విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించుకోండి

– ధనిక రాష్ట్రాన్ని దివాళ తీయించిన టిఆర్ఎస్ సర్కార్
-పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర) తో రాష్ట్ర సర్కారులో కదలిక
-పాదయాత్రకు అడుగడుగునా బ్రహ్మరథం కదం తొక్కిన పల్లేలు
– కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణ బడ్జెట్ ను దివాళ తీయించిన టిఆర్ఎస్ ప్రభుత్వం

ప్రజలపై పన్నుల భారం మోపడం కోసం విద్యుత్ చార్జీలు పెంచిందని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకై సీఎల్పీ నేత విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర) శుక్రవారం ముదిగొండ మండలం అమ్మపేట గ్రామంలోని శ్రీ వెలుగొండ స్వామి సన్నిధి నుంచి ప్రారంభించారు.

దీనికి ముందు దేవాలయంలో విక్రమార్క దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ నిర్వాహకులు పూలమాల వేసి శాలువాతో సత్కరించారు. అనంతరం దేవాలయం నుంచి అమ్మపేట, వల్లాపురం, మీదుగా చింతకాని మండలం నామవరం, మత్కేపల్లి, జగన్నాధపురం గ్రామాల్లో కొనసాగింది. రాత్రికి జగన్నాధపురంలో బస చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభలో ప్రజలనుద్దేశించి భట్టి విక్రమార్క మాట్లాడారు.
కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై భారం వేస్తే ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలను ఇష్టారాజ్యంగా పెంచడం వల్ల మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని తెలిపారు.

దేశానికి అచ్చే దిన్ తీసుకొస్తామని ప్రగల్భాలు పలికిన మోడీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు విక్రయిస్తూ, డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుతూ ప్రజలకు చచ్చే దీన్ తీసుకు వచ్చాడని ధ్వజ మెత్తారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందడం వల్ల దేశంలో సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.

కిలో మంచి నూనె ప్యాకెట్ ధర రూ. 220 ఎగబాకితే పేదలు బతికేది ఎట్లా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రోజువారి వచ్చే కూలీ డబ్బులు నూనె కొనడానికే సరిపోతే కూలీలు ఎట్లా మూడు పూటలు తింటారని ప్రభుత్వాన్ని నిలదీశారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పీపుల్స్ మార్చి పోరాట ఫలితమే…
ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు నిర్వహించిన పీపుల్స్ మార్చ్ లో వచ్చిన ప్రజా సమస్యలను ప్రజల గొంతుక అసెంబ్లీలో ప్రస్తావించడంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చిందని వివరించారు. నకిలీ విత్తనాలతో పొద్దుతిరుగుడు, మిర్చి, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని అసెంబ్లీ వేదికగా గళం వినిపించడంతో సీఎం కేసీఆర్ స్పందించి నకిలీ విత్తనాల విక్రయాలపై ఫోకస్ పెట్టి అక్రమార్కులపై పిడియాక్ట్ కేసులు పెట్టాలని వ్యవసాయ శాఖ మంత్రిని ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు.

పంట నష్టం పరిహారం అంచనా వేయడానికి అధికారులను వ్యవసాయ క్షేత్రాలకు పంపించడానికి సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా అంగీకరించారని తెలిపారు.అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, మెప్మా సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయాలని ప్రభుత్వంపై చేయడంతో సీఎం కేసీఆర్ అంగీకరించారని వివరించారు. ఎనిమిదేళ్లుగా ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో నిధులు విడుదల చేయకుండా చేస్తున్న జాప్యాన్ని అసెంబ్లీలో ఎండగట్టడం తో సొంత జాగా కలిగినవారికి వచ్చే నెల నుంచి మూడు లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలిపారు.

ఆసరా పింఛన్లు, పంట రుణమాఫీ, వృత్తిదారుల సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తిన ట్లు వివరించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేసేంత వరకు తన అడుగులు ఆగవని, తన పాదయాత్ర ఆగదని స్పష్టం చేశారు.

