-
టీడీపీ సోషల్‌మీడియాలో వెల్లువెత్తిన ఆగ్రహం
-
వైవి సుబ్బారెడ్డి సిఫార్సుతో ఒంగోలులో డీఎస్పీ పోస్టింగ్
-
బాలినేని అడ్డుకున్నా ఆయనకే పోస్టింగ్
-
తర్వాత దర్శికి బదిలీ.. అక్కడా ఆగని అరాచకాలు
-
ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి కోసం శ్రమదానం ఆరోపణలు
-
‘మంచి ప్రభుత్వం’ పోస్టింగులపై సోషల్ మీడియా తమ్ముళ్ల వ్యంగ్యాస్త్రాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
కూటమి సర్కారు అవతరించి ఆరునెలలయిపోయింది. అయినా ఇంకా పాలనలో పైనుంచి కిందవరకూ, జగనన్న పాలన రంగు-రుచి-వాసనలే. జగన్ జమానాలో విద్యుత్, దేవాదయ శాఖలను వెలిగించిన అధికారులకే ఇంకా అందలం. ఇప్పుడు తాజాగా కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం కుంభకోణంపై వేసిన సిట్‌లో కూడా, జగన్ పాలన వాసనే కనిపించడంతో తెలుగుతమ్ముళ్లు సోషల్‌మీడియాలో అసంతృప్తితో చెలరేగిపోతున్నారు.
జగన్ జమానాలో కానిస్టేబుల్ నుంచి ఎస్పీల వరకూ విధేయతతో పనిచేసి, వైసీపీ కార్యకర్తలకు సైతం ఈర్ష్య కలిగించిన అధికారులు ఇంకా కీలకస్థానాల్లో కొనసాగుతున్నారు. అదానీతో ఒప్పందాలు, పీపీఏలో కీలకపాత్ర పోషించి వారికి వడ్డీలు కూడా చెల్లించి, అందులో కొంత నాటి పాలకులకు, మరికొంత తాము స్వాహా చేసిన నాటి విద్యుత్ శాఖ బాసులు.. ట్రాన్సుకోలో జగనన్నకు మేళ్లు చేకూర్చిన ఇంకొందరు బాసులు, ఇప్పటికీ అదే స్ధానాల్లో కొనసాగడానికి తెరవెనుక సూత్రధారులెవరన్న చర్చ ఇంకా జరుగుతోంది. దేవాదయ ధర్మాదయ శాఖలో పనిచేసిన బాసు ఇప్పుడు రెండు పదవుల్లో దర్జాగా వెలిగిపోతున్నారు.
జగన్ జమానాలో వేల కోట్లకు పడగలెత్తిన జగన్ బినామీ కంపెనీగా ముద్రపడ్డ షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌పై.. ఉక్కుపాదం మోపాల్సిన పాదాలు, ఇంకా మొహమాటంతో తడబడుతున్న వైనం తమ్ముళ్లకు రుచించటం లేదు. సరే ఇక ‘మేఘా’ వెలుగుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఏ పాలకులు ఉన్నా తొలి ముద్ద వారికే. ఆ ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ముందు, రవిశంకర్ కూడా దిగదుడుపే.
ఈ అసంతృప్తి పరంపరంలో తాజాగా మరో వైసీపీ నియామకం చేరింది. జగన్ హయాంలో నాటి టీటీడీ చైర్మన్, ఇప్పటి ఎంపి వైవి సుబ్బారెడ్డి సిఫార్సుతో డీఎస్పీ, అప్పటి భూముల కుంభకోణంపై వేసిన సిట్‌లో పనిచేసిన అశోక్‌వర్ధన్‌రెడ్డికి.. రేషన్‌బియ్యం అక్రమ రవాణపై వేసిన సిట్‌లో స్థానం దక్కింది. వినీత్ బ్రిజ్‌లాల్ చైర్మన్‌గా వేసిన సిట్‌లో రెడ్డిగారిని నియమించడంతో, టీడీపీ సోషల్‌మీడియా గగ్గోలు పెడుతోంది.
రెడ్డిగారు ఒంగోలు, దర్శి డీఎస్పీగా పనిచేసిన రోజుల్లో టీడీపీ కార్యకర్తలను చావచితక్కొట్టి కేసులు బనాయించిన శుభదినాలను తమ్ముళ్లు సోషల్‌మీడియాలో గుర్తుచేసుకుని బావురుమంటున్నారు.
వైవి సుబ్బారెడ్డి సిఫార్సుతో వచ్చిన డీఎస్పీ రెడ్డిగారు, అప్పటి ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గీయులపై, భూముల కుంభకోణంలో కేసుల్లో ఇరికించారట. మరి అదే కుంభకోణంలో ఉన్న వైవి సుబ్బారెడ్డి మనుషులను మాత్రం, వదిలేశారన్నది నాడు బాలినేని చేసిన ఆరోపణ. దానిపై అగ్గిరాముడైన బాలినేని, ఆ వ్యవహారంపై నాటి ఒంగోలు ఎస్పీతో ఘర్షణకు దిగిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు.
అశోక్‌వర్ధన్‌రెడ్డి నియామకాన్ని సవాలుగా తీసుకున్న బాలినేని.. తాడేపల్లి వెళ్లి పంచాయతీ పెట్టడంతో, చివరాఖరకు రెడ్డిగారిని దర్శికి బదిలీ చేశారు. ఎన్నికల ముందు అక్కడ వైసీపీకి విశేష -విశిష్ట సేవలందించి, అక్కడి వైసీపీ రెడ్డిగారి కళ్లలో మెరుపులు చూశారన్నది తమ్ముళ్ల ఆరోపణ. అక్కడి వైసీపీ అభ్యర్ధిని గెలిపించేందుకు డీఎస్పీ రెడ్డిగారి శ్రమదానం ఫలించి, టీడీపీ మహిళా అభ్యర్ధి ఓడిపోయిందన్నది తమ్ముళ్ల గుస్సా.
అలాంటి అధికారిని కీలకమైన రేషన్‌బియ్యం అక్రమ రవాణాపై వేసిన సిట్‌లో నియమించడంపై, తమ్ముళ్లు సొషల్‌మీడియాలో యమా సైటర్లు వేస్తున్నారు. ‘‘మంచి ప్రభుత్వం.. మంచి పోస్టింగులు.. ఇక ఐపిఎస్‌లను మాత్రం రిజర్వులో పెట్టడం ఎందుకు? వారికీ ఏమైనా మంచి పోస్టింగులిచ్చి పుణ్యం కట్టుకోండి. వీళ్లు చేసిన పుణ్యం ఏమిటి? వాళ్లు చేసిన పాపమేమిటిః? అంతా ఆ తాను ముక్కలే కదా?.. కాలు మాత్రమే మనది చెప్పు మాత్రం జగన్‌ది.. మంచిప్రభుత్వంలో ప్రతీకారాల గురించి మాట్లాడటం నేర మే కాదు. నిషిద్ధం కూడా’’.. అంటూ వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు.
వైసీపీకి విశిష్ట సేవలందించిన అధికారిని.. కీలకమైన రేషన్‌బియ్యం విచారణ బృందంలో చేరిస్తే, ఆ వివరాలు వైసీపీకి లీకవుతాయన్న కనీస స్పృహ కూడా లేకుండా, రెడ్డిగారిని నియమించిన ఆ మహానుభావుడెవ రన్నది, సోషల్‌మీడియా సైనికుల ప్రశ్న. తమ్ముళ్ల రోదన బాగానే ఉంది. మరి వాటికి జవాబిచ్చేదెవరు?
1 COMMENTS