-బండి సంజయ్‌పై ప్రకాశ్‌రాజ్ ట్వీట్..!
-ఆదివారం తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా
-మహంకాళి అమ్మవారి ఆలయ సందర్శనలో చెప్పులు అందించిన బండి సంజయ్
-సెటైర్లు సంధిస్తున్న వైరి వర్గాలు
-మనిషికి సిగ్గుండాలి అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్
తెలంగాణ పర్యటనకు వచ్చిన బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు చెప్పులను అందిస్తున్న ఆ పార్టీ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పై వైరి వర్గాలు వరుసగా విమర్శల దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ కూడా సోమవారం మధ్యాహ్నం సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
‘మనిషికి సిగ్గుండాలి…ఛి..ఛి… వీళ్లా తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడేది ..???’ అంటూ ప్రకాశ్ రాజ్ తన ట్వీట్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్ట్ ఆస్కింగ్ పేరిట ఆది నుంచి బీజేపీ భావజాలాన్ని ప్రశ్నిస్తూ సాగుతున్న ప్రకాశ్ రాజ్… అవకాశం చిక్కినప్పుడల్లా బీజేపీ నేతలపై వరుసగా సెటైర్లు సంధిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా బండి సంజయ్ వ్యవహారాన్ని ఆసరా చేసుకుని ఆయన సెటైర్ సంధించారు. తన ట్వీట్‌కు అమిత్ షాకు బండి సంజయ్ చెప్పులు అందిస్తున్న వీడియోను ప్రకాశ్ రాజ్ జత చేశారు.
మనిషికి సిగ్గుండౌలి…ఛి..ఛి… వీళ్ళా తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడేది ..??? #JustAsking pic.twitter.com/cxYFyUg1rb
— Prakash Raj (@prakashraaj) August 22, 2022