మధిరలోని బడ్డికొట్ల తొలగింపుకు బ్రేకులు వేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
మధిర పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చిరు వ్యాపారుల బడ్డీకొట్లు అధికారులు తొలగించకుండా వారికి ప్రత్యమ్నాయం చూపించే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి వారి బతుకు తెరువు సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకి శుక్రవారం ముదిగొండ మండలం అమ్మ పేటలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి రామనాధం గారు, సిపిఎం మధిర పట్టణ అధ్యక్షులు తేలప్రోలు రాధాకృష్ణ, సిపిఐ నాయకులు బెజవాడ రవిబాబు, టిడిపి మధిర అధ్యక్షులు మల్లాది హనుమంతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చావా వేణు, కాంగ్రెస్ మధిర పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటరమణ, ఐఎన్టియుసి మధిర పట్టణ అధ్యక్షులు కోరంపల్లి చంటిలు వినతిపత్రం అందజేశారు.

ప్రజా సమస్యల పరిష్కారం కొరకై సీఎల్పీ నేత విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చి కార్యక్రమం నుంచే జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి బడ్డీ కొట్లు సమస్య గురించి చర్చించారు. చిరు వ్యాపారులకు మరో చోట ప్రత్యామ్నాయం కల్పించే వరకు ఇప్పుడు ఉన్న చోటనే బడ్డీకొట్లు నడిపించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. భట్టి విక్రమార్క గారు ఫోన్ లో కలెక్టర్ తో జరిపిన చర్చలు ఫలించాయి. ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే రోడ్డు పక్కన ఉన్న బడ్డీకొట్టు తొలగించేందుకు కలెక్టర్ అంగీకరించారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరికలు
ముదిగొండ మండలం వల్లాపురంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఆ పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి భట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో గాలి సత్యనారాయణ, గాలి శీను ,గాలి లక్ష్మీనారాయణ, ఆరుద్ర సీతయ్య, గాలి ఆకేష్, వజీర్, శ్రీలక్ష్మి అమీర్, గుత్తికొండ నాగయ్య ,గోపి నేని శ్రీను, నరేష్ తదితరులు ఉన్నారు.

భట్టి పాదయాత్రలో కదం తొక్కిన పల్లేలు
ప్రజా సమస్యల పరిష్కారం కొరకై తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత గౌరవనీయులు మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో చేపట్టిన పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర) కు శుక్రవారం ముదిగొండ మండలం అమ్మపేట, వల్లాపురం, చింతకాని మండలం నామవరం, మత్కేపల్లి, జగన్నాధపురం గ్రామాల్లో ప్రజలు ఘన స్వాగతం పలికారు. గిరిజన కళాకారులు కొమ్ము డ్యాన్స్ తో పాదయాత్రకు వెల్ కమ్ చెప్పారు.
కార్మికులు, కర్షకులు, కూలీలు, నిరుద్యోగులు, వృత్తిదారులు, యువకులు, విద్యార్థులు, మహిళలు, చిన్న, పెద్దలు, చంటి పిల్లల తల్లులు ఇలా సబ్బండ వర్గాలు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అడుగులో అడుగు వేసి పీపుల్స్ మార్చ్ లో కధం తొక్కారు. మహిళలు మంగళ హారతులు పట్టి వీరతిలకం దిద్దారు. దారి పొడవునా బంతిపూల వర్షం కురిపిస్తూ కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా అమ్మపేట ట హ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. పింఛన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, 3 ఎకరాల భూమి, రేషన్ కార్డులు, సాగునీటి సమస్య, రుణమాఫీ, మద్దతు ధర సమస్యలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కు ప్రజలు తమ గోడును వెల్లబోసుకున్నారు. దారి పొడవునా ప్రజలు పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు.

సీఎల్పీ నేత భట్టి పాదయాత్రకు టిడిపి, సిపిఐ, సిపిఎం నేతలు సంఘీభావం
ప్రజా సమస్యల పరిష్కారం కొరకై తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత గౌరవనీయులు మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర)కు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి రామనాధం , సిపిఎం మధిర పట్టణ కమిటీ సభ్యులు తేలప్రోలు రాధాకృష్ణ, సిపిఐ నాయకులు బెజవాడ రవిబాబు, టిడిపి మధిర అధ్యక్షుడు మల్లాది హనుమంతరావు, సంఘీభావం ప్రకటించారు.
శుక్రవారం ముదిగొండ మండలం అమ్మపేట గ్రామంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారిని కలిసి తమ మద్దతు ప్రకటించారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లోని టిడిపి కార్యకర్తలు పాదయాత్రకు ఘనస్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు.