Suryaa.co.in

Andhra Pradesh

ఇంతకీ నీవు 175 సీట్లల్లో పోటీ చేస్తావా, లేదా..?

– నీ చిలుక ఏం జోస్యం చెప్పింది పవన్ కల్యాణ్..?
-: పవన్ కల్యాణ్ కు మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) సూటి ప్రశ్నలు

చిరంజీవి ద్రోహి.. అన్నట్టు పవన్ మాటలు
మొన్న జరిగిందీ, నిన్న మాట్లాడిందీ ఏదీ ప్రజలకు గుర్తుండదు, అందరికీ మతిమరుపు ఉంటుంది అన్నట్టుగా.. వీకెండ్(ఆదివారం) రాజకీయ నాయకుడు పవన్ కల్యాణ్ అనుకుంటున్నాడు. చిరంజీవి గారు ప్రజలకు ఏదో ద్రోహం చేసి వెళ్ళిపోయినట్టుగా, రాజకీయంగా చేయకూడని తప్పులు చేసినట్టుగా, ఈయన మాత్రమే పునీతుడు అన్నట్టుగా, చిరంజీవిలా తాను చెడిపోలేదు.. అన్నట్టుగా సూక్తిముక్తావళి చెబుతున్నాడు.

మీ అన్న చిరంజీవిగారి దయతో సినిమా ఇండస్ట్రీకి వచ్చి, అన్న గారి అభిమానుల్ని తన అభిమానులుగా మార్చుకుని, తానేదో పత్తిత్తు అయినట్టు, చిరంజీవి ఏదో చెడిపోయినట్టు పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నాడు. నిఖార్సు అయిన రాజకీయ నాయకుడు చిరంజీవి. దమ్ముగా పార్టీ పెట్టాడు, ఉమ్మడి రాష్ట్రంలోని 294 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీ పెట్టాడు. గెలుపు కోసం ప్రజల్లో తిరిగాడు, పోరాటం చేశాడు, 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి తనతోపాటు 18 స్థానాలు గెలిపించుకున్నాడు. ఆ తర్వాత తనకు రాజకీయాలు సూటు అవ్వవని అనుకున్నాడు.

ఆ విషయాన్ని కార్యకర్తలతో చర్చించి.. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాడు. మళ్ళీ ఎంతమంది ఒత్తిడి చేసినా రాజకీయాల్లోకి రాలేదు. ప్రజారాజ్యం అధ్యక్షుడిగా వరదలు వస్తే పర్యటనలు చేశాడు, ప్రజా ఉద్యమాలు చేశాడు. మరి, యువరాజ్యం అధ్యక్షుడిగా నీవు ఎక్కడా అడ్రస్ లేవే.. కనీసం ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా కూడా చేయకుండా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయావు కదా..!. – చంద్రబాబు సొంత మామకు వెన్నుపోటు పొడిస్తే.. నీవు సొంత అన్నకు వెన్నుపోటు పొడిచింది నిజం కాదా..?

చంద్రబాబును ఏనాడైనా ప్రశ్నించావా..?
రాజకీయాల్లో నువ్వు చేసిన, చేస్తున్న తప్పులు నాడు చిరంజీవి చేయలేదే..! తన పార్టీ కోసం, తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటం చేశాడు. 2014లో పార్టీ పెట్టి, సైకిల్ గుర్తు కూడా చంద్రబాబుది కాదు అని మాట్లాడావు కదా. చంద్రబాబు అందితే జుట్టు.. అందకపోతే కాళ్ళు పట్టుకునే నయవంచకుడు అని చెప్పావు కదా..!. మరి అలాంటప్పుడు, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని 2014 ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేయమని అడిగావు..? ఇదా నీ వ్యక్తిత్వం..?. చిరంజీవా..! నీవా..! ఎవరు మగాడు..?. మళ్ళీ సిగ్గు లేకుండా, ఆదివారం, ఆదివారం ఏదో ఒక మీటింగుపెట్టి, చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదువుతూ, అవే తప్పుడు మాటల్ని, అసత్యాల్ని చెబుతున్నావు. ప్రశ్నిస్తానని రాజకీయాల్లో వచ్చానని చెప్పిన నీవు.. 2014 నుంచి 2019 వరకు ఐదేళ్ళలో ఒక్క రోజు అయినా చంద్రబాబును ప్రశ్నించావా..?

హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చింది నీ పార్టనర్ బాబే కదా..!.
2014లో ఆంధ్రా-తెలంగాణ విడిపోతే… పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను వదిలి తగుదునమ్మా అని ఓటుకు కోట్లు ఇస్తూ దొరికిపోయిన దొంగలా.. మీ నాయకుడు, మీ బాసు, మీ పార్టనర్.. హైదరాబాద్ లో ఉన్న మన రాష్ట్ర ఆస్తుల్ని చెప్పాపెట్టకుండా, కనీసం తనతో పని చేస్తున్న ఐఏఎస్ అధికారులకు కూడా చెప్పకుండా అర్థరాత్రి కట్టుబట్టలతో పారిపోయి వచ్చిన వ్యక్తి మీ బాసే కదా..!. ఓటుకు కోట్లు కేసులో ఉన్న చంద్రబాబు మీ పార్టనరే కదా..!
ఎంతసేపూ జగన్ మోహన్ రెడ్డి మీద పడి ఏడవటమే నీ రాజకీయం.. !. చంద్రబాబు గురించి ఏనాడూ మాట్లాడిన పాపాన పోలేదే.. అటువంటిది నీది ఒక రాజకీయ పార్టీ ఎలా అవుతుంది..?.

నీ వల్ల బాగుపడింది బాబు, లోకేష్ లే కదా..!
సినిమాల్లో స్క్రిప్టులు మాదిరిగా.. ఎక్స్ పైరీ డేట్ల గురించి మాట్లాడుతన్న నీకు.. ఎక్స్ పైరీ డేట్ ఉండదా..? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్ పైరీ డేట్లతో పాటు.. మధ్యలో పెర్ఫార్మెన్స్ డేట్ కూడా ఉంటాయి. అది వస్తువు అయినా, ప్రభుత్వమైనా, రాజకీయ పార్టీలు అయినా..!. మనలో కంటెంట్ ఉందా లేదా అనేది ముఖ్యం. నిన్ను నమ్ముకున్నందుకు.. జెండా మోసే జనసేన కార్యకర్తలతో సహా అంతా నష్టపోవడమే కదా..!.
నీ వల్ల, నీ జనసేన పార్టీ వల్ల పవన్ నాయుడు, చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడులే బాగు పడ్డారు. మీ వల్ల రాష్ట్రానికి ఒనగూరిన ప్రయోజనం ఏమిటి.. మనం ఎందుకు పుట్టాం, ఎందుకు పార్టీ పెట్టాము.. దేనికైన సార్థకత ఉండాలి కదా.. ?
పవన్ కల్యాణ్ వల్ల ఎవరికి లాభం, చిరంజీవికి లాభం జరిగిందా.. అంటే లేదు. చిరంజీవిని వెన్నుపోటు పొడిచి వెళ్ళావు కదా..!. ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయిన మరుసటి రోజు నుంచి అడ్రస్ లేకుండా పోయావు కదా..!. పార్టీ కొనసాగిద్దామని ఎందుకు నాడు చిరంజీవికి చెప్పలేకపోయావు…?. ఇప్పుడేమో, ప్రతి ఆదివారం ఏదో ఒక మీటింగు పెట్టుకుని.. నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి వెళతావా.. !.

ఎన్ని సీట్లలో పోటీ చేస్తావో నీ చిలుక జోస్యం చెప్పదా..!
గతంలో పొలిటికల్ ఆక్టోపస్ ఒకాయన ఉండేవాడు.. ఇప్పుడు పొలిటికల్ ప్యారెట్.. అంటే రాజకీయ జోస్యాలు చెప్పే పొలిటికల్ చిలుక వచ్చింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 45 నుంచి 67 సీట్లు వస్తాయని చెబుతున్న పవన్ కల్యాణ్.. తన చిలుక జోస్యంలో తన పార్టీ ఎన్నిసీట్లకు పోటీ చేస్తుందో, 175 స్థానాల్లో పోటీ చేస్తాడా, లేదా.. ఆ జోస్యంలో రాదా..?. పవన్ కల్యాణ్ ఎన్ని సీట్లకు పోటీ చేస్తాడు, ఎన్ని సీట్లు గెలుస్తాడు, అసలు చంద్రబాబు ఎన్ని సీట్లు ఇస్తాడు.. అందులో జనసేన వాళ్ళే అభ్యర్థులుగా ఉంటారా, లేక చంద్రబాబు అభ్యర్థులు ఉంటారా..? ఈ ప్రశ్నలకు నీ చిలుక జోస్యం చెప్పదా..?. కేవలం వైఎస్ఆర్సీపీ సీట్లే మీ చిలుక జోస్యం చెబుతుందా..?
మరోసారి చెబుతున్నాం.. మీ చిలుకను అడగండి. జనసేన పార్టీ 175 సీట్లకు పోటీ చేస్తుందా.. లేదా..?లేక చంద్రబాబు దయాదాక్షిణ్యాల మీద ఎన్ని సీట్లు ఇస్తే.. అన్ని సీట్లకే పోటీ చేస్తుందా..?
బాబు పర్మిషన్ ఇవ్వలేదా..?

దసరాకు యాత్ర చేస్తానంటే.. పులి వేషం వేసుకొస్తాడా అని గతంలో అడిగా.. ఇప్పుడు ఆ యాత్ర తూచ్ అట.. ఈరోజు పొద్దునేమో లోకేష్ యాత్ర తూచ్.. మధ్యాహ్నం పవన్ యాత్ర తూచ్.. వీళ్ళద్దరికి చంద్రబాబు పర్మిషన్ ఇవ్వాలి కదా..! ఎందుకు వాయిదా.. షూటింగ్ లు ఉన్నాయనా..?.
నాకు తెలిసి, సినిమాల కోసం పవన్ కల్యాణ్ తీసుకున్న అడ్వాన్స్ లు 2050 వరకు ఉన్నాయి. మరి ఎవరిని ముంచాలని యాత్ర అని ప్రకటించావు.. జెండా మోసిన కార్యకర్తలను ముంచుతావా.. లేదా డబ్బులిచ్చిన ప్రొడ్యూసర్లను అయినా ముంచాలనుకున్నావా..?.

పూటకో మాట.. రోజుకో డైలాగ్ చెప్పే పవన్ కల్యాణ్ కు రాజకీయాలు ఎందుకు..?. ఎదురుగ్గా నల్ల కోట్లు వేసుకున్న వాళ్ళు కనిపించగానే.. రాజకీయాల్లోకి రావటానికి స్ఫూర్తి, ప్రేరణ.. నానీ ఫాల్కేవాలా అని పెద్ద పెద్ద డైలాగులు చెబుతున్నాడు. గతంలో చెప్పిన.. చేగువేరా, మథర్ థెరీసా, అంబేద్కర్, పూలే.. వీళ్ళంతా వెళ్ళిపోయారా… అమరులైన వాళ్ళను కూడా వాడుకోవడంలో తన అవసరం కోసం వాడుకోవడంలో దిట్ట పవన్ కల్యాణ్.

మీ పార్టనర్ పాలనలోనే సుగాలీ ప్రీతి మరణించింది..
సుగాలీ ప్రీతి మరణం గురించి మాట్లాడుతూ.. భగవంతుడు తనను ఎమ్మెల్యేను చేస్తే బాగుండేది అని పవన్ కల్యాణ్ మాట్లాడాడు. సుగాలీ ప్రీతి ఎప్పుడు చనిపోయింది, నీవు స్పాన్సర్డ్ చేసిన చంద్రబాబు ప్రభుత్వంలోనే కదా.. నీవు చంద్రబాబుతో కలిసి వారానికొకసారి కాఫీలు, టిఫెన్లు తిని వెళుతున్నప్పుడు, ఎమ్మెల్యే ఎందుకు భగవంతుడు చేయలేదు అని అనిపించలేదా..? సుగాలీ ప్రీతి తల్లి నోరు తెరిచి అడగగానే, ముఖ్యమంత్రి జగన్ గారు ఆ కేసును సీబీఐకి అప్పగించారు. ఢిల్లీ చంకలో ఉన్న నీవు, ఢిల్లీ వెళ్ళి ఏనాడైనా సీబీఐని అడిగావా..?, మరి ఎందుకు అడగలేదు..?

బాబు హయాంలో పావలా శిక్ష నీదే కదా..!
నీవు చెప్పినట్టే… 2014 నుంచి 2019 వరకు జరిగిన తప్పులకు పావలా శిక్ష నీదే కదా..? ఆంధ్రప్రదేశ్ లోని 5 కోట్ల మందిని క్షమించని, మన్నించమని ఏనాడైనా కోరావా..?. నీ పార్టనర్ కు 2019లో దేవుడు, ప్రజలు శిక్ష వేసిన తర్వాత.. ఆయన కోసం జగన్ మోహన్ రెడ్డిగారి మీద వీకెండ్ మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేస్తావా.. ?. నీవు ఎప్పుడైనా ఒక సిద్ధాంతం కోసం నిలబడ్డావా.. ?. 2008లో రాజకీయాల్లోకి వచ్చిన నీవు.. గత 14 ఏళ్ళు ఏం చేశావు. చేతకాని కబుర్లు ఎందుకు, నిజాయితీతో కూడిన రాజకీయాలు ఎందుకు చేయలేకపోయావు..?

గెలుపు, ఓటములు ముఖ్యం కాదు.. ఆత్మసాక్షితో పనిచేయాలేగానీ, ఆత్మవంచనతో పనిచేయవద్దు అని హితవు చెబుతున్నా. చంద్రబాబు మేలు కోసమే నీ రాజకీయాలు అన్నీ.. చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిగా చూసుకోవాలనే పవన్ కల్యాణ్ తాపత్రయం, తపన అంతా.

చంద్రబాబు స్పాన్సర్డ్ చేస్తే.. విమానం ఎక్కి వచ్చి, ఒక ప్రోగ్రామ్ పెట్టి, టీవీల్లో మాట్లాడి వెళ్ళటం పవన్ నైజం. గానుగ ఎద్దు తరహాలో.. చంద్రబాబు ఏం చెబితే అది పవన్ కల్యాణ్ చేస్తాడు.అమరావతి ప్రాంతంలో అత్యధికంగా అభివృద్ధి చేసింది జగన్ మోహన్ రెడ్డిగారే… దానిమీద పవన్ కల్యాణ్ చర్చకు వస్తానంటే నేను సిద్దమే. రాష్ట్ర సంపదనంతా తీసుకువచ్చి.. అమరావతిలోని 29 గ్రామాల్లోనే పోయాలంటే అదెక్కడి న్యాయం. అందుకే వికేంద్రీకరణే మా ప్రభుత్వ విధానం అని చెబుతున్నాం. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను ప్రజలు నమ్మరుగాక నమ్మరు.. అని పేర్ని నాని అన్నారు.

LEAVE A RESPONSE