ఆంధ్రప్రదేశ్ బీజేపీకి రాజకీయ పాతివ్రత్యం ఎక్కువ. రాజకీయాల్లో విలువలు కాపాడడానికి ఎంత దూరమైనా సోము వీర్రాజు వెడతారు. కుటుంబ పార్టీ అయిన టీడీపీ తో బీజేపీ 2014 లో పొత్తు పెట్టుకుంది గానీ, 2019 లో పెట్టుకోలేదు. టీడీపీ కి బీజేపీ మద్దతు ఇవ్వడం వల్లే, 2014 లో టీడీపీ గెలిచింది. 2019 లో టీడీపీ కి బీజేపీ మద్దతు ఇవ్వలేదు. అందుకే టీడీపీ చిత్తు చిత్తు గా ఓడిపోయింది అనేది బీజేపీ అధ్యక్షుడు వీర్రాజు అభిప్రాయం . బీజేపీ మద్దతు లేనందువల్లనే 23 స్థానాలే టీడీపీ గెలుచుకోగలిగింది. ఏపీ లో బీజేపీ కి ఉన్న ఓటు షేర్, ప్రజా మద్దతు అంత బలమైనవి. ఆ బలం, ఓటు షేర్ చూసుకునే, ఏపీ బీజేపీ అధ్యక్షుడు వీర్రాజు ఈ మధ్య కాలం లో స్టేట్ మెంటు మీద స్టేట్ మెంట్ ఇస్తున్నారు.
‘ మేం తెలుగు దేశం కు వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇవ్వం. ఆ పార్టీ తో పొత్తు పెట్టుకోం….’ అని నేరుగా, సూటిగా, స్పష్టంగా వీర్రాజు ఎందుకోగానీ చెప్పలేక పోతున్నారు. చెప్పకుండానూ ఉండలేక పోతున్నారు. అందుకే, వైసీపీ తో పాటు టీడీపీ అని అర్ధం వచ్చేలా ప్రకటనలు ఇస్తున్నారు. మహారాష్ట్ర బీజేపీ కి ఈ పట్టింపు ఏమీ లేదు . వంద శాతం కుటుంబ పార్టీ అయిన శివసేన తో బీజేపీ కలిసి , మెలసి దశాబ్దాలపాటు చెట్టా పట్టాలు వేసుకు తిరిగింది . వరస కుదిరితే , మళ్ళీ తిరగడానికి సిద్ధం అవుతున్నది . మరి, మహారాష్ట్ర లో లేని పట్టింపు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కి ఎందుకూ అంటే ; చంద్రబాబు పై వీర్రాజు కు ఉన్న ఎలర్జీ అని చెప్పాలి. అందుకే రక రకాల థియరీలను ఆయన బయటకు తీస్తున్నారు అనిపిస్తున్నది . అదే సమయం లో వైసీపీ కి వ్యతిరేకంగా ఉన్నట్టుగా కనపడడానికి కూడా వీర్రాజు చాలా శ్రమ పడుతున్నారు . కానీ , తమ ‘మిత్ర ‘ పక్షం అని అప్పుడప్పుడూ బీజేపీ చెప్పుకునే పవన్ కళ్యాణ్ …; వైసీపీ పై నిప్పులు చెరుగుతున్నారు .
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రదర్శిస్తున్న ఈ రాజకీయ వైఖరికి , కేంద్ర బీజేపీ పెద్ద (ల ) వైఖరి కూడా ఒక కారణం అయితే కావచ్చు . ఢిల్లీ పెద్దలు టీడీపీ కి అంత అనుకూలంగా లేరు అనే భావనే ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో ఉంది . అందుకని , నర మానవుడు ఎవరికీ అర్ధం కావడానికి అవకాశంలేని తెలుగు భాషా ప్రయోగం లో ….. “ప్రజలతోనే ఫస్టు మా పొత్తు. తరవాతే పవన్ కళ్యాణ్ తో….’ అని సోము వీర్రాజు ప్రకటించారు. తెలుగు ప్రజలు ఆయనంత తెలివైనవారు కాదు కనుక , ఆ ప్రకటన లోని అంతరార్ధాన్ని కొంచెం విడమరిచి చెబితే బాగుండేది .
అయితే, ‘కుటుంబ’పార్టీలతో పొత్తు పెట్టు కోమ్ ‘ అనే బీజేపీ పాతివ్రత్యానికి ఇబ్బంది రాకుండానే, టీడీపీ ని ఇరుకున పెట్టే ఓ వ్యూహం పై బీజేపీ లో చర్చ జరుగుతున్నట్టు ఓ చిన్న సమాచారం. పవన్ కళ్యాణ్ ను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించి, జనసేన తో పొత్తు పెట్టుకుంటుంది. కావాలంటే, జనసేన తో పొత్తు పెట్టుకోవాలని టీడీపీకి బీజేపీ సవాలు విసురుతుంది. టీడీపీ – సీపీఐ, అంబేద్కర్ పార్టీ ల కూటమి…. జనసేన తో పొత్తు పెట్టుకోవాలి. జనసేనకు ఓ నలభైయ్ సీట్లు వదిలితే, అందులో బీజేపీ కి ఓ పది సీట్లు వదలాలి. అంటే , 175 స్థానాల లోనూ 150 కి తక్కువ లేకుండా పోటీ చేసేందుకు అవకాశం ఉన్న టీడీపీ ; పాతిక , ముప్ఫయి సీట్లలో పోటీ చేయడానికైనా’ తగిన ‘ అభ్యర్థులను వెతుక్కోవలసిన స్థితిలో ఉన్న వారు ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారన్నమాట .
అయితే, ఇప్పటికీ… – ఎన్నికల తేదీలు తెలిసేనాటికి… ప్రకాశం బ్యారేజ్ కింద నుంచి కృష్ణా జలాలు చాలా ప్రవహించి, సముద్రం లో కలుస్తాయి. మన రాజకీయాల్లో ఈ రోజు ఉన్న సమీకరణలు రేపు ఉండడం లేదు. నిన్నటి దాకా నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధర రెడ్డి -వైసీపీ లో ముఖ్యమంత్రి జగన్ కు వీర విధేయుడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు కు విధేయుడు. వెంకట గిరి ఎంఎల్ఏ ఆనం రామ నారాయణ రెడ్డి జగన్ కు విధేయుడు. ఇప్పుడు, ఆయనకు జగన్ మోహన్ రెడ్డి ఓ ఆఫ్ట్రాల్. నెల్లూరు జిల్లా లోనే ఇంకో వికెట్ పడే సూచనలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. మేకపాటి చంద్రమోహన్ రెడ్డి పేరు మీడియా లో గట్టిగానే వచ్చింది. దీనికి తోడు , వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఒకటి ‘ఈటీవీ’ డైలీ సీరియల్ ‘అంత రంగాలు ‘లాగా నడుస్తూనే. ఉంది . దానికి ఇప్పటికిప్పుడు ‘శుభం ‘ కార్డు పడే సూచనలు లేవు .
అంత పలుకుబడి , స్థాయి , ఆ ప్రాంతంలో సామాజికాధిపత్యం , అధికారం కలిగిన జగన్ కుటుంబానికి …. వివేకా హత్య కేసు ముద్దాయిలలో ఒకరైన దస్తగిరి అనే ఒక డ్రైవర్ పులి మీద పుట్ర లా తయారైన తీరు ఆశ్చర్యం కలిగించక మానదు . ‘ వివేకా హత్య కేసులో నిజాలు త్వరలోనే తెలుస్తాయి . నిజాలు బయట పడే రోజు దగ్గరి లోనే ఉంది . సీ బీ ఐ కి జగన్ సహకరించి ఉంటే , వివేకా మర్డర్ కేసు 10 రోజుల్లో తేలిపోయి ఉండేది ‘ అంటూ దస్తగిరి చేసినట్టుగా చెబుతున్న ప్రకటన – మొత్తం ప్రతిపక్ష నేతలు ఈ మూడున్నరేళ్లల్లో జగన్ కు చేసిన డ్యామేజ్ కంటే కూడా బలమైనది . సీబీఐ దర్యాప్తు ‘వేగం’పుంజుకుంది అని దస్తగిరికి నమ్మకం కుదిరింది అని అతను చేసిన ఈ ప్రకటన ను బట్టి అంచనా వేయవచ్చు . అది ఎక్కడికి వచ్చి ఆగుతుందో తెలియదు. వీటి నేపధ్యం లో రాష్ట్ర రాజకీయం ఒక్కొక్క అడుగే ఎన్నికల దిశగా పడుతుంటే…. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని ఏమి చేయాలి అనే విషయం వీర్రాజుకు, జీవీయల్ నరసింహారావు కు అర్ధం కావడం లేదు . అయితే , వారి నిర్ణయాత్మాకతకు కేంద్ర బీజేపీ పెద్దలు విషయాన్ని వదిలేయక పోవచ్చు.
వైసీపీ, టీడీపీ గురించిన లోతైన అవగాహన కేంద్ర పెద్దలు – నరేంద్ర మోడీ, అమిత్ షా కు ఉంది. వారి అవగాహనకు అనుగుణం గా జే. పీ. నడ్డా నిర్ణయం తీసుకుంటారు. నిజానికి, ఏ రాష్ట్రం లో జరిగే శాసన సభ ఎన్నికల ఫలితాలు అయినా ( మన రాష్ట్రం లో లోకసభ ఎన్నికలు కూడా ) ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించే రాజకీయ పార్టీ , ఆ రాష్ట్రం లో పనిచేసే ప్రతిపక్ష పార్టీలపైనే పని తీరు పై ఆధారి పడి ఉంటాయి. కేరళ ఉదాహరణ తీసుకుంటే , ప్రతి అయిదు సంవత్సరాలకు ఒక సారి అధికార పక్షాన్ని దించి ప్రతిపక్షాన్ని గద్దె ఎక్కిస్తుంటారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ పెద్దల ప్రమేయం గానీ , జోక్యం గానీ ఏమీ కుదరవు . ఈ ఆనవాయితీ కి భిన్నం గా… మొన్నీమధ్య కేరళలో జరిగిన ఎన్నికల్లో – పినరయి విజయన్ నాయకత్వం లోని సిపిఎం కూటమిని, వరుసగా రెండో సారి కేరళ ఓటర్లు గద్దె ఎక్కించారు.
తమిళనాడు లో అన్నా డీఎంకే ను దించేసి డీఎంకే ను గెలిపించారు. కర్ణాటక లో కేంద్ర పెద్దలు ఏం నిర్ణయిస్తారో తెలియదు. ఆంధ్రప్రదేశ్ విషయం వచ్చేసరికే, కేంద్ర పెద్దల ప్రస్తావన వస్తోంది.ఇక్కడ ఎవరు గెలిస్తే తమకు లాభమో బీజేపీ కేంద్ర పెద్దలు అంతర్గతం గా ముందుగానే డిసైడ్ చేస్తారు. ఇప్పటి కైతే, వైసీపీ…. టీడీపీ కూడా కేంద్ర ప్రభుత్వం పట్ల అవసరానికి మించిన సుహృద్భావం ప్రదర్శిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం లో ఇచ్చిన చట్టబద్ధమైన హామీల వైపు కేంద్రం కన్నెత్తి చూడకపోయినప్పటికీ ; కేంద్ర పెద్దలను నిలదీయలేని పరిస్థితుల్లో ఉంది . కేంద్ర బడ్జెట్ బాగుందని రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. అందుకే , సోము వీర్రాజు లాటివారు ఈ రెండు పార్టీల తోనూ చెడుగుడు ఆడుకుంటున్నారు.
కేంద్ర పెద్దలు గనుక; తమకు వైసీపీయే బెటరు అనుకుంటే ; డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఇప్పుడు జిల్లాల్లో పని చేస్తూ ఉన్న ఎస్పీలు, డీఎస్పీలు , సీ ఐ లు ఎక్కడ ఉన్న వారు అక్కడే ఉంటూ తమ సేవలు అందిస్తారు .వాలంటీర్లు, గృహ సారధుల పర్యవేక్షణలో ఎన్నికలు…. ఎటువంటి అల్లర్లు లేకుండా…. జరుగుతాయి. కేంద్ర పెద్దలు తమకు అనుకూలంగా ఉంటారనే భావం లోనే వైసీపీ నేతలు ఉన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా అదే అభిప్రాయం తో ఉన్నట్టు కనబడుతున్నది.
ఇప్పటికిప్పుడైతే, కేంద్ర ఆలోచనా తీరుపై స్పష్టత లేదనే చెప్పాలి. మరో నాలుగదు నెలలు గడిస్తే గానీ ఏ సంగతీ చెప్పలేం అంటున్నారు రాజకీయ వైద్యులు . ప్రస్తుతానికి ఏపీ రాజకీయాన్ని వెంటిలేటర్ పై ఉంచి కేంద్ర బీజేపీ పెద్దలు నడిపిస్తున్నారు .కేంద్రం ఒక నిర్ణయం తీసుకునే దాకా; జై సోము వీర్రాజు. ఆయన ఆడింది ఆట , పాడింది పాట.
(లాయర్ పత్రిక సౌజన్యంతో )