-ఇక నుండి అవినీతికి వీల్లేదనడమంటే.. గత 42 నెలలుగా అవినీతికి గేట్లు తెరిచినట్లేనా?
-కామెడీలో ఛార్లీ చాప్లిన్ తో పోటీ పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు జగన్ రెడ్డి వ్యాఖ్యలు
– యనమల రామకృష్ణుడు
లక్ష గొడ్లను తిన్న రాబంధు.. ఇక మాంసాహారం ముట్టుకోనంటూ ప్రమాణం చేసినట్లుంది మంత్రులు ఎవరూ అవినీతి చేయడానికి వీల్లేదు అని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పడం. సుమారు రూ.43 వేల కోట్ల ప్రజాధనం దోపిడీ కేసులో 24 సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లు, 16 నెలల జైలు శిక్ష అనుభవించి దేశంలోనే అత్యంత అవినీతి పరుల జాబితాలో అగ్ర స్థానంలో ఉన్న జగన్ రెడ్డి అవినీతి చేయడానికి వీల్లేదని చెప్పడం ఈ శతాబ్దంలోనే అతిపెద్ద జోక్. అదే సమయంలో ఇకపై మంత్రులు ఎవరూ అవినీతి చేయడానికి వీల్లేదని చెప్పడమంటే.. 42 నెలలుగా అవినీతి చేసుకోవడానికి అధికారికంగానే అనుమతి ఇచ్చారా అనే విషయంపై కూడా జగన్ రెడ్డి క్లారిటీ ఇస్తే బాగుంటుంది. మూడున్నర సంవత్సరాలుగా ల్యాండ్-శాండ్-వైన్-మైన్ దోపిడీతో రాష్ట్రాన్ని సాంతం స్వాహా చేశారు. సహజ వనరుల్ని మింగేశారు. అలాంటి జగన్ రెడ్డి ఇప్పుడు క్యాడర్ ను అప్రమత్తం చేయడం హాస్యాస్పదంగా ఉంది. మూడున్నరేళ్ల పాలనలో దేశంలోనే అత్యంత అవినీతిమయమైన ప్రభుత్వం గల రాష్ట్రంగా ఏపీని జగన్ రెడ్డి తీర్చిదిద్ది దేశస్థాయిలో రాష్ట్ర ప్రతిష్ట నాశనం చేశారు.
అలాంటి అవినీతిపరుడైన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.. ఇప్పుడు తన ప్రమేయం లేకుండా అవినీతి చేయడానికి వీల్లేదు అనేలా తన ‘రెడ్డి’ సలహాదారులు మినహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల నుండి.. కింది స్థాయి వరకు ఉన్న తన అనుచరుల్నే బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. రెండు రోజుల క్రితం జగన్ రెడ్డి ఇకపై అవినీతికి అంగీకరించను అనడం పరిశీలిస్తే.. ఇప్పటి వరకు ఇష్టానుసారం అవినీతి చేసుకోవడానికి అనుమతిచ్చినట్లు అంగీకరించారు.
గత మూడున్నరేళ్లలో అక్రమ మైనింగ్ లో ఏపీ దేశంలోనే మూడో స్థానంలో ఉంది. అందుకు సాక్ష్యాలు ఇసుక, బీచ్ శాండ్, లేటరైట్ పేరుతో ఏజెన్సీలో జరుగుతున్న బాక్సైట్ అక్రమ మైనింగ్ నుండి.. నిన్న మొన్న విశాఖ జిల్లాలోని రుషికొండకు కొట్టిన బోడిగుండు వరకూ లెక్కకు మించిన సాక్ష్యాలు కళ్లముందున్నాయి. ఇసుకలో జగన్ రెడ్డి వేల కోట్లు మింగేస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. బీచ్ శాండ్ వేలాది ఎకరాల్లో తవ్వేస్తూ అమ్మకాలు చేస్తూ జేబులు నింపుకోవడమే కాదు.. తాడేపల్లి ఖజానా నింపుకుంటున్నారు. ఇక మద్య నిషేధం పేరుతో రాష్ట్రంలోని మద్యం వ్యాపారం మొత్తాన్ని శాసిస్తూ ఇప్పటికే సుమారు రూ.30వేల కోట్లు కొల్లగొట్టారు. ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో చేసిన దోపిడీ, ఆ స్థలాల చదును పేరుతో చేసిన దోపిడీ సొమ్ముతో అంతిమంగా నిండింది తాడేపల్లి ఖజానాయే. విశాఖ రాజధాని పేరుతో జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి రూ.40వేల కోట్ల విలువైన భూముల్ని తమ ఖాతాల్లో వేసుకున్నారు.
చివరికి ప్రజల ఆస్తులైన విశాఖ స్టీల్ అమ్మకానికి పెట్టి అందులో వాటాలు పంచుకున్నారు. దశాబ్దాలుగా ప్రభుత్వాలు సృష్టించిన వేలాది ఎకరాల భూముల్ని, సంస్థల్ని అడ్డగోలుగా పందేరానికి పెట్టారు. లక్షల కోట్లు అప్పులు తెస్తూ కూడా రోడ్డున పడ్డ రైతుల్ని, ఉద్యోగులకు నెల జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారు. తండ్రి అధికారంలో ఉన్నపుడు జగన్ రెడ్డి చేసిన అవినీతి, అరాచకాలను మించి తాను అధికారంలోకి వచ్చాక చేశారు. అలాంటి జగన్ రెడ్డి ఇప్పుడు అసలు అవినీతికి పాల్పడడానికి వీల్లేదు అని చెప్పడం చూస్తుంటే ఇంతకు మించిన హాస్యం చార్లీ చాప్లిన్ లాంటి హాస్య నటులకు కూడా సాధ్యం కాదేమో అనిపిస్తోంది. జగన్ రెడ్డి ఇప్పటికైనా ఇలాంటి కామెడీలు చేయడం మాని.. అప్పుల పాలై, అవస్థలు పడుతున్న రాష్ట్ర ఖజానాను మెరుగుపర్చే ప్రయత్నాలు చేయండి.