– 24 గంటల ఉచిత కరెంటు ఉండగా రైతులపై కొత్త భారం ఎందుకు..?
– బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పీఎం కుసుమ్ స్కీం ఎందుకు అమలు చేయడం లేదు.?
– అర్వింద్ పై తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్ : ప్రధానమంత్రి కుసుమ్ స్కీం అమలుపై బీజేపీ ఎంపీ అర్వింద్ చేసిన కామెంట్స్ పై తెలంగాణ పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ వై.సతీష్ రెడ్డి. తెలంగాణలో 24 గంటల పాటు అది కూడా ఉచితంగా వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తోంటే రైతులపై అదనపు భారం మోపే కుసుమ్ స్కీం అవసరం ఏముందని ప్రశ్నించారు. తెలంగాణలో పీఎం కుసుమ్ స్కీం అమలు చేస్తే రైతులపై మోయలేని భారం పడటం తప్ప వారికి ఉపయోగం ఏమీ ఉండదని సతీష్ రెడ్డి చెప్పారు.
పీఎం కుసుమ్ స్కీంలో 5HP సబ్ మెర్సిబుల్ పంప్ కోసం సోలార్ ప్యానల్స్ ఏర్పాటుకు రూ. 2,73,548 ఖర్చు అవుతుందని ఇందులో కేంద్రం 30 శాతం మాత్రమే సబ్సిడీ ఇస్తోందని. అంటే కేవలం 80 వేలు మాత్రమే కేంద్ర ఇస్తుందని, మిగతా రూ.1,93,450 రూపాయలు రైతులే చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం నేరుగా వ్యవసాయ కరెంట్ కనెక్షన్ తీసుకుంటే రూ.5,500 ఖర్చు అవుతుందన్నారు. ఇప్పటికే కేంద్రానికి 300 సోలార్ పంపుసెట్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని సతీష్ రెడ్డి తెలిపారు.
అది కూడా అటవీ ప్రాంతాల్లోని మూరుమూల గ్రామాల్లో విద్యుత్ లైన్లు వేసేందుకు అటవీశాఖ అనుమతులు రాని ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తున్న రైతుల కోసం అడిగామని వివరించారు. దీనికి సంబంధించి రెడ్కో సంస్థ వెబ్ సైట్ లో వివరాలు కూడా పెట్టామని, రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా చేపట్టామని తెలిపారు. అయితే రైతుల నుంచి ఇప్పటి వరకు ఒక్క అప్లికేషన్ కూడా రాలేదన్నారు. అలాగే.. రాష్ట్రంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో,తహశీల్దార్ ఆఫీసుల దగ్గర ఫ్లెక్సీలు పెట్టి ప్రచారం చేసిందని దాని ద్వారా కేంద్రానికి నేరుగా ఏమైనా అప్లికేషన్లు వచ్చి ఉంటే తమకు తెలపాలన్నారు.
మరోవైపు.. కుసుమ్ స్కీంలో ఆఫ్ గ్రిడ్ సోలార్ వ్యవస్థ వ్యవసాయబావుల దగ్గర ఏర్పాటు చేస్తే కేవలం 7 నుంచి 8 గంటలు మాత్రమే విద్యుత్ పొందే అవకాశం ఉందని రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. సాయంత్రం నాలుగున్నర తర్వాత సోలార్ ప్యానల్స్ విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం తగ్గిపోయి మోటార్లు నడిచే పరిస్థితి ఉండదని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుండటంతో రైతులకు ఇప్పుడు వాళ్లకు కావాల్సినప్పుడు విద్యుత్ ను వాడుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయతో పాటు.. ప్రాజెక్టుల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగి బీడు భూములు కూడా సాగులోకి వచ్చాయన్నారు.
కాబట్టి సోలార్ ప్యానల్స్ బిగించి వాటి ద్వారా ఆదాయం పొందాల్సిన అవసరం రైతులకు లేదన్నారు. మధ్యప్రదేశ్ లో రాష్ట్ర సబ్సిడీ 60 శాతానికి పెంచిందన్న అర్వింద్.. అక్కడ 24 గంటల కరెంట్ సదుపాయం ఉందా అని ప్రశ్నించారు. మొతేరాలో 100 శాతం సోలార్ ప్యానల్స్ లో విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పిన అర్వింద్ కు.. తెలంగాణలోని రెండు గ్రామాలు చాలా ఏళ్ల క్రితమే వందశాతం సోలార్ గ్రామాలుగా మారాయనే విషయం తెలియకపోవడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు సతీష్ రెడ్డి. బీజేపీ అధికారంలో ఉన్న కర్నాటక, ఉత్తరాఖండ్ లో కుసుమ్ స్కీం ప్రతిపాదనలు ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, యూపీలో ఇప్పటి వరకు ఒక్క యూనిట్ కూడా ఎందుకు ఇన్ స్టాల్ కాలోదో అర్వింద్ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇండస్ట్రియల్ కారిడార్లలోనూ సోలార్ విద్యుత్ ను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. అలాగే.. పరిశ్రమల్లో విద్యుత్ పొదుపు విధానాలపై అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్టు చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రెన్యూయెబుల్ ఎనర్జీని ప్రోత్సహిస్తోందని రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి తెలిపారు. ఇవేవీ తెలియకుండా అర్వింద్ మాట్లాడారని మండిపడ్డారు.
వ్యవసాయాన్ని పూర్తిగా కార్పొరేట్ల చేతులో పెట్టాలని కుట్రలు చేసిన బీజేపీకి చెందిన ఎంపీ అర్వింద్.. రైతుల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వళ్లించినట్టుగా ఉందని సతీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. రైతులను కార్లతో తొక్కించి చంపిన చరిత్ర ఉన్నోళ్లు.. రైతుల పక్షాన మాట్లాడినట్టుగా నటించడం సిగ్గుచేటన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని పసుపు రైతులను నిండా ముంచిన అర్వింద్.. ఏ ముఖం పెట్టుకుని రైతుల గురించి మాట్లాడుతున్నారో చెప్పాలన్నారు.