Suryaa.co.in

Family

ఆకాశంలో సగమై.. నువ్వే జగమై..?

మగువా మగువా
లోకానికి తెలుసా నీ తెగువ..
అలా తెలిసే నీ విలువ
మహిళా దినోత్సవం..
స్త్రీజాతికి బ్రహ్మోత్సవం!

ఒకనాటి నువ్వు..
నలిగిపోయే పువ్వు..
వాడిపోయిన నవ్వు..
అలా కాదని…
శ్రీకారం చుట్టిన పోరాటం
సమానత్వం కోసం
నీ ఆరాటం..
యాగాలు చేసి..
యుగాలు దాటి..
ఆడది అబల కాదు సబలని
స్త్రీ రూపు దాల్చిన బాహుబలని..!

ఎన్నెన్ని యుద్ధాలు చేసినా
రుద్రమ దేవిగా…
వీర మాంచాలిగా..
ఝాన్సీలక్ష్మిగా..
కత్తి పట్టిన చేతికి
మళ్లీ ఎప్పుడొచ్చిందో గరిట
ఎలా అయ్యావో
వంటింటి కుందేలుగా..
పురుషాధిక్యం..
మగాడి పెత్తనం..
పితృస్వామ్యం..
నామమాత్రమే అయిపోయింది
నీ భాగస్వామ్యం..
బతుకే అయింది అగమ్యం!

ఆధునిక యుగంలో
థాచర్..ఇందిర..
నందిని..ప్రతిభ..
మాయ..మమత..
సుష్మా…వీరంతా స్త్రీజాతి
చరిష్మా..
నాయికలై..ఏలికలై
విరాజిల్లినా..
పులిలా పూలన్ దేవి
విజృంభించినా..
ఇంకా మారని నీ గతి..
చట్టాలకే పరిమితమైన ప్రగతి
ఇప్పటికీ కానరాని
అచ్చమైన పురోగతి..!

చట్టసభల్లో నువ్వే..
ఉద్యోగాల్లో నువ్వే..
ధైర్యంలో నువ్వే..
త్యాగంలోనూ నువ్వే..
ఇంటిని పోషిస్తూ..
కుటుంబాన్ని నడిపిస్తూ..
స్కూటీ..కారు..
షిప్పు..విమానం..
టాంకర్..బంకర్..
నువ్వు లేనిదెక్కడ..
నువ్వే లేని జగతికి
అసలు విలువెక్కడ
అప్పుడది
కప్పల తక్కెడ..!

ఎన్నో గెలుపులు..
ఇంకెన్నో మలుపులు..
అలుపే లేని పరుగు..
ప్రతిబంధకాలు..
పతి బంధనాలు చేధించి
సుదూర తీరాలు చేరినా
హిమాలయాలే
నీ ముందు చిన్నబోయినా
ఇంకా ఏదో వెలితి..
ఇప్పటికీ ఇక్కడో ఎక్కడో
నీ బ్రతుకు అప్పుడప్పుడు
కర్పూర హారతి..
పురుషాధిపత్యానికి
బలైపోయే నీ నిరతి..!

అందుకే..ఇలాంటి
ఓ సందర్భం..
గుర్తు చేస్తూ నీ దర్పం..
ఉద్భోదిస్తూ కర్తవ్యం..
కాకూడదని నీ పోరాటం
అపసవ్యం..
సుస్థిరమైన నీ రేపటి కోసం
నేటి నుంచే సమానత్వం..
అదే కావాలి నీ తత్వం..
మొన్నటి అలవు..
నిన్నటి తరంగమై..
నేటి కెరటమై…
రేపటి మహాసాగరమై..
మరో నాటికి
ఆకాశంలో సగమై
నువ్వే జగమై..!
మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో..

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE