లీగల్ కోణంలో చెప్పాలంటే.. కొండా సురేఖ ఆ వ్యాఖ్యను సమర్ధించుకునే అవకాశం కూడా లేకపోలేదు. కేటీఆర్ వద్దకు సమంతను పంపించాలన్నది, సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం చర్చించేందుకని సురేఖ న్యాయవాది వాదించవచ్చు.
ఎందుకంటే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సమంత చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినందువల్ల, తెలంగాణ చేనేతకు మార్కెటింగ్ కోసం చర్చించేందుకే.. తన వద్దకు పంపమన్నారన్న భావనతోనే తాను ఆ వ్యాఖ్య చేశానే తప్ప, అందులో తనకు ఎలాంటి దురుద్దేశం లేదని సురేఖకు వాదించుకునే హక్కు ఉందని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు.
‘‘ అయినా మంత్రి సురేఖ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు కాబట్టి, ఈ కేసులో అంత తీవ్రత ఉండదు. తన మెడలో ఎంపి రఘునందన్‌రావు చేనేత దండ వేసిన వైనాన్ని ట్రోల్ చేసిన కేటీఆర్ తప్ప, నాగార్జున తన లక్ష్యం కానేకాదని సురేఖ తన ప్రకటనలో స్పష్టం చేశారని మర్చిపోకూడదు. అయితే సురేఖ వ్యాఖ్యలు సమాజం ఏవిధంగా అర్ధం చేసుకుందన్న అంశంతో కోర్టుకు సంబంధం లేదు. ఇందులో భావ ప్రకటనా స్వేచ్ఛ అంశం కూడా ఇమిడి ఉండటాన్ని విస్మరించకూడద’’ని న్యాయవాది రామ్మోహన్ గుర్తు చేశారు.
కాగా మంత్రి సురేఖ దురుద్దేశంతోనే అలాంటి వ్యాఖ్యలు చేశారని, పిటిషనర్ నాగార్జున కోర్టుకు నిరూపించడం కష్టమని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఆ మేరకు మంత్రి వ్యాఖ్యల్లో దురుద్దేశం ఉన్నట్లు సరైన ఆధారాలుంటే తప్ప, సురేఖకు శిక్ష పడటం కష్టమంటున్నారు. ఈ కేసులో మీడియాలో వచ్చిన వ్యాఖ్యలే సాక్ష్యం తప్ప, పిటిషన ర్ దగ్గర పరువుపోయినట్లు మరో సాక్ష్యం లేనట్లుందని, అది ఉంటేనే కేసు బలంగా బిగిసుకుంటుందని స్పష్టం చేశారు.
‘ ఈ కేసు పరువునష్టం దాకా వెళ్లడానికి కారణం సురేఖ చేసిన ఆ వ్యాఖ్య ఒక్కటేనని అర్ధమవుతుంది. అందులో కేటీఆర్ వద్దకు సమంతను ఎందుకు పంపించమన్నారన్నదానిపై ఎక్కడా స్పష్టత లేదు. అందులో దుర్భాషగానీ, అశ్లీలం గానీ, అనాగరికం కానీ లేదు. అందులో దాగున్న దురుద్దేశాన్ని పిటిషనర్ ఏవిధంగా అర్ధం చేసుకున్నప్పటికీ, పిటిషనర్ భావనతో కోర్టుకు సంబంధం లేదు. కోర్టు కేవలం పిటిషనర్ పరువు ఎందుకు పోయింది? ఆ మేరకు పిటిషనర్ సమర్పించిన ఆధారాల్లో బలం ఉందా? దానిలో మంత్రి నుంచి వందకోట్లు పరిహారం ఇప్పించేంత లీగల్ గ్రౌండ్ ఉందా అని మాత్రమే చూస్తుంది’’ అని రామ్మోహన్ వివరించారు.
అసలు దేశంలో 90 శాతం పరువునష్టం కేసులు వీగిపోయినవేనన్న ఆయన, మాజీ మంత్రి కన్నాలక్ష్మీనారాయణ-మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు మధ్య జరిగిన పరువునష్టం కేసును గుర్తు చేశారు. ‘‘అప్పట్లో తెలుగుదేశంలో ఇంకా చేరని కన్నా, టీడీపీ నేత అయిన మాజీ ఎంపి రాయపాటిపై పరువునష్టం దావా వేశారు. ఆ తర్వాత కన్నా కూడా టీడీపీలోనే చేరారు. కేసు కోర్టుకు వచ్చిన సందర్భంగా ఇద్దరూ రాజీ పడటంతో కేసు వీగిపోయింది. తొలుత పరువునష్టం కేసులు వేసేవారి భావోద్వేగం, తీవ్రత తర్వాత ఉండకపోవడమే, ఆ కేసులు వీగిపోవడానికి కారణమ’ని రామ్మోహన్ విశ్లేషించారు.
అయినా మీడియాలో వచ్చిన ప్రతి రాజకీయ-వ్యక్తిగత ఆరోపణలపై.. పరువునష్టం కేసులు వేసులు వేసుకుంటూ పోతే, ఇతర కేసులు వినేందుకు కోర్టుకు సమయం సరిపోదని ఆయన వ్యాఖ్యానించారు. సురేఖ కేసులో ఆమె వ్యాఖ్యలు మీడియా-సోషల్‌మీడియా ఇప్పటికే ప్రచారంలో ఉన్నందున, సొసైటీలో దీనిపై జరుగుతున్న చర్చకు, కోర్టు అభిప్రాయాలకు సంబంధం లేదని రామ్మోహన్ చెప్పారు.