– ఎన్నికలకి ముందు జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరితే అరెస్టులా?
-అంగన్ వాడీ, ఆశాల న్యాయమైన డిమాండ్లు తక్షణమే నెరవేర్చాలి
– తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్
ఎన్నికలకి ముందు నాటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ రెడ్డి ఊరూవాడా తిరుగుతూ, తనని కలిసిన అందరి తలపై చేయిపెట్టి ఎన్నో హామీలిచ్చారని, నేడు ప్రభుత్వంలోకొచ్చాక ఆ హామీలు నెరవేర్చాలని కోరుతూ అంగన్ వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్ల శాంతియుతంగా ఉద్యమిస్తే పోలీసుల్ని ప్రయోగించి నిర్దాక్షిణ్యంగా అణచి వేయడం నిరంకుశత్వమేనని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు.
నిన్నఅంగన్ వాడీ, నేడు ఆశా వర్కర్లని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ మంగళవారం మీడియాకి ఒక ప్రకటన విడుదల చేశారు. మీ పాదయాత్రలో మీ వెంట నడిచిన అంగన్ వాడీ, ఆశా అక్కాచెల్లెళ్లమ్మలకి ఇచ్చిన హామీలలో ఒక్కటైనా నెరవేర్చని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తీరుని నిరసిస్తూ, తమకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలనే డిమాండ్‌తో ఆందోళనకి దిగిన మహిళల్ని అరెస్టు చేయడం వైసీపీ అరాచకపాలనకి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంగన్ వాడీలకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవు మంజూరు చేయాలని, సర్వీసులో ఉండి చనిపోయిన వారికి 50 లక్షలు పరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, రేషన్‌కార్డులు తొలగించి సంక్షేమపథకాలు అందకుండా చేయొద్దని, ఖాళీగా వున్న అంగన్‌వాడీ వర్కర్లు-హెల్పర్లు పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేయడం అంగన్వాడీ అక్కాచెల్లెమ్మలు చేసిన నేరమా ముఖ్యమంత్రి గారు అని లోకేష్ ప్రశ్నించారు.
కరోనా సమయంలో తమ ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తించిన ఆశా వర్కర్లని ప్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించిన ప్రభుత్వం వారికి కనీసం మాస్కులు, చేతికి గ్లౌజులు, ఇతర రక్షణ పరికరాలు ఇవ్వకపోవడం వివక్షేనని మండిపడ్డారు. కోవిడ్-19 మెడికల్ టీములతో వెళ్లి విధి నిర్వహణలో కోవిడ్ సోకి మరణించిన ఆశ కార్యకర్తలకు ఎటువంటి పరిహారం ఇవ్వకపోవడం ఏంటని నిలదీశారు.
పరిహారం, భీమా సౌకర్యం, సెలవులు వంటి న్యాయమైన డిమాండ్లతో చలో కలెక్టరేట్ పేరుతో నిరసన తెలిపితే రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లని అరెస్టు చేయించారంటే, ప్రభుత్వం ఎంత అమానవీయంగా వ్యవహరిస్తుందో అర్థం అవుతోందన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకి ఉద్యమించిన అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలంతా మహిళలే అయినా, నిర్దయగా వారిని అరెస్టు చేసి ఈడ్చి వ్యానుల్లో కుక్కుకుంటూ తీసుకెళ్లినది మహిళా పక్షపాత ప్రభుత్వం ఎలా అవుతుందో స్పష్టం చేయాలని నిలదీశారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన మూర్ఖపు బుద్ధిని మానుకుని, అంగన్ వాడీలు, ఆశా కార్యకర్తలకి తానిచ్చిన హామీలు నెరవేర్చడంతోపాటు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం వ్యవస్థలో రాజ్యాంగం ఇచ్చిన నిరసన తెలిపే హక్కుని నిర్బంధాల ద్వారా హరించడం ముఖ్యమంత్రి మానుకోవాలని హితవు పలికారు. అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తల ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు.