Suryaa.co.in

Andhra Pradesh

సీఎం సిగ్గుతో తలదించుకుంటారా?

• కల్యాణదుర్గంలో జరిగిన గ్యాంగ్ రేప్ పట్ల.. సీఎం సిగ్గుతో తలదించుకుంటారా? చర్యలు తీసుకుంటారా?

– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

దళితులపై దాడులు జరుగుతున్నా.. ఏనాడు డీజీపీ, పోలీసు అధికారులు, కలెక్టర్లను గట్టిగా ప్రశ్నించనందున సీఎంనే అనుమానించాల్సి వస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తన అనుమానాన్ని వ్యక్తం చేశారు.

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ…

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని ఓ చిన్న గ్రామంలో దళిత మహిళపై ఐదుగురు వైసీపీ నాయకులు చేసిన గ్యాంగ్ రేప్ విషయంలో సీఎం సిగ్గుతో తలదించుకుంటారా? లేక చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు.

సంవత్సరం క్రితం వైసీపీ కి చెందిన ఐదుగురు ఆ దళిత మహిళను భయపెడుతూ.. ఐదుగురు కలిసి సామూహిక అత్యాచారం చేస్తూ వస్తున్నారు. అత్యాచారం చేస్తుండగా ఇంకొకడు ఫొటోలు తీస్తాడట. ఇదెక్కడి చోద్యం? అవసరమొచ్చినప్పుడల్లా, అవకాశమొచ్చినప్పుడల్లా ఆ మృగాళ్లు ఆ దళిత మహిళపై అత్యాచారం చేస్తూ వస్తున్నారు. వైసీపీ వాలంటీర్ సోదరుడు ఉమెన్ మినిష్టర్ ఉష గారికి అత్యంత సన్నిహితుడైన హరి అనే వ్యక్తి కూడా ఇందులో భాగస్వామి అని తెలుస్తోంది.

ప్రస్తుత ప్రభుత్వంలో రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువైంది. రాష్ట్రంలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయి. ఇంత జరుగుతున్నా మీరేం చేస్తున్నారని సీఎం పోలీసు అధికారులను అడిగిన పాపాన పోలేదు. దళితులను చంపినా, నరికినా, శిరోముండనం చేసినా, అత్యాచారాలు చేస్తున్నా ఈ ప్రభుత్వానికి, సీఎంకు చీమ కుట్టినట్లు కూడా లేదు.

జగన్ మౌనం వహించడం పరోక్షంగా వీటిని ప్రోత్సహిస్తున్నారా? అనే అనుమానం కలుగుతోంది. దళితులపై జరుగుతున్న దాడుల గురించి పుంఖానుపుంఖానులుగా పత్రికల్లో వస్తున్నా చర్యలు శూన్యం. దళితులపై దాడులు చేస్తే అవార్డులు, రివార్డులు, గాలంట్రీ మెడల్స్ ఏమైనా ఇస్తున్నారా? అని అనుమానించాల్సివస్తోంది. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే దేశానికి నిజమైన స్వాంతంత్ర్యం వచ్చినట్లని ఆనాడు గాంధీగారు అన్నారు.

పట్టపగలే రాష్ట్రంలో దళిత మహిళలకు రక్షణ లేకుండాపోయింది. ఒక్కసారైనా సీఎం.. డైరెక్టర్ జనరల్, పోలీసులు, కలెక్టర్లను పిలిచి దళితులపై దాడి చేస్తుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారా?, సమీక్ష చేశారా? అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం మాదిగ కులానికి చెందిన మహిళపై వైసీపీకి చెందిన ఐదుగురు సంవత్సర కాలంగా సామూహిక అత్యాచారం చేస్తున్నా పసిగట్టలేకపోయారంటే సిగ్గుపడాల్సిన విషయం. ఒక దళిత మహిళను సంవత్సర కాలంగా గ్యాంగ్ రేప్ చేస్తూ వస్తుంటే డీఎస్పీ, ఎస్ ఐలు ‘‘ఇదేముంది చిన్న కంప్లైంటే’’ అని చెప్పడం సిగ్గుచేటు. స్వాతంత్య దినోత్సవం రోజున స్వాతంత్ర్యం కోల్పోయిన దళిత బిడ్డకు సీఎం న్యాయం చేయాలి.

జగన్ దళితులకు మేన మామ కాదు.. కంస మామ.. దొంగ మామ. దళితులు కూడా వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిని గమనించాలి. దళితులపై జరుగుతున్న దాడుల పట్ల ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేయాలి. కల్యాణదుర్గం మహిళపై జరిగిన గ్యాంగ్ రేప్ సంఘటనపై పూర్తి విచారణ జరిపించి, నిందితులపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో అత్యాచారాలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. అదేమని అడిగే నాధుడు కరువయ్యారు.

గతంలో అత్యాచారం చేస్తే పెద్ద సన్షేషఫనల్ అయ్యేది. పోలీసులంతా అదే పనిలో ఉండేవారు. కాని నేడు పోలీసులు గుట్టచప్పుడు కాకుండా దాచేస్తున్నారు. మా బిడ్డలకు దేవుడిచ్చిన శాపమా? ఇది అని దళిత బిడ్డల తల్లిదండ్రులు అనుకుని సరిపెట్టుకోవాల్సి వస్తోంది. దళితులను చంపినా, నరికేసినా, శిరోముండనం, అత్చాచారాలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. వేసేయండ్రా, చేసేయండ్రా అని సినిమాల్ల్లో చెప్పినట్లుంది. మౌనం అర్ధాంగీకారం అన్నట్లుగా సీఎం మౌనంగా వున్నారు. ఈ ఘటన పట్ల నిర్లక్ష్యం వహించిన ఎస్ ఐ, డీఎస్పీ లపై తగు చర్యలు తీసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు

 

LEAVE A RESPONSE